ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత వర్గాలు పార్టీలకు అతీతంగా పనిచేసి మేడారం జాతరను దిగ్విజయం చేయాలని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా ములుగు నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేడారం మహాజాతరకు నిధుల మంజూరులో అలస్యమైందని, కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా వెంటనే ఆయన నిధులు మంజూరు చేశారని తెలిపారు.
జాతర ప్రాంతంలో అభివృద్ధి పనులను శాశ్వతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అలాగే జాతరకు నిధులు కేటాయించాలని కోరామని, ఈసారి కేటాయిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అంతకుముందు మేడారంలోని ఐటీడీఏ అతిథిగృహంలో మంత్రి సీతక్క.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఎస్పీ గాష్ ఆలం, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీచైర్‌పర్శన్ బడే నాగజ్యోతితో కలసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
మేడారం జాతరకు ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల తాకిడి జనవరి చివరి వారం నుంచే మొదలవుతున్నందున పనులన్నీ జనవరి 20 నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా రోడ్లు వేయాలని, అవసరమైన చోట మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారంలో పార్కింగ్, వసతుల కల్పనలో ఇబ్బందులు రాకుండా అటవీ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు.
ములుగు ప్రజలకు మొదటి ప్రాధాన్యం..
ములుగులో జరిగిన ర్యాలీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ మంత్రులు, స్థానిక నాయకులు కుట్రలు చేసి తనను అనేక ఇబ్బందుకు గురిచేశారని గుర్తుచేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా వంటి సౌకర్యాలను క ల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ములుగు నియోజకవర్గమే తన ఇల్లని.. మొదటి ప్రాధాన్యం ములుగు ప్రజలకే ఇస్తానని, అవసరం అయితే ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలను కొనసాగిస్తానని సీతక్క చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment