యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సచివాలయ నిర్మాణ పనులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే దసరా నాటికి కొత్త సచివాలయం ప్రారంభించాలని సర్కారు నిర్ణయిం చింది. కుదిరితే దసరా రోజునే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం రోడ్లు భవనాల శాఖ అధికారులు పనుల వేగం పెంచా రు. అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తయ్యేలా వర్క్ చాట్ రూపొందించుకొని పని చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి మంది కార్మికులు రాత్రింబవళ్లు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రాత్రిళ్లు ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులు కొనసాగిస్తున్నారు. ప్రధాన నిర్మాణం సిమెంటు పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఫిబ్రవరి నాటికి 4 వైపులా ఏడంతస్తుల ప్రధాన భవనం సిద్ధం కానుంది. ప్రస్తుతం ఒకవైపు మినహా మిగతా మూడు వైపులా ఏడో అంతస్తు పనులు జరుగుతున్నాయి. ఒకవైపు మాత్రం నాలుగంతస్తులే జరిగాయి. ఆ భాగం పనుల్లో వేగం పెంచబోతున్నారు. దేశంలోని అతిపెద్ద సచివాలయ భవన సముదాయాల్లో ఒకటిగా ఈ భవనం రూపొందు తున్న విషయం తెలిసిందే. 26 ఎకరాల విస్తీర్ణం లోని స్థలంలో 6 లక్షల చదరపు అడుగుల మేర ఏడంతస్తుల్లో భవనం రూపుదిద్దుకుంటోంది.
ఏడాదిలోనే పూర్తి చేయాలనుకున్నా..
భవనాన్ని ఏడాదిలో పూర్తి చేయాలనుకున్నా భారీ భవన సముదాయం కాబట్టి దాదాపు రెండేళ్లు తీసుకోనుంది. గతేడాది జూన్‌లో పాత భవనాల తొలగింపు పనులు మొదలుపెట్టారు. ఆ తర్వాత పనులను మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయాలనుకున్నా భూగర్భంలో పెద్ద ఎత్తున రాయి ఉండటంతో పనులు ఆలస్యమయ్యాయి. చుట్టూ భవనాలుండటం, మరోవైపు హుస్సేన్‌సాగర్ చెరువు ఉండటంతో రాతిని పేల్చే పనుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. కంట్రోల్ బ్లాస్టింగ్ పద్ధతిలో రాళ్లను పేల్చి అసలు పనులు మొదలుపెట్టేందుకు దాదాపు రెండు నెలలు పట్టింది. ఆ లెక్కన అసలు పనులు మొదలైనప్పటి నుంచి బేరీజు వేసుకుంటే 22 నెలల్లో పనులు పూర్తికాబోతున్నాయి.
రాజస్తాన్ రాళ్లు వచ్చేశాయ్
పార్లమెంటు భవనానికి వాడిన రాజస్తాన్ ధోల్‌పూర్‌లోని ఎర్ర ఇసుక రాతిని కొత్త సచివాలయం బేస్‌మెంట్‌కు వినియోగించనున్నారు. ఇందుకోసం 1,800 క్యూబిక్ మీటర్ల రాతిని ధోల్‌పూర్ గనుల నుంచి తెప్పించారు. గోడలు, ఫుట్‌పాత్‌లు, ఫ్లోరింగ్‌కు ధోల్‌పూర్‌లోనే దొరికే లేత గోధుమ రంగు బ్రీజ్ స్టోన్‌ను వాడనున్నారు. దాదాపు లక్షన్నర చదరపు అడుగుల మేర అవసరమయ్యే ఈ రాతి ఫలకాలనూ తెప్పించారు. ఈ రాతిని ఫలకాలుగా మార్చే పని జరుగుతోంది.
రాజస్తాన్ కార్మికులతో ఫౌంటెయిన్ల పనులు
భవనం ముందు రెండు వైపులా ఉండే లాన్‌లలో రెండు భారీ వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంటు ముం దు ఉండే చారిత్రక ఫౌంటెయిన్ డిజైన్‌లోనే ఇవి రూపొందనున్నాయి. ఒక్కోటి 45 అడుగుల చుట్టుకొలతతో 25 అడుగుల ఎత్తుతో ఉంటా యి. ప్రస్తుతం ఈ మోడల్‌లో చిన్న ఫౌంటెయిన్‌ను తెప్పించి భవనం వద్ద ఏర్పాటు చేశారు. అసలు ఫౌంటెయిన్ పనులను రాజస్తాన్ కార్మికులు చేస్తున్నారు. మొత్తం భవనానికి 200 ఫుటింగ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో ఫుటింగ్‌కు 300 బస్తాల సిమెంటు, 4 టన్నుల స్టీల్‌ను వాడారు. దీనికి వీలుగా ఆ ప్రాంగణంలో భారీ సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment