సాక్షి ప్రతినిధి, నల్లగొండ: డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్‌ఎల్‌ఎస్) రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెల 26న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రాజెక్టుల మౌలిక వసతులు, డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ తదితర పనులకు అనుమతులు ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్– గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఎఫ్‌ఎల్‌ఎస్ చేపట్టేందుకు రూ.7.40 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు 2013–14 నుంచే ప్రతిపాదనల్లో ఉన్న డోర్నకల్– మిర్యాలగూడ (93.10 కిలోమీటర్ల పొడువు) రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం 2013–14లోనే ఓకే చెప్పింది. ఆ తరువాత దక్షిణ మధ్య రైల్వే చేసిన సూచనల మేరకు సర్వే కోసం రైల్వే శాఖ ఆర్థిక విభాగం 2020లోనే ఓకే చెప్పింది. టెండర్లను పిలిచి ఓకే చేసింది. ఇక, భూసేకరణ, పునరావాసానికి రూ. 1,294.12 కోట్లు అవసరం అవుతాయనే లెక్కలతో సర్వే పూర్తి చేసి 2022 నవంబర్ 10వ తేదీన అందజేసిన నివేదిక ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. దానిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కొత్త లైన్ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఓకే..
ఇదిలా ఉండగానే.. ఇప్పుడు రైల్వే బోర్డు డోర్నకల్ నుంచి గద్వాలకు సూర్యాపేట మీదుగా కొత్త లైన్ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఓకే చెప్పింది. దీంతో డోర్నకల్–గద్వాలలో భాగంగా సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా కొత్త లైన్ కోసం సర్వే చేయనుంది. మిర్యాలగూడ దీని పరిధిలోకే తీసుకువస్తారా లేదా? అన్నది తేలాల్సి ఉంది. గతంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు డోర్నకల్ – మిర్యాలగూడ లైన్ కోసం రైల్వే బోర్డుకు విజ్ఞప్తులు చేశారు. ఇటీవల బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల్లో మాత్రం డోర్నకల్–గద్వాల లైన్ సర్వే ఓకే చెప్పింది. దీనిపై ఎంపీ ఉత్తమ్‌ని సంప్రదించగా దీనిపై తనకు సమాచారం లేదని, రైల్వే బోర్డు అధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: వీఆర్‌ఏల విలీనానికి నో
Comments
Please login to add a commentAdd a comment