Himayat Sagar and Osman Sagar
-
HYD: మూసీకి భారీగా వరద.. జీహెచ్ఎంసీ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్)లకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే గత శుక్రవారం మొదటి సారిగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే.. నేడు ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు రావడంతో తాజాగా ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఒక ఫీటు మేర ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తారు. దీంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్ గతేడాది ఇదీ పరిస్థితి.. హిమాయత్ సాగర్: గతేడాది భారీగా వర్షాలు కురవడంతో రెండు రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఇరు జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. 2022 జులై 10 న మొదటి సారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తర్వాత వర్షాభావ పరిస్థితుల్ని బట్టి అక్టోబరు 26 న మొత్తం గేట్లు మూసివేశారు. ఈ ఏడాది జులై 21 న మొదటి సారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 1200 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట్): గతేడాది ఉస్మాన్ సాగర్ జలాశయం రిజర్వాయర్ నీటి మట్టం 1785.80 అడుగులు ఉండగా జులై 10న మొదటి సారి గేట్లు ఎత్తారు. చివరిసారిగా అక్టోబరు 26 వ తేదీ నాటికి మొత్తం గేట్లు మూసివేశారు. ఈ ఏడాది ఈ రోజు మొదటిసారి రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 800 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 216 క్యూసెక్కుల నీటిని దిగువనున్న మూసీలోకి వదులుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ఎండీ ఆదేశం: జంట జలాశయాల గేట్లు (హిమాయత్ సాగర్-2, ఉస్మాన్ సాగర్-2 గేట్లు) ఎత్తడంతో దాదాపు 1566 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నందున ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు: (సాయంత్రం 6 గంటల వరకు) పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 1761.20 అడుగులు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు ప్రస్తుత సామర్థ్యం : 2.472 టీఎంసీలు ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 1350 క్యూసెక్కులు మొత్తం గేట్ల సంఖ్య : 17 ఎత్తిన గేట్ల సంఖ్య : 02 ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ వివరాలు: పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 1787.15 అడుగులు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.900 టీఎంసీలు ప్రస్తుత సామర్థ్యం : 3.253 టీఎంసీలు ఇన్ ఫ్లో :: 800 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 216 క్యూసెక్కులు మొత్తం గేట్ల సంఖ్య : 15 ఎత్తిన గేట్ల సంఖ్య : 02 -
ప్రజాఉద్యమాలతోనే ముకుతాడు
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలను కాపాడుకోవాలనే పట్టుదలతో ప్రజాభిప్రాయం ఉద్యమరూపం తీసుకుంటే ఏదైనా సాధించవచ్చని పర్యావరణవేత్త కెప్టెన్ జె.రామారావు చెప్పారు. ఏదైనా అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, ప్రజాగ్రహం పెల్లుబుకుతుందో అప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి తమ తప్పులను సరిచేసుకుంటాయన్నారు. కోర్టులు కలగజేసుకోవడం కంటే ప్రజాందోళనతోనే జీవో 111ను, ఈ జంట రిజర్వాయర్లను కాపాడుకోవచ్చని స్పష్టంచేశారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాణ వాయువును అం దిస్తూ ఊపిరితిత్తులుగా నిలిచిన నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం నిల్వల అన్వేషణ, వెలికితీతను ప్రజల మద్దతుతో అడ్డుకోగలిగామన్నారు. అయితే, జీవో 111పై మాత్రం ప్రజా ఉద్యమాన్ని నిర్మించలేకపోయామని ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామారావు చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇప్పటికే ఎన్నో ఉల్లంఘనలు... జీవో 111 పేరిట కఠిన నిబంధనలున్నా ఈ జంట జలాశయాల క్యాచ్మెంట్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. కాలేజీలు, కాటేజీలు, ఇళ్లు ఇలా అనేకం వచ్చేశాయి. ప్రభుత్వమే ఈ జీవోను ఉల్లంఘించి పోలీస్స్టేషన్లు తదితరాలు నిర్మిం చింది. ఇప్పుడు ఈ జీవోను ఎత్తేయడం ద్వారా అక్రమ నిర్మాణాలను ‘లీగలైజ్’చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ జలాశయాల్లోకి మురుగు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత చేటే. వీటికి కొద్దో గొప్పో రక్షణగా ఉన్న ఈ జీవోను ఎత్తేస్తే ఇవి కూడా హుస్సేన్‌సాగర్ మాదిరి కాలుష్య కాసారమవుతాయి. రియల్ ఎస్టేట్ కారణంగానే... రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇక్కడి భూముల విలువలకు రెక్కలొచ్చాయి. రియల్టర్లు, వ్యాపారవేత్తల ఒత్తిళ్లకు ప్రభు త్వం తలొగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జంట జలాశయాలు నగర తాగునీటి వనరులుగా కొన సాగాలనే ఉద్దేశంతో జీవో 111ను తెచ్చారు. వీటికి 10 కి.మీ పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలు, ఇతర కట్టడాలు నిర్మించకుండా ఆంక్షలు విధించారు. మంచి ఉద్దేశంతో ఇవన్నీ పెట్టినా ఆ తర్వాత ఉల్లంఘనలు పెరిగిపోయాయి. సర్కార్‌కు పీసీబీ జీ హుజూర్ పర్యావరణ చట్టాలు, నీటివనరులను కాపాడే విషయంలో కేంద్ర మార్గదర్శకాలు వంటివి ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడంతో ప్రభుత్వ అధీనంలోని సంస్థగానే మిగిలిపోతోంది. అందువల్ల ఎన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా చూసీచూడనట్టు వదిలేయడంతో ఈ సంస్థ ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటుందనేది స్పష్టమౌతోంది. కేవలం తాగునీటితోనే ముడిపడలేదు ►ఈ జలాశయాల పరిరక్షణ కేవలం తాగునీటితోనే ముడిపడలేదు. పర్యావరణం, పచ్చ దనం, జీవవైవిధ్యంతోపాటు వాతావరణ మార్పుల నియంత్రణలో వీటి భాగస్వామ్యాన్ని అందరూ గ్రహించాలి. పర్యావరణం అంటే గాలి, నీరు, భూమి.. వాటితో ముడిపడిన పచ్చదనం, జీవవైవిధ్యం మొత్తంగా మనచుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం. అందువల్ల వీటిలో దేనిని కాపాడుకోకపోయినా పర్యావరణం నాశనమైనట్టే. ఏదో కేవలం తాగునీటి వనరుల కోసం ఈ జలాశయాలపై ఆధారపడడం లేదని చెప్పి జీవో 111ను ఎత్తేస్తామనడం ఎంతమాత్రం సరికాదు. -
‘మురుగు’.. తప్పితేనే మెరుగు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరానికి తాగునీరిచ్చే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట)లను మురుగు ముప్పు వెంటాడుతోంది. సమీపంలోని 11 గ్రామాల నుంచి, చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వస్తున్న మురుగునీటితో రిజర్వాయర్లు కలుషితం అవుతున్నాయి. నిత్యం గండిపేట జలాశయంలోకి 29 లక్షల లీటర్లు, హిమాయత్‌సాగర్‌లోకి 43.5 లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నట్టు జల మండలి పరిశీలనలోనే వెల్లడైంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వచ్చే మురుగు నీటిని ఎక్కడికక్కడ శుద్ధి చేయాలని, అందుకోసం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) ఏర్పాటు చేసుకోవాలని.. గతంలోనే గ్రామ పంచాయతీలు, కాలేజీలకు జలమండలి, కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) నోటీసులు ఇచ్చాయి. ఎస్టీపీలను నిర్మించుకోవాలని, జలాశయాలు కలుషితం కాకుండా చూడాలని హైకోర్టు కూడా కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. అయినా ఫలితం లేదు. పంచాయతీల నిర్లక్ష్యానికితోడు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం కూడా దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగునీటి చేరికను ఆపడం, శుద్ధి చేయడం ద్వారా జంట జలాశయాల్లో నీటి నాణ్యతను మెరుగుపర్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఐదేళ్లుగా పైసా లేదు.. సుమారు పదివేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న జంట జలాశయాలకు సమీపంలో 11 గ్రామా లు ఉన్నాయి. వాటి నుంచి వెలువడుతున్న మురుగు నీరంతా జలాశయాల్లోకి చేరుతుండటంతో.. మురుగుశుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లను నిర్మిం చాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో ఎస్టీపీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యా యి. అందులో రూ.27.50 కోట్లను పంచాయతీ రాజ్ శాఖ, మరో రూ.13 కోట్లను కాలుష్య నియంత్రణ మండలి నుంచి విడుదల చేయాలని సూచించింది. ఇది జరిగి ఐదేళ్లయినా ఆయా విభాగాల నుంచి పైసా నిధులు విడుదల కాలేదు. మురుగు నీరు నేరుగా జలాశయాల్లో కలుస్తూ.. ఆర్గానిక్ కాలుష్యం పెరిగిపోతోంది. తాఖీదులు ఇచ్చినా.. జంట జలాశయాల చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎస్టీపీలు నిర్మించుకోవాలంటూ గతంలోనే తాఖీదులిచ్చామని పీసీబీ వర్గాలు తెలిపాయి. పీసీబీ తరఫున రూ.13 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. కానీ పంచాయతీరాజ్ విభాగం నుంచి రావాల్సిన రూ.27.50 కోట్లను విడుదల చేయడం లేదని ఓ అధికారి చెప్పారు. అయితే దీనిపై జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా.. ఈ అంశంపై దృష్టి సారించి, సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తక్షణం ఎస్టీపీలు నిర్మిస్తేనే.. ►జంట జలాశయాల్లో కాలుష్యం చేరకుండా తీసు కోవాల్సిన చర్యలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ►సమీప గ్రామాల మురుగునీరు చేరకుండా తక్షణం ఎస్టీపీలు నిర్మించాలి. వాటిలో శుద్ధిచేసిన నీటిని కూడా జలాశయాల్లోకి వదలకుండా గార్డెనింగ్, పంటలకు వినియోగించాలి. రిజర్వాయర్లలోని నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ►వరదనీరు చేరే ఇన్‌ఫ్లో చానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. జలాశయాల ఎగువన, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలిసిన ఫాంహౌజ్‌లు, ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను తొలగించాలి. ఇసుక మాఫియాను కట్టడిచేయాలి. ►ఈచర్యల విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. మురుగు కాలుష్యం ప్రమాదకరం మురుగు చేరిక వల్ల మంచినీటి జలాశయాల్లోకి పురుగు మందుల అవశేషాలు, షాంపూలు, టాయిలెట్ క్లీనర్లు, సబ్బులు, ఇతర రసాయనాలు చేరుతున్నాయి. గృహ, వాణిజ్య వ్యర్థ జలా ల్లో ఉండే హానికర మూలకాలతోనూ ప్రమాదం ఉంటుంది. మానవ, జంతు వ్యర్థాలతో కూడిన మురుగులో కొలిఫాం, షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఈకొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. మురుగునీటితో యుట్రిఫికేషన్ చర్య జరిగి గుర్రపు డెక్క ఉద్ధృతి పెరుగుతుంది. జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గినపుడు దోమల లార్వాలు ఉద్ధృతంగా వృద్ధి చెందుతాయి. సమీప ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు, అవసరమైన సామర్థ్యం ఇదీ.. ఉస్మాన్‌సాగర్ పరిధిలో.. వట్టినాగులపల్లి - 8 లక్షల లీటర్లు చిలుకూరు - 7 లక్షల లీటర్లు ఖానాపూర్ - 6 లక్షల లీటర్లు జన్వాడ - 6 లక్షల లీటర్లు హిమాయత్‌నగర్ - 3 లక్షల లీటర్లు అప్పోజిగూడ - లక్ష లీటర్లు బాలాజీ ఆలయం - లక్ష లీటర్లు హిమాయత్‌సాగర్ పరిధిలో.. ఫిరంగినాలా - 29 లక్షల లీటర్లు అజీజ్‌నగర్ - 9 లక్షల లీటర్లు కొత్వాల్‌గూడ - 3 లక్షల లీటర్లు హిమాయత్‌సాగర్ - 2.5 లక్షల లీటర్లు -
జీవన ‘సాగరాలవి’.. ఆ ఆలోచన సరికాదు
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ నగరానికి ‘జీవనరేఖ (లైఫ్‌లైన్)’గా ఉన్నాయని, వాటి పరిరక్షణ అత్యంత కీలకమని జేఎన్టీయూ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ఎన్విరాన్మెంటల్ కమిటీ మాజీ చైర్మన్ ఎం.అంజిరెడ్డి పేర్కొన్నారు. జలాశయాలకు ఏమాత్రం నష్టం జరగకుండా ఉం డేలా సాంకేతిక నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో జీవో 111కు సవరణలు చేయవచ్చని సూచించారు. అంతేతప్ప జలాశయాలతో ఉపయోగం లేదనడం, ఎత్తేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు. కొన్ని దశాబ్దాల కిందటి వరకు మంచినీటి వనరుగా ఉన్న హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారంగా మారిపోయిందని, భవిష్యత్‌లో జంట జలాశయాలకు ఆ దుస్థితి రాకుండా చూడాలని చెప్పారు. రిజర్వాయర్లను మాత్రమేకాకుండా, వాటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పర్యావరణ చట్టాలు, కేంద్ర నిబంధనల మేరకు పరిరక్షించాల్సి ఉందన్నారు. జీవో 111, జంట జలాశయాల అంశాలపై అంజిరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చా రు. ఇందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సుస్థిర అభివృద్ధి చర్యలు చేపట్టాలి జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.34 లక్షల ఎకరాలకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, ఎగువ నుంచి వచ్చే జలాలు, డ్రైనేజీ వ్యవస్థలు, చెరువుల నెట్వర్క్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. చెరువులు, పర్యావరణ వ్యవస్థలకు నష్టం జరగకుండా చూడాలి. జలాశయాలకు నష్టం కలిగిస్తూ ఇక్కడి భూమిని అభివృద్ధి చేయాలని ఎక్కడా లేదు. టెక్నికల్ కమిటీ క్షుణ్నంగా పరిశీలించాలి 111 జీవో పరిధిలోని గ్రామాల రైతులకు నష్టం జరగకుండా ‘సాంకేతిక నిపుణుల కమిటీ’ప్రతి ఊరిలో భూమిని పరిశీలించాలి. వాగుల నెట్వర్క్ ఎలా ఉంది, అక్కడి నీరు ఎక్కడికి వెళుతుందనేది చూడాలి. ఆ ప్రకారం ఏయే ఏరియాలు, ఏయే సర్వే నంబర్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగలమో, జీవో 111కు ఏమేర సడలింపులు ఇవ్వాలో నిర్ణయిస్తే.. జంట జలాశయాలకు నష్టం వాటిల్లదు. దీనికి సంబంధించి చాలా కచ్చితంగా 1.34 లక్షల ఎకరాలను పరిశీలించాలి. ఫామ్‌హౌజ్‌లకు వీలుగా చట్టాలు చేయొచ్చు జీవో 111ను ఎత్తేయకుండా.. దీని పరిధిలో ఫామ్‌హౌజ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు చట్టమే చేయొచ్చు. ఉదాహరణకు పదెకరాల స్థలముంటే.. అందులో 20 శాతం దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవచ్చనే మార్గదర్శకాలు నిర్దేశించవచ్చు. ఆ నిర్మాణాల నుంచి వృధా జలాలు బయటికి రాకుండా.. శుద్ధి చేయడం, ఇతర అవసరాలకు వినియోగించడంపై నిబంధనలు పెట్టవచ్చు. దిగువ ప్రాంతాల్లో అనుమతులిచ్చాం! 111 జీవోకు సంబంధించి 2007–13 మధ్య నేను చైర్మన్‌గా ఉన్న ఏపీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఎన్విరాన్మెంటల్ కమిటీ).. జంట జలాశయాలకు నష్టం కలిగించని దిగువ ప్రాంతం (డౌన్ స్ట్రీమ్స్)లో అనుమతులిచ్చింది. అయితే 20వేల చదరపు మీటర్లు దాటే నిర్మాణాలకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఉంటేనే అనుమతులిచ్చే విషయాన్ని కచ్చితంగా పాటించాం. ఘన, ద్రవ వ్యర్థాల నివారణ చర్యలు చేపట్టేలా చూశాం. దీనికి సంబంధించి ప్రతీ ఫైల్ తప్పకుండా మున్సిపల్ శాఖ ఆమోదం పొందాకే మా దగ్గరకు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి సహజ రక్షణ ఎక్కడా లేదు ‘‘హైదరాబాద్ వంటి వినూత్న లక్షణాలు, భౌగోళిక పరిస్థితులు, సహజ రక్షణ ఉన్న నగరం మరొకటి లేదు. కొండలు, గుట్టలు, ఇతర సహజ లక్షణాలతో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలతో కూడిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు.. హైదరాబాద్ నగరానికి ‘జీవనరేఖ’ (లైఫ్‌లైన్)గా ఉపయోగపడుతున్నందున వాటి సంరక్షణ కీలకంగా మారింది. వీటి పరిధిలో పర్యావరణ వ్యవస్థలను, బయో కన్జర్వేషన్ జోన్లను కాపాడాలి. -
ఎత్తేస్తారా.. సడలిస్తారా?.. అన్ని వర్గాల్లో ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: జీవో 111 ఎత్తివేత సులభమేనా? దీని అవసరం తీరిపోయిందా? దశాబ్దాల తరబడి జంట నగరాల ప్రజల దాహార్తిని తీర్చిన జంట జలాశయాల ప్రాధాన్యత తగ్గిపోయిందా? జీవో 111ను ఎత్తివేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నాయి. మిగతా అంశాల విషయం ఎలా ఉన్నా.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణ దృష్ట్యా ఆ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు, భారీ నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదంటూ జారీ చేసిన జీవో 111 ఎత్తివేత మాత్రం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1996లో జీవో తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వమే.. 1997లో దానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించి విఫలం కావడాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. హైకోర్టులో దీనికి సంబంధించిన ఒక కేసు 15 ఏళ్లుగా కొనసాగుతుండటాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. కాగా ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో.. ఒక గంట వ్యవధిలోనే కుంభవృష్టి పడుతూ నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఐటీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రాంతంలో విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో భూమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం..జీవో ఎత్తివేయాలని కోరుతున్న పరీవాహక ప్రాంత రైతుల విన్నపాలు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళుతుందా? లేక పర్యావరణవేత్తల హెచ్చరికల దృష్ట్యా ఏవైనా కొన్ని సవరణలు, సడలింపులు దిశగా అడుగులు వేస్తుందా? జీవోలో సవరణలు/ఎత్తివేతకు న్యాయస్థానాలు అంగీకరిస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. జీవో తెచ్చిన ఏడాదికే తూట్లు పొడిచే యత్నం జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో ఓ ఆయిల్ కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1997లో కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ వివాదం అప్పట్లో సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను కాపాడుకోవాల్సిన ఆవశ్యతకను వివరిస్తూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. జలాశయాలకు సమీపంలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదని తేల్చిచెప్పింది. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ద్వారా వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఇతర వ్యర్థాలతో జలాశయాలు కలుషితం అవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీవో 111ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న తాజా నిర్ణయం కూడా మరోసారి వివాదంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. 15 ఏళ్లుగా హైకోర్టులో.. జీవో 111ను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలంటూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న డాక్టర్ ఎస్.జీవానందరెడ్డి 2007లో హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం ఇంకా విచారణ దశలో ఉంది. జీవో 111 పరిధిలో నిర్మాణాలు చేపట్టిన దాదాపు 30 సంస్థలను ఆయన ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జీవో 111ను ఎత్తివేయడం సులభమేమీ కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. జీవో 111కు సవరణలు చేయవచ్చేమో కానీ, పూర్తిగా ఎత్తేసే ప్రయత్నం చేస్తే జాతీయ స్థాయిలో ఉద్యమానికి దారితీస్తుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఆ నీళ్లకు కిలో లీటర్‌కు రూ.12–14 ఖర్చు కృష్ణా, గోదావరి నీటిని హైదరాబాద్‌కు తరలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ జలాశయాల అవసరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సమంజసంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీటి సరఫరా భారీ వ్యయంతో కూడుకున్నదని, హైదరాబాద్‌కు ఒక కిలోలీటర్ నీటిని తరలించేందుకు రూ.12–14 ఖర్చు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జంట జలాశయాల నుంచి సరఫరా చేసే లీటరు నీరు రూ.1.25 కంటే తక్కువని జలమండలి లెక్కలే చెబుతున్నాయి. మరోవైపు వరదలు వచ్చినప్పుడు నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆధారంగా నగరానికి నీటి తరలింపునకు ఏర్పాటు చేస్తున్నారని, వరదలు రాకపోతే పరిస్థితి ఏమిటని నిపుణులు అంటున్నారు. నివేదిక ఇవ్వని జీవోపై అధ్యయన కమిటీ.. జీవో 111 పరిధిలో ఓ నిర్మాణానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జీవో 111పై అధ్యయనం చేసేందుకు నిపుణులతో కమిటీ వేయాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అయితే ఆరేళ్లు గడిచినా కమిటీ ఇప్పటికీ నివేదిక సమర్పించలేదు. మరోవైపు వట్టినాగులపల్లికి చెందిన కొందరు రైతులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన కొన్ని సర్వే నంబర్లు పరీవాహక ప్రాంతంలో లేకపోయినా జీవో 111 పరిధిలో చేర్చారని ఆరోపించారు. కొన్ని సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వారు పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి తప్పనిసరి జీవో 111ను మరింత సమర్థవంతంగా అమలు చెయ్యాలని, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలంటూ 2007 లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఈ జీవో సవరణలకు అనుమతి కోరుతూ 2010లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పలుమార్లు విచారణకు వచ్చినా హైకోర్టు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆ జీవోకు సవరణలు చేయాలన్నా, ఎత్తివేయాలన్నా హైకోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. – జనార్ధన్ గౌడ్, న్యాయవాది జీవో ఆవశ్యకమన్న సుప్రీంకోర్టు హైకోర్టు, సుప్రీంకోర్టులో జీవో 111కు సంబంధించిన విచారణలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆ జీవోను ఎత్తేయడం అంత సులభమైన విషయం కాదు. జీవో ట్రిపుల్ వన్ అత్యంత ఆవశ్యకమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం ఈ జీవోను సమర్థవంతంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఎత్తేసే ప్రయత్నం చేస్తే పర్యావరణ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. – బి.కొండారెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు సవరణకు పలు ధర్మాసనాల విముఖత జీవో ట్రిపుల్ వన్ను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేసేందుకు గతంలో పలు హైకోర్టు ధర్మాసనాలు విముఖత వ్యక్తం చేశాయి. శ్రీనగర్‌లోని దాల్ లేక్ పరిసరాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలను సవరించి అక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని.. ఈ కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అదే తరహాలో జీవో ట్రిపుల్ వన్ను సవరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అప్పట్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. -
జీవో ట్రిపుల్ వన్.. కబ్జాలు ఎవర్గ్రీన్
రెండేళ్లుగా ఫుల్లు.. కాపాడితే నీళ్లే నీళ్లు.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు చాలా ఏళ్లుగా పూర్తిగా నిండటం లేదు. కానీ గత రెండేళ్లుగా ఎగువన భారీ వర్షాలు పడటంతో పూర్తిగా నిండుతున్నాయి. ఐదు సార్లు భారీ వరద రావడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ జలాశయాలే లేకపోతే భారీ వరదతో మూసీ తీర కాలనీలు నీట మునిగేవని నిపుణులు చెప్తున్నారు. తాగునీటిని అందించడంతోపాటు రక్షణ కల్పించే జంట జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వీటి పరీవాహక ప్రాంతంలో కాలువలు, నాలాల ఆక్రమణలను తొలగిస్తే.. ఏటా జలకళ సంతరించుకుంటాయని.. పెద్దగా ఖర్చులేకుండానే హైదరాబాద్ నగరానికి తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి భారీ ఖర్చుతో నీటిని తరలించే సమస్య తగ్గుతుందని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: అటు జనం దాహార్తిని తీరుస్తూ.. ఇటు వరదల నుంచి రక్షణ కల్పిస్తూ.. దాదాపు వందేళ్లుగా హైదరాబాద్ నగరానికి ఆపద్బాంధవుల్లా ఉన్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు విలవిల్లాడుతున్నాయి. కబ్జాలు, అక్రమ నిర్మాణాలతో రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చే మార్గాలు మూసుకుపోయి చిక్కిశల్య మవుతున్నాయి. 111 జీవో నిబంధనలను తోసిరాజంటూ పరీవాహక ప్రాంతంలో భారీగా నిర్మాణాలు వెలిశాయి. ఇప్పటికీ విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2002 నుంచి ఆక్రమణలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొత్త నిర్మాణాలపై నిషేధమున్నా.. వందల కొద్దీ రియల్ ఎస్టేట్ వెంచర్లు, వేలకొద్దీ విల్లాలు, నివాస సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలేజీలు, వాణిజ్య భవనాలు పుట్టుకొచ్చాయి. వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోకు తూట్లు పొడుస్తూ పరీవాహకం పరిధిలో వేల సం ఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో రెవెన్యూ శాఖ గత ఏడాది సర్వే చేసింది. ఈ జీవో వర్తించే ఆరు మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో పరిశీలన జరిపింది. మొత్తంగా 426 లేఅవుట్లలో 10,907 ఇళ్లు.. గ్రామాల్లో 4,567 ఇళ్లు, 1,920 వాణిజ్య భవనాలు అక్రమంగా నిర్మితమై ఉన్నట్టు తేల్చింది. ఇందులో కాలేజీలు, గోదాములతోపాటు కొందరు రాజకీయ నేతల ఫామ్‌హౌజ్‌లు కూడా ఉండటం గమనార్హం. అయితే అప్పట్లో కాస్త హడావుడి చేసిన రెవెన్యూ అధికారులు.. శంషాబాద్ పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. కాల్వలన్నీ ఆక్రమణలే..! జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవో పరిధిలో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంట జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్)కబ్జాకు గురవడం, ఆ ప్రాంతాలు ఇటుక బట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజనీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిల యంగా మారడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఏది? జంట జలాశయాల పరిరక్షణ కోసం నిపుణులతో లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేయాలని గతం లో హైకోర్టు ఆదేశించింది. కానీ సర్కారు ఈ విష యాన్ని పక్కన పెట్టింది. శిఖం భూముల్లో అక్ర మంగా వెలసిన ఫాంహౌస్‌లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను తొలగించడంలో తాత్సారం జరు గుతోందన్న విమర్శలున్నాయి. జలాశయాల పరిరక్షణ విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జల మండలి విభాగాలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలూ వస్తున్నాయి. వందేళ్లుగా నీళ్లు, రక్షణ.. దాదాపు వందేళ్ల కింద మూసీకి భారీగా వరదలు వచ్చినప్పుడు.. హైదరాబాద్‌కు రక్షణ, తాగునీటి సౌకర్యం రెండు ప్రయోజనాలు కల్పించేలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. హిమాయత్‌సాగర్ సామర్థ్యం 2 టీఎంసీలుకాగా.. ఉస్మాన్‌సాగర్ సామర్థ్యం 3 టీఎంసీలు. వాటిని నిర్మించినప్పటి నుంచీ హైదరాబాద్ నగర దాహార్తిని తీరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జలాశయాల నుంచి నిత్యం 50 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కఠిన నిబంధనలున్నా.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలోనే 111 జీవోను అమల్లోకి తెచ్చారు. దాని ప్రకారం.. ఈ జలాశయాలకు చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో భారీ శాశ్వత నిర్మాణాలపై నిషేధం ఉంటుంది. కాలుష్య కారక పరిశ్రమలు, నివాస కాలనీలు, భారీ హోటళ్లు, రెస్టారెంట్లు, కాలేజీలు, ఇతర సంస్థలు వంటివేవీ ఉండకూడదు. ఈ ప్రాంతం పరిధిలో వేసే లేఅవుట్లలో 60 శాతం ఓపెన్‌గా, రోడ్ల కోసం వదలాలి. వినియోగించే భూమిలో 90 శాతం మొక్కల పెంపకానికి కేటాయించాలి. భవనాలేవీ కూడా గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులకు మించి నిర్మించడానికి వీల్లేదు. కానీ ఎక్కడా ఈ ఆంక్షలు అమలుకావడం లేదు. విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ అక్రమ నిర్మాణాలే.. ఒకటీ.. రెండూ కాదు.. వందల సంఖ్యలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలన్నీ అక్రమ నిర్మాణాలే. శంషాబాద్ పట్టణంలో జీవో 111 అమల్లో ఉన్న ప్రాంతంలో వెలిసిన నిర్మాణాలివి. నిషేధం ఉన్నా కూడా ఇప్పటికీ నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నాయి. – శంషాబాద్ రూరల్ శిఖం భూముల్లో భారీగా కబ్జాలు హిమాయత్‌సాగర్ పరిధిలో శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రధానంగా అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, హిమాయత్‌సాగర్, కొత్వాల్‌గూడ, కుర్మగూడ, నర్కుడ గ్రామాల పరిధిలో ఎక్కువగా ఆక్రమణలు ఉన్నాయి. ఆయాచోట్ల సుమారు 50 ఎకరాలు పరాధీనమైనట్టు రెవెన్యూ శాఖ లెక్క తేల్చింది. వాస్తవంగా ఈలెక్క ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుందని స్థానికులే అంటున్నారు. ఇక ఉస్మాన్‌సాగర్ పరిధిలోని ఖానాపూర్, గున్గుర్తి, గండిపేట్, శంకర్పల్లి, జన్వాడ పరిధిలో సుమారు 300 ఎకరాల భూములు ఆక్రమణలకు గురైనట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. రెండింటి పరిధిలో వందల ఎకరాలు కబ్జా అయినా అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
నగరాన్ని రక్షిస్తున్నవి అవే!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ మహానగర సహజసిద్ధ పర్యావరణ వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నాయని.. అన్నికాలాల్లో నగరాన్ని కాపాడుతున్న వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సార్వత్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడటం, తాగునీటి సరఫరా, పరిసర ప్రాంతాల సాగు అవసరాల కోసం ఈ రెండు రిజర్వాయర్లను నిర్మించిన విషయాన్ని ప్రభుత్వాలు మరవొద్దని సూచించారు. జీవో 111 ఎక్కడికీ పోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త కొత్త రిజర్వాయర్లు కడుతూ.. ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. జంట జలాశయాలు, జీవో 111 తొలగింపుతో ముడిపడిన అం శాలపై ఆమె ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చా రు. ముఖ్యాంశాలు లుబ్నా సార్వత్ మాటల్లోనే.. ‘జంట’ వరప్రదాయిని! ‘‘దశాబ్దాలుగా హైదరాబాద్‌కు గుర్తింపుగా ఉన్న జలాశయాలతో.. పర్యావరణం, జీవవైవిధ్యం, పచ్చదనంతో ముడిపడిన జీవో 111 ఎక్కడికి పోదు. దానిని ఎవరూ ఏమీ చేయలేరు. సీఎంగా ప్రజలకు ఉన్నతమైన సదుపాయాలు కల్పించాలనే భావన ఉండాలి. కానీ దాదాపు 80ఏళ్లకుపైగా కొం డలపై నుంచి, ఔషధ గుణాలున్న అటవీ సంపద మీదుగా, చిన్న చిన్న వాగులు వంకలుగా ఈ రెండు రిజర్వాయర్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మళ్లీ గ్రావిటీ ద్వారానే ఆసిఫ్‌నగర్, మీరాలం ఫిల్టర్‌బెడ్ లోకి నీటిసరఫరా జరుగుతోంది. వేసవిలో వచ్చే వడగాడ్పుల నుంచి నగరాన్ని కాపాడుతూ చల్లగా ఉంచుతోంది అలా వరప్రదాయినిగా ఉన్న ఈ రెండు చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. అవిలేకుంటే.. నిండా ముంచే వరదలొస్తే పూర్తిగా నష్టపోయేది హైదరాబాదేనని అందరూ గుర్తించాలి. ‘మినరల్ రిచ్’ నీళ్లు అవి ఒక్కో నది, ఒక్కో చెరువు నీటి రుచి వేరుగా ఉంటుంది. ప్రకృతిపరంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి ‘మినరల్ రిచ్’ తాగునీరు సహజసిద్ధంగా గ్రావిటీ ద్వారా సరఫరా అవుతుంటే.. కాదనడంలో అర్థం లేదు. కృష్ణా నది క్రమంగా కుంచించుకుపోయి కాలుష్యం బారిన పడుతోంది. కృష్ణా, గోదావరి నీటిని పైపుల ద్వారా వచ్చే వందేళ్లకు సరఫరా చేస్తామనడం నమ్మశక్యంగా లేదు. భవిష్యత్‌లో నీటి కరువు ఏర్పడితే, పైపుల నీటి సరఫరా ఆగిపోతే.. ఏం చేయగలరు? జంట జలాశయాలను కాపాడుకోవాలి. కబ్జాలు తొలగించకుండా.. జీవోనే వద్దంటారా ? గత కొన్నేళ్లుగా జంట రిజర్వాయర్ల క్యాచ్మెంట్లలో భారీగా అక్రమ కట్టడాలు పెరిగాయి. వాటిని తొలగించి జలాశయాలను పరిరక్షించకుండా.. జీవో 111ను ఎత్తేస్తామనడంలో ఆంతర్యమేంటి? చిల్కూరు రిజర్వ్ ఫారెస్ట్, వికారాబాద్ అటవీ ప్రాంతం తదితరాలతో ముడిపడి, జతకలిసిన ఈ జలాశయాలను కాపాడుకోవాలి. సీఎం వ్యాఖ్యలను తొలగించాలి అసెంబ్లీలో జీవో 111పై సీఎం కేసీఆర్ మాట్లాడినపుడు జంట జలాశయాలు మృతి చెందాయంటూ చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. 2016–17లో, తర్వాత గత రెండేళ్లలో వచ్చిన భారీ వరదల నుంచి.. సజీవంగా ఉన్న ఈ రెండు రిజర్వాయర్లే హైదరాబాద్‌ను కాపాడాయి. వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో తక్కువ సమయంలో కుండపోత వానలు పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో హైదరాబాద్‌ను కాపాడగలిగేది ఈ రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లే అన్న విషయం మరవొద్దు. ఇప్పుడు ఎండాకాలంలో (మార్చి 16న) కూడా ఉస్మాన్‌సాగర్ నుంచి 91 మిలియన్ గ్యాలన్ల నీటిని, హిమాయత్‌సాగర్ నుంచి 16 మిలియన్ గ్యాలన్ల నీటిని.. హైదరాబాద్ ప్రజలకు సరఫరా చేసినట్టు వాటర్‌బోర్డు వెబ్సైట్ తాజా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. -
GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?
వందేళ్ల క్రితం మూసీకి వరద ఉధృతి వచ్చి హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైనప్పుడు... మూసీ ఒడ్డున, ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని చింతచెట్టొకటి వంద మందికి పైగా ఆశ్రయమిచ్చి వారి ప్రాణాలు కాపాడిందని ప్రతీతి! అంతటి వరదతో కలత చెందిన నిజాం రాజు నాటి మేటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించారు. మూసీ, ఈస ఉపనదులపై జలాశయాలు నిర్మించి, తద్వారా నగరానికి వరద ప్రమాదాన్ని నివారించడంతోపాటు, ఖర్చు లేకుండా తాగునీటిని అందించొచ్చని ప్రణాళిక వేశారు. అలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉనికిలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు పడుతున్న పర్యావరణ హితం కాని అడుగులు ఆ జలాశయాల ఉసురునే తీస్తాయా అనే అనుమానాలు నెలకొన్నాయి. జీవో నూట పదకొండు (111) ఉంటుందా? ఊడుతుందా? ఇప్పుడిదొక పెద్ద చర్చ! జీవో ఉన్నా సరే... ‘ఉండదు’ అనే గట్టి ప్రకటన, ప్రచారం ఎవరైనా ఆశిస్తున్నారా? హైదరా బాద్‌కు ఆనుకొని పర్యావరణ ఊపిరి తిత్తులుగా ఉన్న ఉస్మాన్ సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంతో తెచ్చిన జీవో 111 చాన్నాళ్లుగా వివాదాంశమే. అనుకూల ప్రతి కూల వాదనలు... పాతికేళ్ల కింద (1996) జీవో వచ్చినప్పటి నుంచీ ఉన్నాయి. జలాశయాల పూర్తి సామర్థ్యపు నీటి మట్టం నుంచి ఎటూ పది కిలోమీటర్ల పరిధిని ‘జీవ పరిరక్షణ ప్రాంతం’ (బయో కన్జర్వేషన్ జోన్)గా ప్రకటించి, నిషేధిత కార్యకలాపాలు నిర్వహించొద్దనటమే ఇందులోని విశేషం! ఈ జీవో ప్రకారం, పరిశ్రమలు ఏర్పాటు, భారీ నిర్మాణాల వంటి వ్యవసాయేతర కార్యకలాపాలకు అనుమతి లేదు. అయినా లెక్కకు మించి ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పర్యావరణ హితం కోరే వాళ్లు సదరు యత్నాల్ని, చర్యల్ని వ్యతిరేకించి హరిత న్యాయస్థానం, సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జీవో వివాదం మలుపులు తిరిగి, రాజకీయంగా ముఖ్యాంశమై కూర్చుంది. తాగునీటి కోసమే కాదు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు దశాబ్దాలుగా జంటనగరాల దాహార్తిని తీరుస్తున్నా... వాటి నిర్మాణ లక్ష్యం కేవలం తాగునీరే కాదు. మూసీకి 1908లో వరద ఉధృతి వచ్చి హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైంది. భారీ జన, ఆస్తినష్టం వాటిల్లింది. మూసీ ఒడ్డున, ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని చింతచెట్టొకటి ఆ రోజున వంద మందికి పైగా ఆశ్రయమిచ్చి కాపాడిందని ప్రతీతి! అంతటి వరదతో కలత చెందిన నిజాం రాజు నాటి మేటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి, సలహా కోరారు. మూసీ, ఈస ఉపనదులపై జలాశయాలు నిర్మించి, తద్వారా నగరానికి వరద ప్రమాదాన్ని నివారించడమే కాక పైపుల ద్వారా తాగునీటిని పౌరులకు ఖర్చు లేకుండా, భూమ్యాకర్షణతో అందించొచ్చని ప్రణాళిక ఇచ్చారు. ఆ మేరకు 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ వినియోగంలోకి వచ్చాయి. తాగునీటికి 80ల వరకు ఇవే పెద్దదిక్కు! మంజీరా, కృష్ణా, గోదావరి నుంచి తరలింపులు మొదలయ్యాక వీటి వాటా తగ్గింది. ఏ నదీ జలాలతో పోల్చినా... ఇవే రుచికరం, చౌక! ఇవి అవసరమే లేదనే మాట ఇప్పుడొస్తోంది. కానీ, పర్యావరణ పరంగా నగరాల్లో 25 నుంచి 29 శాతం భూభాగం నీరు, హరితంతో కూడి ఉండాలి. మిషన్ కాకతీయతో ఒక వైపు చెరువులు, కుంటల్ని పునరుద్ధరిస్తూ... ఇంకొక వైపు ఇంత ముఖ్యమైన జలాశయాలతో పనిలేదనడం సరికాదు. జీవో 111 ఎత్తివేసి, నిషేధాల్ని తొలగిస్తే పరిశ్రమలు, భారీ నిర్మాణాలు, వ్యర్థ జలాలు, కాలుష్యాలతో రెండు జలాశయాలు క్రమంగా అంతరించే ప్రమాదముంది. అదే జరిగితే, గాలిలో తేమ శాతం తగ్గి, నగరంపైకి వేడిగాలుల ప్రభావం, వేసవిలో మరణాల సంఖ్య పెరుగుతుంది, గొప్ప సహజ వాటర్షెడ్స్గా ఉన్న జలాశయాలు అంతరిస్తే భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోతాయి. జీవో ఉన్నా ఉల్లంఘనలు జలాశయాల రక్షణ దిశలో 111 తొలి జీవో కాదూ, చివరిదీ కాదు. జల సంరక్షణ కోసం 1989 జనవరిలో జీవో 50 తెచ్చారు. పారిశ్రామిక కాలుష్యాల నుంచి రక్షణకు 1994లో జీవో 192 వచ్చింది. 2009 (జీవో 1113), 2011 (జీవో 293) లోనూ వచ్చిన పలు జీవోలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జలాశయాలతో పాటు పరీవాహక ప్రాంతం, అక్కడి జీవావరణ రక్షణకు ఉద్దేశించినవే! కానీ, నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నీటి సహజ ప్రవాహాల్ని అడ్డుకున్నారు, 25,000 అక్రమ నిర్మాణాల్ని గుర్తించినట్టు కలెక్టరే రెండేళ్ల కింద ప్రకటించారు. వికారాబాద్‌లో వర్షం కురిసినా చెరువులకు నీరు రాని పరిస్థితి నేడు నెలకొంది. విద్యా సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తు భవనాలు, రిసార్టులు, ఇతరేతర కార్యక్రమాలు పెరిగాయి. భూవినియోగ స్థితిని మార్చకున్నా భూబదలాయింపులు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఠాకూర్ రాజ్‌కుమార్‌సింగ్, ప్రొ. ఎమ్వీరావ్ వంటి వారు న్యాయస్థానాల్ని సంప్రదించారు. జీవోను ఎత్తివేయడమో, సడలింపో చేయొద్దనీ, జీవోలోని విధానాలనే కాక స్ఫూర్తినీ కాపాడాలనీ సుప్రీంకోర్టు చెప్పింది. ఒక నిపుణుల కమిటీ గురించి ప్రభుత్వం చెప్పినపుడు, సరే అంటూ, యధాతథ స్థితి కొనసాగించా లని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఎవరైనా ప్రకటనే ఆశిస్తున్నారా ? ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ అన్నట్టు, ఒకవైపు నివేదిక రావాలంటూనే... మరోవైపు ఏకపక్షంగా జీవో ఎత్తివేస్తామంటే, ఎత్తివేయడానికి అనుకూలంగా నివేదిక తెప్పించుకుంటారా? అన్న సందేహాలు సహజం. ఇంతకీ జీవో ఎత్తివేయాలని కోరుతున్నదెవరు? పొరుగువారి కన్నా అభివృద్ధిలో వెనుకబడి పోతున్నామనే ఆందోళనలో ఉన్న జీవో పరిధి స్థానికులు. ఏడు (శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, కొత్తూరు) మండలాల్లోని 84కు గానూ చాలా గ్రామాల్లో పాలకమండళ్లు జీవో ఎత్తేయమని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. రియల్ ఎస్టేట్ లాబీ, పారిశ్రామిక లాబీలు కూడా ప్రభుత్వంపై జీవో ఎత్తివేతకు ఒత్తిడి తెస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. మరోవైపు జీవో ఉనికితో నిమిత్తం లేకుండా వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. చుట్టు పక్కల ఎకరం రెండు, మూడు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయల వరకు (ఇటీవల ప్రభుత్వ వేలంలో పలికిన ధరల ప్రకారమే) వెళ్లాయి. నిషేధాజ్ఞలు ఎత్తేస్తే ఈ జోన్‌లోని భూముల ధరలు కూడా అసాధారణంగా పెరుగుతాయి. ఎన్జీటీ, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంగా జీవో ఎత్తివేత అంత తేలికయిన వ్యవహారమేం కాదు. ఈ పరిస్థితుల్లో జీవో తొలగకపోయినా... ఇదుగో ఎత్తివేస్తున్నారు అన్న వాతావరణం చాలు అనుకునే భూదందాల వాళ్లూ ఉంటారు. అందరి ప్రయోజనాలూ ముఖ్యమే! సర్కార్లకు చిత్తశుద్ధి ఉంటే 111 జీవోనే కానక్కర్లేదు, ఎప్పట్నుంచో ఉన్న ‘వాటర్ యాక్ట్’ని వాడి కూడా జలాశయాల్నీ, జీవావరణాన్నీ, జీవ వైవిధ్యాన్నీ కాపాడొచ్చు అనే వారూ ఉన్నారు. ఈ వివాదాలు, ఉల్లంఘనలు, జీవో ఎత్తివేత యత్నాలు... తెలుగుదేశం, కాంగ్రెస్, తెరాస వరుస ప్రభుత్వాల కాలంలోనూ ఉన్నాయి. జీవో ఉంచాల్సిందేనని న్యాయస్థానాలు చెబితే నిష్కర్షగా ఉల్లంఘనల్ని అరికట్టాలి. జీవోని ఉంచే, తగు రీతిన సవరించే పక్షంలో... నిర్దిష్ట చర్యలు తప్పనిసరి. ఎవరెవరి అజమాయిషీలో ఎన్నెన్ని భూములు న్నాయి? వాటి వినియోగపు హక్కులేంటి? ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై ఏం చర్య తీసుకుంటారు? రైతులు ఎందరు, వారి వద్ద ఎంత భూమి ఉంది? వంటి వాస్తవిక లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. కాలుష్య కారకం కాని విధంగా సహజ వ్యవసాయాన్ని, తగిన సహాయాన్ని ప్రభుత్వం కల్పించాలి. జోన్ పరిధి గ్రామాల్లో భూమి లేని నిరుపేదలెవరో గుర్తించి, వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. ఇవేవి చేయకుంటే... పర్యావరణ హితాన్ని పణంగా పెట్టి, సర్కారే భూముల విలువ పెంచేందుకు మనుషుల విలువ తగ్గించినట్టే లెక్క! దిలీప్ రెడ్డి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు -
సర్కారు చేతికి... భూనిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా/హైదరాబాద్: అనేక వివాదాలు ముసురుకున్న 111 జీవోను ఎత్తివేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ప్రయోజనం దక్కుతుంది. హైదరాబాద్ దాహార్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ ఉన్న ఆంక్షలను తొలగిస్తే దండిగా భూనిధి (ల్యాండ్ బ్యాంక్) సమకూరనుంది. 84 గ్రామాల్లో 30 వేల ఎకరాలకుపైగా భూములపై ఆంక్షలు తొలగనున్నాయి. ఐటీ హబ్‌గా అవతరించిన గచ్చిబౌలి ప్రాంతానికి ఈ జీవో పరిధి చేరువలో ఉన్నందున ఐటీ కంపెనీల స్థాపనకు ఈ ప్రాంతంవైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. అదీగాక ఈ జీవోను సవరిస్తే ఐటీ పరిధి అటు చేవెళ్ల, శంకర్పల్లి, ఇటు కొత్తూరు వరకు విస్తరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తద్వారా ఈ ప్రాంతంలో స్థిరాస్తిరంగం కూడా మరింత ఊపందుకుంటుందని అంటున్నారు. 111 జీవో అవసరం తీరిపోయిందని, అర్థరహితమైన ఈ జీవోను ఎత్తివేస్తామని తాజాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రద్దు చేయాలని డిమాండ్లు.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను సంరక్షించేందుకు చుట్టూ పది కిలోమీటర్ల పరిధిని పరిరక్షణ ప్రాంతంగా ప్రకటిస్తూ 1996లో ప్రభుత్వం 111 జీవోను తెచ్చింది. అయితే, నగర నీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి, కృష్ణాజలాలు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చినందున.. ఈ జలాశయాల అవసరం పెద్దగా లేదని, నగరీకరణ నేపథ్యంలో ఈ జీవోను రద్దు చేయాలనే డిమాండ్లు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలు పార్టీలు ఈ జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చాయి. టీఆర్ఎస్ కూడా ఈ జీవో ఎత్తివేతే ప్రధాన హామీగా ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, ఈ అంశం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అది సాధ్యపడలేదు. జలాశయాల దిగువ ప్రాంతంలో ఆంక్షలు సహేతుకం కాదని, ఈ ప్రాంతాన్ని మినహాయించాలని, నగరీకరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ నివేదిక అందనప్పటికీ సీఎం కేసీఆర్ ఈ జీవోను ఎత్తివేయనున్నట్లు ప్రకటించడం విశేషం. అభ్యంతరాలు... హర్షాతిరేకాలు సీఎం ప్రకటనపై పర్యావరణవేత్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. జీవో అమల్లో ఉన్న 84 గ్రామాల్లో మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి. న్యాయపరమైన చిక్కులు, కమిటీ నివేదిక సానుకూలంగా వస్తే గనుక జీవో రద్దు కానుంది. తద్వారా 111 జీవో పరిధిలో 30 వేల ఎకరాలకుపైగా ఉన్న సర్కారు భూమిపై ఆంక్షలు తొలగనున్నాయి. ఇప్పటికీ ఈ భూమి సర్కారుదేనైనా.. అభివృద్ధికి జీవో అడ్డుగా మారడంతో ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. కేవలం 10 శాతం విస్తీర్ణం భూమిని మాత్రమే వినియోగించుకోవాలని, మిగతా దాన్ని పరిరక్షించాలనే నిబంధన వల్ల పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూకేటాయింపు అడ్డుతగులుతోంది. దీనికితోడు కాలుష్యం పేరిట పరిశ్రమల ఏర్పాటును ఈ జీవో వ్యతిరేకిస్తున్నందున పరిశ్రమలు పెట్టేవారికీ స్థలాలు ఇవ్వలేని పరిస్థితి. ఇక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే లక్షలాది ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉంది. ఆంక్షల వల్ల ఈ భూమి.. సాగు, ఫాంహౌజ్‌లు, రిక్రియేషన్ జోన్లకే పరిమితమైంది. జీవో ఎత్తివేతతో ఈ భూమి కూడా విడుదల కానుంది. జీవో ఎందుకు తెచ్చారంటే? ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతం పరిరక్షణ కోసం ప్రభుత్వం 1994 మార్చి 31న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 192 జీవోను తెచ్చింది. దాన్ని సవరిస్తూ 1996 మే 8న 111 జీవోను విడుదల చేసింది. జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వాణిజ్య, పారిశ్రామిక నిర్మాణాలు, లే అవుట్లు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలను నిషేధించింది. తమ అభివృద్ధికి ఈ జీవో అడ్డుగా మారిందంటూ 84 గ్రామాల్లోని రైతులు గతంలో ఆందోళనకు దిగారు. జీవోను ఎత్తివేయాలంటూ ఆయా గ్రామాల సర్పంచ్‌లు రెండుసార్లు మూకుమ్మడిగా తీర్మానాలు చేసి పంపారు. జీవోను సమీక్షించేందుకు మూడేళ్ల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్ అంగీకరించింది. తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. జీవో ఎత్తివేతపై సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో అనేక చిక్కు ప్రశ్నలు తెర మీదికొస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమనే చర్చ సర్వత్రా జరుగుతోంది. జీవో ఎత్తివేయాలన్నా.. సమీక్షించాలన్నా సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. జీవో ఎత్తివేత అంశం ప్రభుత్వం చేతిలో ఉందా? ఒకవేళ జీవోను ఎత్తివేస్తే.. ప్రభుత్వం ఎన్జీటీ, సుప్రీం కోర్టుకు ఏమని సమాధానం చెబుతుంది? జంట జలాశయాల పరిరక్షణకు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపడతారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్యావరణవేత్తల అభ్యంతరాలివీ.. ►111 జీవోను ఎత్తివేస్తే రియల్ఎస్టేట్, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగి స్వచ్ఛమైన జంట జలాశయాలు గరళ సాగరాలుగా మారతాయి. ►వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాల తరలింపునకు అయ్యే ఖర్చు కంటే హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న ఈ జలాశయాల ద్వారా తక్కువ ఖర్చుతో దాహార్తిని సమూలంగా తీర్చే అవకాశం ఉంది. ►జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాలు కాంక్రీట్ మహారణ్యంలా మారి వర్షపు నీటిని చేర్చే ఇన్‌ఫ్లో చానల్స్ పూర్తిగా మూసుకుపోతాయి. ►జలాశయాల శిఖం భూముల్లో అక్రమంగా వెలిసే ఫాంహౌస్‌లు, ఇంజనీరింగ్ కళాశాలలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో జలాశయాలకు మరణశాసనం లిఖించినట్లవుతుంది. ►పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. భూగర్భజలాలు తగ్గుతాయి. హైదరాబాద్‌కు వరదల ముప్పుంటుంది. ►పంటపొలాలు రియల్ వెంచర్లుగా మారి హరిత వాతావరణం కనుమరుగవుతుంది. -
సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?
సాక్షి, హైదరాబాద్: జీవో 111 ఎత్తివేస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పర్యావరణ వేత్తలు, నీటి వనరుల రంగ నిపుణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపాన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు ఉన్నాయని, నగరంతో ముడిపడిన జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్య ప్రాంతం మొత్తం కూడా ఈ జలాశయాల పరిధిలోనే ఉందని వారు చెబుతున్నారు. ఈ ప్రకృతి సహజసిద్ధమైన లక్షణం, నగరానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితులు దెబ్బతింటే.. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాతావరణంలో పెను మార్పులు సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. జలాశయాల ప్రాధాన్యత తగ్గించకూడదు ‘దేశంలో, బహుశా ప్రపంచంలో కరెంట్ లేకుండా నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మాత్రమే. అంటే సున్నా శాతం కర్బన ఉద్ఘారాలతో నీటిని సరఫరా చేసే ఇంతగొప్ప జలాశయాలను గొప్పగా చూపుకోవాలి. అంతేకానీ వాటి ప్రాధాన్యతను, విలువను తగ్గించకూడదు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినప్పుడు వాటి నివారణకు నీటిపారుదల రంగ నిపుణుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వశ్వేరయ్య విభిన్న ఆలోచనలతో ముందుచూపుతో వీటికి డిజైన్ చేశారు..’అని సమీకృత నీటివనరుల నిర్వహణ నిపుణుడు, భారత ప్రమాణాల సంస్థ సాంకేతిక సభ్యుడు బీవీ సుబ్బారావు తెలిపారు. చదవండి: CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరాల వర్షం బీవీ సుబ్బారావు, పురుషోత్తంరెడ్డి ప్రస్తుతం పరిమితులు లేని పట్టణీకరణ పెనుసమస్యగా మారిందని, పట్టణీకరణలో కూడా సుస్థిరమైన నీటిసరఫరా అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్యమని చెప్పారు. అభివృద్ధి అంటే కాంక్రీట్ బిల్డింగ్లు కట్టి అమ్మేయడం కాదన్నారు. హుస్సేన్‌సాగర్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ జంట జలాశయాల విషయంలో జరగకుండా చూసుకోవాలని సూచించారు. వాటి అవసరం తీరిపోయిందన్నట్టుగా మాట్లాడటం సరికాదన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని అంశాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించారు. కోర్టుల ముందు నిలబడలేదు ‘భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూసీనదిపై ఈ రెండింటినీ నిర్మించారు. జీవో 111ను సుప్రీంకోర్టు గతంలో పూర్తిగా సమర్థించింది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ సమతుల్యాన్ని పాటిస్తూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అందువల్ల జీవో 111ను ఏమీ చేయలేరు. తమకు అధికారం ఉందని ఏదైనా చేసినా కోర్టుల ఎదుట ఎంతమాత్రం నిలబడదు. రియల్ ఎస్టేట్ లాబీకి, కార్పొరేట్ ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగితే ప్రజలు ఈ ప్రతిష్టాత్మక అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు..’అని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి హెచ్చరించారు. పర్యావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని అన్నారు. అసలేంటి జీవో 111 హైదరాబాద్ నగరానికి వరద ముప్పు తప్పించడంతోపాటు తాగునీటిని అందించేందుకు నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి నీళ్లు తీసుకునేవారు. ఇప్పుడది తగ్గిపోయింది. ఎండా కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు నీళ్లు తీసుకునే సందర్భం ఉంది. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ రెండు జలాశయాల నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదు. సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉంది. 83 గ్రామాలు, ఏడు మండలాలు కలిసి ఉన్నాయి. ఈ రిజర్వాయర్ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. అయితే రిజర్వాయర్ల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇవీ నిబంధనలు జీఓ పరిధిలో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు మండలాల్లోని 83 గ్రామాలను చేర్చింది. ఈ జీవో పరిధిలో కాలుష్యకారకమైన ఫ్యాక్టరీలు, నిర్మాణాలు, లేఅవుట్లు, వెంచర్లు చేపట్టవద్దని నిబంధనలు పెట్టింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు. -
హైదరాబాద్‌ను రక్షిస్తోన్న ‘అతిథి’..!
ఢాం..ఢాం.. గుండ్లు పేలుతున్నాయి.. చుట్టూ ఉన్న గుట్టల మాటున ఆ శబ్దం ప్రతిధ్వనిస్తోంది.హైదరాబాద్‌కు అతిథులుగా ఉన్నత ప్రముఖులు వచ్చినప్పుడు గన్ శాల్యూట్గా 21మార్లు తుపాకులను గాల్లోకి పేల్చడం ఆనవాయితీ.. ఇక్కడా ఓ అతిథిని ఆహ్వానిస్తూ డైనమైట్ పేలుళ్లు.. తొలుత 21.. ఆపై మొత్తంగా 101సార్లు. ఓ బృహత్తర పనికి శ్రీకారం చుట్టుకున్న సందర్భమది.గన్ శాల్యూట్ తీసుకున్న అతిథులతో భాగ్యనగరానికి ఒరిగిందేమిటో కానీ.. ఈ ప్రత్యేక శాల్యూట్ తీసుకున్న ‘అతిథి’మాత్రం నగరాన్నే రక్షిస్తోంది. ఆ అతిథి పేరు– ‘గండిపేట జలాశయం’.. ఉరఫ్ ఉస్మాన్‌సాగర్. సాక్షి, హైదరాబాద్: 1908 సెప్టెంబర్: జల ప్రళయాన్ని తలపించేలా మూసీ ఉప్పొంగింది. బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో రెండ్రోజుల ఏకధాటి వానలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. దాని తీరంలో అభివృద్ధి చెందిన ప్రధాన నగరం ధ్వంసమైంది. 15 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అంతకు పదిరెట్ల మంది నిరాశ్రయులయ్యారు. నగర పునర్నిర్మాణ బాధ్యతను నాటి ప్రఖ్యాత ఇంజినీర్, మైసూర్ స్టేట్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. ఆయన పూర్తిస్థాయి అధ్యయనం చేసి మూసీనది (ఈసీతో కలుపుకొని)పై రెండు జలాశయాలు నిర్మించాలని తేల్చారు. అందులో పెద్దది, ముఖ్యమైంది గండిపేట జలాశయం. (వినియోగంలో ఉన్న వందేళ్ల నాటి కార్యాలయం) 101 డైనమైట్లు పేల్చి.. గుట్టలు ఛిద్రంచేసి.. మార్చి 23, 1913: ప్రస్తుతం గండిపేట జలాశయం ఉన్నచోట అన్నీ గుట్టలే. మధ్యలో కొన్ని ఊళ్లు. వాటిని ఖాళీచేయించి గుట్ట భాగాలను డైనమైట్లు పెట్టి పేల్చేశారు. నాటి బ్రిటిష్ ఇండియా రెసిడెంట్ ఫినే, ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీ సమక్షంలో విశ్వవిఖ్యాత ఇంజినీర్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య స్వీయ పర్యవేక్షణలో 101 డైనమైట్లు పేల్చగా, గుట్టభాగాలు ఛిద్రమై మైదానంలాంటి ప్రాంతం ఏర్పాటైంది. అక్కడే ఓ భారీ మానవ నిర్మిత జలాశయం ఉద్భవించింది. 1913 మార్చిలో ప్రారంభమైన పనులు 1920 శీతాకాలం నాటికి పూర్తయ్యాయి. గండిపేట జలాశయం ప్రారంభ తేదీ, నెలలకు సంబంధించి కచ్చితమైన అధికారిక సమాచారమేదీ లేదని, అప్పటికే జోరుగా పడిన వర్షాలతో 1920 శీతాకాలం నాటికి గండిపేట నిండుకుండలా మారిందని, ఆ సమయంలోనే దాన్ని ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఈ చెరువు సేవలు ప్రారంభమై ఈ చలికాలంతో సరిగ్గా వందేళ్లవుతోంది. అంటే అదిప్పుడు ‘శత వసంతాల గండిపేట’అన్నమాట. 46 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయం నిర్మాణానికి అప్పట్లో రూ.56 లక్షలు ఖర్చయ్యాయి. కాగా, ఇది అందుబాటులోకి వచ్చిన ఏడాదే, అంటే 1920లో పనులు ప్రారంభమై 1927లో హిమాయత్‌సాగర్ జలాశయం సిద్ధమైంది. (నేటికీ వినియోగంలో ఉన్న రాన్సన్స్ అండ్ రేపియర్ లి కంపెనీ రూపొందించిన యంత్రాలు) రిటైర్మెంట్ కాదు.. టర్నింగ్ పాయింట్ ప్రస్తుతం కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా వస్తూ నగర దాహార్తిని తీరుస్తున్నాయి. దీంతో కొంతకాలంగా ‘గండిపేటకు ఇక రిటైర్మెంటే’అనే మాటలు వినిపిస్తున్నాయి. జంట జలాశయాల పరిరక్షణకు పొందుపరిచిన ఆంక్షలకు రేపోమాపో సడలింపులుంటాయని ముమ్మర ప్రచారం జరుగుతున్న వేళ, సరిగ్గా వందేళ్లలోకి గండిపేట అడుగుపెట్టిన సమయంలో పెద్ద ‘టర్నింగ్ పాయింట్’ఘటనే ఎదురైంది. 1908 నాటి వరదలకు నగరం ధ్వంసమైన నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి జలప్రళయం రాకుండా ఏర్పడ్డ గండిపేట.. తన అవసరాన్ని వందేళ్ల తర్వాత కూడా చాలా గట్టిగా గుర్తుచేసింది. తనను నిర్లక్ష్యం చేస్తే సిటీకి మళ్లీ ప్రళయం ముంచుకొచ్చినట్టేనని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలోని వందల కాలనీలు, బస్తీలు నీటమునిగిన విషయం తెలిసిందే. నెలైనా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. జంట జలాశయాలు లేకుంటే ‘1908 బీభత్సం’కంటే పెద్ద ఉత్పాతాన్నే నగరం కళ్లచూడాల్సి వచ్చేది. ఉస్మాన్‌సాగర్–హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు, వాటి చుట్టూ ఉన్న చిన్న చెరువులు పదిలంగా ఉంటేనే భవిష్యత్తులో మూసీ వరదల నుంచి సిటీ సురక్షితంగా ఉండగలదన్న విషయం స్పష్టమైంది. నగరాన్ని కాపాడేందుకు వందేళ్ల కింద పుట్టిన తాను (గండిపేట).. వందేళ్ల వయసులో తానింకా సిటీకి అవసరమేనన్న విషయాన్ని తేల్చిచెప్పింది. వెరసి తనను కాపాడుకుంటేనే మీరు సురక్షితంగా ఉంటారని నగరవాసిని గట్టిగానే హెచ్చరించింది. గండిపేట జలాశయాన్ని పరిరక్షించుకోవాలని, వర్షపు నీరు అందులోకి చేరకుండా అడ్డుపడే నిర్మాణాలను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. (యంత్రాలు రూపొందించిన సంస్థ పేరు) అవి లేకుంటే మనం ఉండం గండిపేట జలాశయం నిర్మాణ సమయంలో సామగ్రి, కూలీలను రైలులో తరలించేవారు. ఇందుకోసం నగరం నుంచి మూసీ తీరం వెంబడి గండిపేట వరకు న్యారోగేజ్ రైల్వేలైన్ వేశారు. నా చిన్నతనంలో ఆ పట్టాలను చూశాను. తర్వాత తొలగించారు. గండిపేట వందేళ్లయినా ఇంత కూడా చెక్కుచెదరలేదు. ఇంకో వందేళ్లు ఉంటుంది. జంటజలాశయాలు బాగుంటేనే నగరం పదిలమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వాటికి రక్షణగా ఉన్న ఆంక్షలు సడలిస్తే వాటికి ఉరి వేసినట్టే. అప్పుడు వరదల నుంచి నగరాన్ని కాపాడేదెవరు?. – అనురాధారెడ్డి, ‘ఇంటాక్’– హైదరాబాద్ కన్వీనర్ -
జంట జలాశయాలకు జలకళ
మణికొండ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండు కుండలా తొణికిస లాడుతున్నాయి. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే సోమవారం సాయంత్రానికి హిమాయత్‌సాగర్ 8 గేట్లు ఎత్తి దిగువనకు నీరు వదులుతామని జలమండలి ట్రాన్స్మిషన్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. జంట జలాశయాల గేట్లు 2010లో మాత్రమే తెరిచారు. నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ జంట జలాశయాలు పూర్తిస్థాయి జలకళతో కనిపించడం ఇదే కావడం విశేషం. కాగా శనివారం ఉదయం నుంచి మొదలైన ఈసీ, మూసీ నదుల ప్రవాహం మరింత పెరగడంతో ఆదివారం సాయంత్రానికి హిమాయత్‌సాగర్ గరిష్ట నీటిమట్టం 1763.500 అడుగులకు గాను 1752 అడుగులకు చేరింది. ఉస్మాన్‌సాగర్ (గండిపేట్)కు శనివారం వరద ప్రవాహం ఓ మోస్తరుగా ఉండటంతో జలాశయం నీటి మట్టం అడుగున్నర మేర పెరిగింది. ఈ జలాశయం గరిష్ట నీటిమట్టం 1790 అడుగులుండగా, ఆదివారం సాయంత్రానికి 1771 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా, జంట జలాశయాల వరదనీటి పరిస్థితిని రాజేంద్రనగర్ సర్కిల్ జలమండలి జనరల్ మేనేజర్ సాయినాథ్ ఆదివారం ఉదయం పరిశీలించారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు వరద ఉధృతి ఎక్కువైందని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం.. హిమాయత్ సాగర్ జలాశయం గేట్లు తెరవనున్న నేపథ్యంలో జలాశయం దిగువన ఉన్న లంగర్‌హౌస్, బాపూఘాట్, డిఫెన్స్ కాలనీ, మొఘల్‌కా నాలా, కార్వాన్ పరిధిలోని పలు బస్తీల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని రెవెన్యూ, జలమండలి యంత్రాంగం హెచ్చరికలు చేసింది. ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు.. లంగర్‌హౌస్: హిమయత్సాగర్ గేట్లు ఎత్తనుండటంతో ముందస్తుగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారం రాత్రి లంగర్‌హౌస్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇంటింటికీ వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలని సూచించారు. గ్రామాలను దాటాక లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద ఈ వరద నీరు నగరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి వాగు కుచించుకు పోవడంతో పోలీసులు ప్రజలను ముందస్తుగా తరలించే పనిలో నిమగ్నమయ్యారు.