సాక్షి, ములుగు జిల్లా: మేడారం జాతరకు జాతీయ హోదా విషయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ కు జాతీయ హోదా ఇవ్వకుంటే దేనికి ఇస్తారని తలసాని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశంలో జరిగే పండుగలకు జాతీయ హోదా ఇస్తారా అని చురకలంటించారు. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పండుగలకు జాతీయ హోదా ఉండదని, మేడారానికి ఇవ్వమని స్పష్టం చేయడంపై స్పందించారు. కేంద్ర మంత్రి తలతోక లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీకి స్థలం కేటాయించి మూడేళ్ళు అవుతుందని, ఇప్పటి వరకు దానికి అతి గతి లేదని అన్నారు. బీజేపీ నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని దుయ్యబట్టారు.
జాతరకు జాతీయ హోదా ఉండదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
అయితే ఇంతకముందు మేడారం జాతరకు జాతీయ హోదా ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పండుగలకు జాతీయ హోదా ఎక్కడలేదని, కావాలంటే విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి రేణుకాసింగ్, మాజీ రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్, బిజేపి ఓబిసి సేల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులు రెండేళ్లకోసారి జరుపుకునే ప్రకృతిపండుగ మేడారం జాతర అని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకుని కరోనా మహమ్మారి మీద విజయం సాధించి, సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుకున్నానని పేర్కొన్నారు.
చదవండి: 60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి?
గిరిజన విశ్వవిద్యాలయంకు 45 కోట్లు కేటాయించామని, త్వరలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర రాజధానిలో కేంద్రం మ్యూజియం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం నిధుల కేటాయించిందని వెల్లడించారు.గిరిజనులకు బిజేపి, కేంద్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఏడుగురికి మంత్రులు ఇచ్చి, గిరిజనల అభ్యున్నతికీ ప్రధాని మోదీ దోహదపడుతున్నారని తెలిపారు.
చదవండి: మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే?
పోటెత్తిన భక్తులు
మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క ఆగమనంతో రాత్రి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. దీంతో మేడారం జాతర ప్రాంగణమంతా భక్తజన సంద్రంగా మారింది. అటు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వనదేవతలను దర్శించుకొని ఎత్తుబంగారం సమర్పించుకున్నారు.
సీఎం వస్తారా? రారా?
ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు.
తోపులాట
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్ మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధులను పోలీసులు నేట్టేశారు. దీంతో జర్నలిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మీడియా ప్రతినిధులను సముదాయించారు.
Comments
Please login to add a commentAdd a comment