తెరపైకి ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ
కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ కంటే ఎక్కువ వేడి సాధ్యమంటున్న హైలైనర్
టీ–హబ్‌లో పరికరం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: కాలుష్య రహిత కరెంటు.. అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదూ..ఇలాంటి టెక్నాలజీ ఇప్పటివరకు ఏదీ లేదు. కానీ ఇకపై ఇది సాధ్యమేనంటోంది హైలెనర్! ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని హైలైనర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్ చెప్పారు.
దీని పూర్వాపరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతుండటం వల్ల ఈ వెలుగు సాధ్యమవుతోంది. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారని చిన్నప్పుడు చదువుకున్నాం.
ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేయడం ద్వారా చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఇవి ఎంతవరకు విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తి రేకెత్తిస్తోంది.
గది ఉష్ణోగ్రతలోనే..
న్యూక్లియర్ ఫ్యూజన్‌కు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని ముందే చెప్పుకున్నాం కదా..అయితే ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’లో వీటి అవసరం ఉండదు. గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.
హైలెనర్ బుధవారం హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఈ టెక్నాలజీని ప్రదర్శించింది. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగంతోనే అదనపు వేడి పుట్టిందని రాజన్ చెప్పారు. టి–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు ఈ ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’పరికరాన్ని ఆవిష్కరించారు.
1989 నాటి ఆలోచనే..
హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మారి్టన్ ఫైష్‌మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్‌లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్‌ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు గుర్తించారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు.
అయితే దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకు చాలా విఫల ప్రయత్నాలు జరిగాయని, తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మశ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్‌గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్‌పై ఆశలు పెంచుతున్నాయి.
విద్యుత్ ఆదా..ఉత్పత్తి
విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు ఉపకరిస్తుంది. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చు. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ దీనిని వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment