జాతీయ చేనేత దినోత్సవం: నేతన్నల బతుకు దుర్భరం | National Handloom Day: Power LoomsChanged weavers Life | Sakshi
Sakshi News home page

జాతీయ చేనేత దినోత్సవం: నేతన్నల బతుకు దుర్భరం

Published Sat, Aug 7 2021 12:58 PM | Last Updated on Sat, Aug 7 2021 1:16 PM

National Handloom Day: Power LoomsChanged weavers Life - Sakshi

చేనేత మగ్గంపై బట్ట నేస్తున్న కార్మికుడు

సాక్షి, సిరిసిల్ల: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్‌) మింగేశాయి. వాటిని ఇప్పుడు ఆధునిక మగ్గాలు మింగేస్తున్నాయి. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్టను నేసే నేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది. అనేక కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచింది. వస్త్రాన్ని అందించి, ప్రపంచానికి నాగరికత నేర్పిన నేతన్నల జీవితం కష్టాలు, కన్నీళ్ల కలబోతగా మిగిలింది. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన వస్త్రోత్పత్తి రంగంలో ఆధునికత సంతరించుకుంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ఇది వేదికవుతోంది. చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి, ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేత కళాకారుల ఖిల్లా సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగం ఆధునికత వైపు అడుగులు వేస్తుంది. కరోనా కష్టకాలంలో చేనేత రంగం ఆటుపోట్ల మధ్య ఉంది. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

మరమగ్గాలపై బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తి

చేనేత దినోత్సవ నేపథ్యం ఇదీ..
స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాల ను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్‌ హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి, విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలు పునిచ్చారు. అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా జాతీయ స్థాయిలో ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాల ఎగుమతిలో 90 శాతం భారతదేశం భాగస్వామ్యం ఉండటం విశేషం. చేనేత బ్రాండ్‌గా భారతదేశాన్ని నిలిపేందుకు మద్రాసు విశ్వవిద్యాలయం సెనెట్‌ భవనంలో ప్రధాని, రాష్ట్రపతి చేనేత వస్త్రాల ప్రదర్శనను ప్రారంభించారు. 

ప్రాచీన వారసత్వం..
చేనేత రంగం ప్రాచీన వారసత్వంగా వస్తోంది. భారతదేశ వస్త్ర సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శం. చేనేత మగ్గం ఇప్పుడు మరమగ్గంగా మారి, ఆధునిక మగ్గాలుగా అవతరించి అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా 43 లక్షల నేత కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నాయి. వస్త్రోత్పత్తి కేంద్రాలుగా పలు పట్టణాలు ఖ్యాతిగాంచాయి. షోలాపూర్, భీవండి, ముంబయి, అహ్మదాబాద్, ఇంచన్‌కరంజ్, సూరత్, మాలేగావ్, సిరిసిల్ల, వెంకటగిరి, గద్వాల్, భూదాన్‌ పోచంపల్లి, ఈరోడ్, చీరాల వంటి ప్రాంతాలు వస్త్రోత్పత్తికి నిలయాలుగా మారాయి. చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది.

సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం
సిరిసిల్లలో దేశంలోనే తొలి చేనేత కార్మికుడి కాంస్య విగ్రహం నెలకొల్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేలు ఉన్నాయి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్‌ వస్త్రం, 7 వేల మగ్గాలపై కాటన్‌ వస్త్రోత్పత్తి జరుగుతోంది. సిరిసిల్లలో 25 వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. నిత్యం 34 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్స్‌టైల్‌ పార్క్‌ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. ఇందులో 115 పరిశ్రమల్లో ఆధునిక మగ్గాలపై వస్త్రోత్పత్తి సాగుతోంది. ఇక్కడి వస్త్రాలు ముంబయి, భీవండి, సూరత్, ఢిల్లీ, షోలాపూర్‌ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.

టెక్స్‌టైల్‌ పార్క్‌లో 3 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో కాటన్‌ వస్త్రం అద్దం యూనిట్లు 90 వరకు ఉన్నాయి. ఇక్కడి కాటన్‌ వస్త్రం దేశంలోని 6 రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. సిరిసిల్ల అద్దకంలో అగ్రస్థానంలో ఉంది. రెండో షోలాపూర్‌గా ఖ్యాతిగాంచిన సిరిసిల్లకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్లు, ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడంతో కార్మికులకు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. ఈ ఏడాది రూ.350 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతినిండా పని దొరుకుతోంది.  

క్షీణదశలో చేనేత రంగం
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 36 చేనేత సహకార సంఘాలు ఉండగా వీటిలో 6 వేల మంది సభ్యులున్నారు. నిజానికి 29 సంఘాలు మాత్ర మే సమర్థంగా పని చేస్తుండగా 4 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో 3 సహకార సంఘాలు పని చేస్తున్నాయి. సిరిసిల్ల మరమగ్గాలు అధికంగా ఉండగా చేనేత మగ్గాల సంఖ్య తగ్గిపోయింది. చేనేత మగ్గాలపై పని చేస్తున్నవారందరూ వృద్ధులే. చేనేతపై శిక్షణ ఇచ్చేందు కు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం మూతపడింది. దీంతో చేనేత రంగం క్షీణదశలో ఉంది.

గుత్తాధిపత్యం.. కరువైన ఉపాధి
వస్త్రోత్పత్తి రంగంలో అనేక సమస్యలున్నాయి. నూలు కొనుగోలు నుంచి బట్ట అమ్మకం వరకు కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే పరిశ్రమ బందీ అయ్యింది. ఈ గుత్తాధిపత్యం కారణంగా కార్మి కులకు మెరుగైన ఉపాధి కరువైంది.  ప్రభుత్వమే నూలు డిపోలను ఏర్పాటు చేసి, వస్త్రోత్పత్తికి అవసరమైన నూలు అందిస్తే ఆసాములకు, కార్మికులకు కాస్త మెరుగైన ఉపాధి లభిస్తుంది. కార్మికుల బీమా కల్పించడం, పొదుపు పథకం అమలు చే యడం, హెల్త్‌ కార్డులు ఇవ్వడం, కార్మికుల భార్యలకు గార్మెంట్‌ రంగంలో ఉపాధి కల్పించడం, వా రి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాల్సి ఉంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఇల్లు, పేదలకు అంత్యోదయ కార్డులు, శ్రమించే కార్మికులకు పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలి.

కార్మికుల పొట్ట నింపాలి 
వస్త్ర పరిశ్రమలో శ్రమించే కార్మికుల పొట్ట నింపేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఇప్పుడు ‘పుండు ఒక్క చోట ఉంటే.. మందు మరోచోట రాస్తున్నారు’ ఇది సరైన విధానం కాదు. కార్మికులకు మేలు చేసేలా ఇప్పటికే ప్రభుత్వం కొంత చొరవ చూపింది. కానీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు ఉండాలి. వస్త్రోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలి. స్థానికంగా నూలు డిపోలు ఏర్పాటు చేసి, నేరుగా నూలు అందించాలి. కార్మికుల సంక్షేమానికి బాటలు వేయాలి.
– కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్‌ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement