వానొచ్చె.. వరదొచ్చె | Meteorology Department Alert Heavy Rains In Telangana Next 2-3 Days | Sakshi
Sakshi News home page

వానొచ్చె.. వరదొచ్చె

Published Sun, Jul 10 2022 1:06 AM | Last Updated on Sun, Jul 10 2022 3:16 PM

Meteorology Department Alert Heavy Rains In Telangana Next 2-3 Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌:  నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. పలుచోట్ల చెరువులు, చిన్న ప్రాజెక్టులు నిండిపోయాయి. గోదావరి, కృష్ణా, వాటి ఉప నదులు జలకళను సంతరించుకున్నాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో 20.6 సెంటీమీటర్లు, నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో 19.1, భైంసాలో 16.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. సుమారు 20 ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకుపైనే భారీ వర్షం కురిసింది.

మొత్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు తెలంగాణవ్యాప్తంగా సగటున 4.01 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు 18.9 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 30.5 సెంటీమీటర్లు కురిసింది. ఇది సాధారణం కంటే 61 శాతం అధికం కావడం గమనార్హం. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో అత్యధిక, 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 

మరో రెండు, మూడు రోజులు 
రుతు పవనాలకు గత రెండు రోజులుగా ఉపరితల ఆవర్తనం తోడుకాగా.. శనివారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా మరో రెండు, మూడు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాల్లో కుండపోత కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. 

పంటల సాగులో జాగ్రత్త 
భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పొలాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక బులిటెన్‌ విడుదల చేసింది. వర్షాధార పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు చేన్లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని పేర్కొంది. నీరు సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లో మధ్యకాలిక రకాల వరి నారు పోసుకోవాలని సూచించింది. వర్షాలతో నారుమళ్లలో తాటాకు తెగుళ్లు వస్తాయని, వాటి నివారణకు లీటరు నీటిలో ప్రోపినోపాస్‌ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలని పేర్కొంది. 


ఉమ్మడి ఆదిలాబాద్‌: పోటెత్తిన వాగులు 
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. చెరువుల్లో వరద చేరుతోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి, ఎదులబంధం లింగన్నపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంద్రవెల్లి, నార్నూర్, బోథ్‌ మండలాల్లో 30కిపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంటాల, పొచ్చెర జలపాతాలకు వరద పోటెత్తింది. ఆసిఫాబాద్‌ జిల్లాలో పెంచికల్‌ పేట, బెజ్జూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

ఉమ్మడి నిజామాబాద్‌: వానతో ఆగమాగం 
రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో నిజామాబాద్, ఆర్మూర్‌ సహా ప్రధాన పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు మండలాల్లో వాగులు పొంగి రోడ్లు, లోలెవల్‌ వంతెనలు కొట్టుకుపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. కామారెడ్డి జిల్లాలో 57 చెరువులు నిండి అలుగు పారాయి. బాన్సువాడలో రేకులషెడ్డు కూలి నలుగురికి గాయాలయ్యాయి. 



ఉమ్మడి కరీంనగర్‌: దంచికొట్టిన వాన 
కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో శనివారం వాన దంచికొట్టింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం పైకప్పు కూలిపడింది. ధర్మపురి మండలం నాగారంలో ఇల్లు ధ్వంసమైంది. పెగడపల్లి మండలం దీకొండలో విద్యుత్‌ తీగలు తెగిపడి 9 గొర్రెలు చనిపోయాయి. 

ఉమ్మడి వరంగల్‌: పోటెత్తిన వరద 
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్‌లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా కురవిలో మున్నేరు వాగు ఉధృతంగా పారుతోంది. మహాముత్తారం మండలంలో పెద్దవాగు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కురవి మండలం కొత్తూరు (జి) శివారులో మున్నేరు వాగు చెక్‌డ్యాంపై నుంచి ప్రవహిస్తోంది. పరకాల సమీపంలో చలివాగు పొంగిపొర్లుతోంది. 

ఉమ్మడి ఖమ్మం: ఆగని వాన 
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గురువారం మొదలైన వర్షం శనివారం సాయంత్రందాకా కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 20 అడుగులు దాటి ప్రవహిస్తోంది. భారీగా వరద వస్తుండటంతో వైరా, పాలేరు, తాలిపేరు రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి.  

ఉమ్మడి మెదక్‌: నీట మునిగిన పంటలు 
ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా పరిధిలో భారీ వర్షం పడింది. పోచారం, ఘనపూర్, బొల్లారం ప్రాజెక్టులు నీటితో నిండుకుండల్లా మారాయి. మెదక్‌లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల గాలివానకు చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. తొగుట మండలంలో కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌: చెరువులకు జలకళ 
మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. వాగుల్లో చెక్‌డ్యామ్‌లు నిండాయి. దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక్క వనపర్తి జిల్లా తప్ప మిగతా చోట్ల వానలు ఓ మోస్తరుగా పడుతున్నాయి. ముసురుపట్టడంతో జనం ఇబ్బందిపడటం కనిపించింది. 

ఉమ్మడి నల్లగొండ: నిండుగా వాగులు 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సద్దల చెరువు అలుగు పోస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. మోటకొండూరు– సికిందర్‌నగర్‌ మధ్య పెద్దవాగు.. ఆత్మకూర్‌(ఎం) పరిధిలో బిక్కేరు వాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. మూసీకి కూడా వరద పెరిగింది. 

నలుగురు మృతి.. మరికొందరు గల్లంతు 
రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో వరద నీటిలో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను శనివారం గుర్తించారు. భద్రాద్రి జిల్లా పర్ణశాల పంచాయతీ పరిధిలోని గుబ్బలమంగి వాగులో కొట్టుకుపోయిన ఏనిక దుర్గమ్మ (55) మృతదేహం చిన్నబండిరేవు సమీపంలో చెట్టుకు చిక్కుకుని కనిపించింది. ఇక మణుగూరు మండలం కోడిపుంజుల వాగులో గల్లంతైన వర్సా శంకర్‌ (30), పాత కొత్తగూడెం ముర్రేడు వాగులో కొట్టుకుపోయిన ఖాజా మొహియుద్దీన్‌ (40) మృతదేహాలు శనివారం ఉదయం లభ్యమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లిన ముస్తాబాద్‌ మండలం గూడెంకు చెందిన కస్తూరి రవి (45) మృత్యువాత పడ్డాడు. 
►శనివారం సాయంత్రం నిజామాబాద్‌ జిల్లా నెమిలికుంట అలుగులో లింగితండాకు చెందిన మక్కల నడిపి సాయిలు (45), దారంగుల రెడ్డి(35) గల్లంతయ్యారు. 
►ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం పడిగాపూర్‌ జంపన్నవాగు బ్రిడ్జిపై వరదలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య, వీఆర్వో బొప్ప సమ్మ కలిసి రక్షించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement