సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శుక్రవారం వాటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామల్లో కొత్తగా ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర సొంత నిధులతో ఒకే ఏడాది ఇంత పెద్దసంఖ్యలో మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశంలోనే ఇదే ప్రథమంగా చెబుతున్నారు.
కేసీఆర్ హయాంలోనే 21 మెడికల్ కళాశాలలు
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, సీఎం కేసీఆర్ దశాబ్ద కాలంలోనే 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది.ౖ కాగా, వచ్చే ఏడాది ప్రారంభించేందుకు మంజూరు చేసుకున్న 8 మెడికల్ కాలేజీలతో ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు అంటున్నారు.
2014లో 5 మెడికల్ కాలేజీల ద్వారా 850 సీట్లు ఉంటే, 2023 నాటికి 26 మెడికల్ కాలేజీలతో సీట్ల సంఖ్య 3,690కి చేరింది. ప్రభుత్వ ప్రైవేటులో కలిపి ఏటా పది వేల మంది విద్యార్థులను తయారు చేసే స్థాయికి నేడు తెలంగాణ ఎదిగింది.
చట్టంలో మార్పులతో విస్తృత అవకాశాలు
2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు ప్రభుత్వం సవరణ చేసిన సంగతి తెలిసిందే. గతంలో 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు.
తాజా నిర్ణయం వల్ల మన విద్యార్థులకు మరో 520 సీట్లు దక్కాయి. దీంతో పాటు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మరో 1,300 ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి.ౖ ఈ రెండు నిర్ణయాల వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా మొత్తం 1,820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment