రెండేళ్లుగా ఫుల్లు.. కాపాడితే నీళ్లే నీళ్లు..
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు చాలా ఏళ్లుగా పూర్తిగా నిండటం లేదు. కానీ గత రెండేళ్లుగా ఎగువన భారీ వర్షాలు పడటంతో పూర్తిగా నిండుతున్నాయి. ఐదు సార్లు భారీ వరద రావడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ జలాశయాలే లేకపోతే భారీ వరదతో మూసీ తీర కాలనీలు నీట మునిగేవని నిపుణులు చెప్తున్నారు. తాగునీటిని అందించడంతోపాటు రక్షణ కల్పించే జంట జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వీటి పరీవాహక ప్రాంతంలో కాలువలు, నాలాల ఆక్రమణలను తొలగిస్తే.. ఏటా జలకళ సంతరించుకుంటాయని.. పెద్దగా ఖర్చులేకుండానే హైదరాబాద్ నగరానికి తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి భారీ ఖర్చుతో నీటిని తరలించే సమస్య తగ్గుతుందని అంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: అటు జనం దాహార్తిని తీరుస్తూ.. ఇటు వరదల నుంచి రక్షణ కల్పిస్తూ.. దాదాపు వందేళ్లుగా హైదరాబాద్ నగరానికి ఆపద్బాంధవుల్లా ఉన్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు విలవిల్లాడుతున్నాయి. కబ్జాలు, అక్రమ నిర్మాణాలతో రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చే మార్గాలు మూసుకుపోయి చిక్కిశల్య మవుతున్నాయి. 111 జీవో నిబంధనలను తోసిరాజంటూ పరీవాహక ప్రాంతంలో భారీగా నిర్మాణాలు వెలిశాయి. ఇప్పటికీ విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2002 నుంచి ఆక్రమణలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొత్త నిర్మాణాలపై నిషేధమున్నా.. వందల కొద్దీ రియల్ ఎస్టేట్ వెంచర్లు, వేలకొద్దీ విల్లాలు, నివాస సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలేజీలు, వాణిజ్య భవనాలు పుట్టుకొచ్చాయి.
వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు
జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోకు తూట్లు పొడుస్తూ పరీవాహకం పరిధిలో వేల సం ఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో రెవెన్యూ శాఖ గత ఏడాది సర్వే చేసింది. ఈ జీవో వర్తించే ఆరు మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో పరిశీలన జరిపింది. మొత్తంగా 426 లేఅవుట్లలో 10,907 ఇళ్లు.. గ్రామాల్లో 4,567 ఇళ్లు, 1,920 వాణిజ్య భవనాలు అక్రమంగా నిర్మితమై ఉన్నట్టు తేల్చింది. ఇందులో కాలేజీలు, గోదాములతోపాటు కొందరు రాజకీయ నేతల ఫామ్‌హౌజ్‌లు కూడా ఉండటం గమనార్హం. అయితే అప్పట్లో కాస్త హడావుడి చేసిన రెవెన్యూ అధికారులు.. శంషాబాద్ పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
కాల్వలన్నీ ఆక్రమణలే..!
జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవో పరిధిలో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంట జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్)కబ్జాకు గురవడం, ఆ ప్రాంతాలు ఇటుక బట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజనీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిల యంగా మారడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి.
లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఏది?
జంట జలాశయాల పరిరక్షణ కోసం నిపుణులతో లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేయాలని గతం లో హైకోర్టు ఆదేశించింది. కానీ సర్కారు ఈ విష యాన్ని పక్కన పెట్టింది. శిఖం భూముల్లో అక్ర మంగా వెలసిన ఫాంహౌస్‌లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను తొలగించడంలో తాత్సారం జరు గుతోందన్న విమర్శలున్నాయి. జలాశయాల పరిరక్షణ విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జల మండలి విభాగాలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలూ వస్తున్నాయి.
వందేళ్లుగా నీళ్లు, రక్షణ..
దాదాపు వందేళ్ల కింద మూసీకి భారీగా వరదలు వచ్చినప్పుడు.. హైదరాబాద్‌కు రక్షణ, తాగునీటి సౌకర్యం రెండు ప్రయోజనాలు కల్పించేలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. హిమాయత్‌సాగర్ సామర్థ్యం 2 టీఎంసీలుకాగా.. ఉస్మాన్‌సాగర్ సామర్థ్యం 3 టీఎంసీలు. వాటిని నిర్మించినప్పటి నుంచీ హైదరాబాద్ నగర దాహార్తిని తీరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జలాశయాల నుంచి నిత్యం 50 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
కఠిన నిబంధనలున్నా..
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలోనే 111 జీవోను అమల్లోకి తెచ్చారు. దాని ప్రకారం.. ఈ జలాశయాలకు చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో భారీ శాశ్వత నిర్మాణాలపై నిషేధం ఉంటుంది. కాలుష్య కారక పరిశ్రమలు, నివాస కాలనీలు, భారీ హోటళ్లు, రెస్టారెంట్లు, కాలేజీలు, ఇతర సంస్థలు వంటివేవీ ఉండకూడదు. ఈ ప్రాంతం పరిధిలో వేసే లేఅవుట్లలో 60 శాతం ఓపెన్‌గా, రోడ్ల కోసం వదలాలి. వినియోగించే భూమిలో 90 శాతం మొక్కల పెంపకానికి కేటాయించాలి. భవనాలేవీ కూడా గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులకు మించి నిర్మించడానికి వీల్లేదు. కానీ ఎక్కడా ఈ ఆంక్షలు అమలుకావడం లేదు. విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇవన్నీ అక్రమ నిర్మాణాలే..
ఒకటీ.. రెండూ కాదు.. వందల సంఖ్యలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలన్నీ అక్రమ నిర్మాణాలే. శంషాబాద్ పట్టణంలో జీవో 111 అమల్లో ఉన్న ప్రాంతంలో వెలిసిన నిర్మాణాలివి. నిషేధం ఉన్నా కూడా ఇప్పటికీ నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నాయి.
– శంషాబాద్ రూరల్
శిఖం భూముల్లో భారీగా కబ్జాలు
హిమాయత్‌సాగర్ పరిధిలో శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రధానంగా అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, హిమాయత్‌సాగర్, కొత్వాల్‌గూడ, కుర్మగూడ, నర్కుడ గ్రామాల పరిధిలో ఎక్కువగా ఆక్రమణలు ఉన్నాయి. ఆయాచోట్ల సుమారు 50 ఎకరాలు పరాధీనమైనట్టు రెవెన్యూ శాఖ లెక్క తేల్చింది. వాస్తవంగా ఈలెక్క ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుందని స్థానికులే అంటున్నారు. ఇక ఉస్మాన్‌సాగర్ పరిధిలోని ఖానాపూర్, గున్‌గుర్తి, గండిపేట్, శంకర్‌పల్లి, జన్వాడ పరిధిలో సుమారు 300 ఎకరాల భూములు ఆక్రమణలకు గురైనట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. రెండింటి పరిధిలో వందల ఎకరాలు కబ్జా అయినా అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment