పోస్టుకార్డు
ఇప్పుడంతా డిజిటల్ మయం.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచంలోని నలుమూలలా ఏం జరుగుతుందో ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.. సమగ్ర సమాచారాన్ని అందిపుచ్చుకోవచ్చు... అందుకే చాలా మందికి మొబైల్ ఫోన్ ఓ నిత్యావసరంగా మారిపోయింది.. నిద్రాహారాలు మాని దానికే అతుక్కుపోయే ‘వ్యసనపరుల’ గురించి కాసేపు పక్కనపెడితే.. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు ఇలా ప్రతి ఒక్కరు ఫోన్ సహాయంతో ఆన్‌లైన్‌తో తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇక వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్‌తో పాటు జీ- మెయిల్ వంటి యాప్‌లతో సందేశాలు పంపిస్తూ స్నేహితులకు చేరువగా ఉంటున్నారు.
ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రతి నిమిషం అప్‌డేట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడుతున్నారు. గోప్యతకు భంగం కలిగించే కేటుగాళ్లు ఆర్థికంగా దెబ్బతీయడమే గాకుండా.. వారి ప్రవర్తనతో మానసిక వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు. కాబట్టి స్మార్ట్‌గా ఉండటం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో.. అంతకు ఎక్కువ నష్టాలు కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రైవసీ కాపాడుకోవడం ఈ డిజిటల్ యుగంలో కత్తిమీద సాములా తయారైంది.(చదవండి: ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం!)
అప్పుడైతే ఇలాంటి బాధలు లేనేలేవు..!
మిలినియల్స్‌కు తెలియదేమో గానీ.. 90వ దశకంలో జన్మించిన చాలా మందికి.. ఇంటి ముందు నుంచి పోస్ట్ అని గట్టిగా పిలుపు వినపడగానే ఏదో ఉత్తరం వచ్చిందనుకునే పరుగెత్తే దృశ్యాలు ఇప్పటికీ గుర్తే. ఆ చిన్ని కాగితాన్ని ఇంటిల్లిపాది ఒకేచోట చేరి చదవడం, ఆప్తుల క్షేమసమాచారాలు తెలుసుకుని వాటి గురించి చర్చించుకునేవారు. బాధైనా, సంతోషమైనా అక్షరాలను పదే పదే తరచి చూస్తూ జ్ఞాపకాలు నెమరువేసుకునే వారు. చూడటానికి చిన్నగానే ఉన్నా మనుషుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరే వారధిగా పోస్టుకార్డుకు ప్రత్యేక స్థానం ఉండేది.
ముఖ్యంగా ఇప్పటిలాకాకుండా.. పరస్పరం పంచుకున్న భావాలు, విషయాలు ఉత్తరం పంపిన వారికి, దానిని అందుకున్న వారికి మాత్రమే తెలిసేవి. ప్రైవసీకి భంగం కలిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానాలు మారనుండటంతో.. సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లకు ఇటీవలి కాలంలో డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ వివాదాస్పద మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం వీటికి ఆదరణ పెరుగుతోంది. అయితే.. ఏదో ఒకరోజు వీటి కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, టెక్నాలజీ రోజురోజుకూ మారుతుంది కాబట్టి అందుకు అనుగుణంగానే మార్పులు చోటుచేసుకుంటాయని, ఏదేమైనా ఉత్తరాల(పోస్టుకార్డు)కు అప్పట్లో ఉన్న క్రేజ్, ప్రైవసీ విధానంలో మరేదీ సాటి రాదని పోస్టుకార్డు ప్రేమికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment