Heavy Flood Water For Himayat Sagar And Osman Sagar; Osman Sagar Gates Lifted - Sakshi
Sakshi News home page

HYD: మూసీకి భారీగా వరద.. జీహెచ్‌ఎంసీ అప్రమత్తం

Published Wed, Jul 26 2023 7:24 PM | Last Updated on Wed, Jul 26 2023 8:28 PM

Heavy Flood Water For Himayat Sagar And Osman Sagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్)లకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే గత శుక్రవారం మొదటి సారిగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

అయితే.. నేడు ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు రావడంతో తాజాగా ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఒక ఫీటు మేర ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తారు. దీంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 
చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్‌ఎంసీ హై అలర్ట్‌

గతేడాది ఇదీ పరిస్థితి..
హిమాయత్ సాగర్: గతేడాది భారీగా వర్షాలు కురవడంతో రెండు రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఇరు జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. 2022 జులై 10 న మొదటి సారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తర్వాత వర్షాభావ పరిస్థితుల్ని బట్టి అక్టోబరు 26 న మొత్తం గేట్లు మూసివేశారు.  ఈ ఏడాది జులై 21 న మొదటి సారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 1200 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

ఉస్మాన్ సాగర్ (గండిపేట్): గతేడాది ఉస్మాన్ సాగర్ జలాశయం రిజర్వాయర్ నీటి మట్టం 1785.80 అడుగులు ఉండగా జులై 10న మొదటి సారి గేట్లు ఎత్తారు. చివరిసారిగా అక్టోబరు 26 వ తేదీ నాటికి మొత్తం గేట్లు మూసివేశారు. ఈ ఏడాది ఈ రోజు మొదటిసారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 800 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 216 క్యూసెక్కుల నీటిని దిగువనున్న మూసీలోకి వదులుతున్నారు. 

అప్రమత్తంగా ఉండాలని ఎండీ ఆదేశం:
జంట జలాశయాల గేట్లు (హిమాయత్ సాగర్-2, ఉస్మాన్ సాగర్-2 గేట్లు) ఎత్తడంతో దాదాపు 1566 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నందున ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:  (సాయంత్రం 6 గంటల వరకు)
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1761.20 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.472 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 1350 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 02

ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ వివరాలు:
పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1787.15 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.900 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 3.253 టీఎంసీలు
ఇన్ ఫ్లో :: 800 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 216 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 15
ఎత్తిన గేట్ల సంఖ్య : 02

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement