ఖాళీ చేయడం తప్పనిసరి.. రెండు నెలల్లో పునరావాస ప్రక్రియ పూర్తి చేస్తాం
10,600 ఇళ్లను ఖాళీ చేయించి 23 ప్రాంతాలకు తరలిస్తాం
డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు కొత్తగా రూ.300 కోట్లతో ఇళ్లు నిర్మిస్తాం
‘మూసీ ప్రాజెక్టు’పై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ వెల్లడి
హైడ్రా అంటే బూచి కాదు భరోసా.. అనుమతులు లేని నిర్మాణాలనే కూల్చేస్తాం: రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: మూసీ నది రివర్ బెడ్‌తోపాటు బఫర్ జోన్‌లో 10,600 ఇళ్లు, నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించామని.. ఆ ఇళ్లను ఖాళీ చేయించి కుటుంబాలను 23 ప్రాంతాలకు తరలిస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గుర్తించిన ఇళ్లను ఖాళీ చేయడం తప్పనిసరి అంటూనే.. ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించబోమని, ఇళ్లు కూల్చబోమని చెప్పుకొచ్చారు.
రెండు నెలల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇక ‘‘జీహెచ్‌ఎంసీ, ఇతర స్థానిక సంస్థల నుంచి అనుమతి పొంది బఫర్‌జోన్లలో నిర్మించిన ఇళ్లను నేరుగా కూల్చివేయడం లేదని.. ఆ అనుమతులు రద్దు చేసిన తర్వాతే కూలుస్తున్నామని ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో దానకిశోర్, రంగనాథ్ కలసి మీడియాతో మాట్లాడారు.
2026 జూన్ నాటికి మూసీలో మంచినీరు: దానకిశోర్
మూసీ రివర్ ఫ్రంట్‌లో భాగంగా 2026 జూన్ నాటికి మూసీ నదిలో మంచినీరు ప్రవహించాలని సీఎం ఆదేశించారని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ చెప్పారు. ‘‘గోదా వరి నుంచి 5 టీఎంసీల నీటిని మూసీలోకి తరలిస్తాం. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం ఏజెన్సీలను పిలుస్తున్నాం. మూడు నెలల క్రితం మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు మూసీ నది వెంట 55 కిలోమీటర్ల మేర సర్వే చేశారు. అందులో భాగంగా గుర్తించిన ఇళ్లకు వెళ్లి మార్కింగ్ చేసి, రిలొకేషన్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నాం.
ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. కొత్తగా వెళ్లే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలతోపాటు ఉపాధి లభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు 974 ఇళ్లను సర్వే చేసి.. 576 ఇళ్లకు మార్కింగ్ చేశాం. వారిలో 470 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. శుక్రవారం 50 మంది పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లగా.. శనివారం 200 కుటుంబాల వరకు వెళ్లాయి. 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. మూసీని ఖాళీ చేసేందుకు అక్కడి కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి..’’అని దానకిశోర్ వెల్లడించారు.
అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళతామని చెప్పారు. మూసీ రివర్‌బెడ్‌లో నివసిస్తున్న ఇంటి యజమానులతోపాటు కిరాయిదారులకు పునరావాసం, ఉమ్మడి కుటుంబం కాకుండా వారి వారసులకు ఇళ్లు కేటాయించే అంశం కూడా పరిశీలనకు వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఓనర్లకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తున్నామని వివరించారు. మూసీలో నిర్మించిన ఎంజీబీఎస్ బస్‌స్టేషన్, మెట్రో రైల్వేస్టేషన్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.
అనుమతులు రద్దయ్యాకే ఇళ్లు కూల్చేశాం: రంగనాథ్
జీహెచ్‌ఎంసీ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు అనుమతులు ఇచ్చిన ఇళ్లను తాము కూల్చలేదని ‘హైడ్రా’కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. బఫర్‌జోన్లలో నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను మున్సిపాలిటీలు రద్దు చేసిన తరువాతే కూల్చివేశామని చెప్పారు. ఇప్పటివరకు కూల్చినవన్నీ అనుమతులు లేని నిర్మాణాలు, లేదా అనుమతులు రద్దయిన నిర్మాణాలేనని తెలిపారు.
‘‘బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా బూచి కాదు. భరోసా. హైడ్రా సైలెంట్‌గా లేదు. తన పని తాను చేస్తుంది. ధనవంతుల ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, కట్టడాల జోలికి వెళ్లడం లేదనేది వాస్తవం కాదు. వారి ఆక్రమణల కూల్చివేతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. జన్వాడ ఫామ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు.
ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన కాలేజీలపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో.. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారనే చర్యలు తీసుకోలేదు. ఓఆర్‌ఆర్ లోపల 565 చెరువులను గుర్తించాం. ఇందులో 136 చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధిని గుర్తించాం. మిగతావి కూడా గుర్తించాక అన్ని వివరాలు వెబ్‌సైట్లో పెడతాం..’’అని రంగనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment