సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇదే సమయంలో దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
కాగా, మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించింది. దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కొత్తగా 10 మొబైల్ ఫుడ్ లాబ్స్ లను త్వరలో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను బలోపేతం చేస్తున్నాం.
రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహిస్తున్నాం. స్ట్రీట్ వెండర్లుకు ఫుడ్ సేఫ్టీ లైసెన్సు లు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీపై రాష్ట్ర సచివాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించాం. ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థలు తప్పని సరిగా FSSAI లైసెన్స్‌ను తీసుకోవాలనే నిబంధనలను అమలు చేస్తున్నాం.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లలను నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 387 హాస్టల్స్ పైన తనిఖీలు నిర్వహించి Fssai లైసెన్సులు విధిగా కలిగి ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యత ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నాం. ఆహారం కల్తీ చేసే సంస్థల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment