జంట జలాశయాలకు జలకళ
మణికొండ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండు కుండలా తొణికిస లాడుతున్నాయి. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే సోమవారం సాయంత్రానికి హిమాయత్‌సాగర్ 8 గేట్లు ఎత్తి దిగువనకు నీరు వదులుతామని జలమండలి ట్రాన్స్‌మిషన్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
జంట జలాశయాల గేట్లు 2010లో మాత్రమే తెరిచారు. నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ జంట జలాశయాలు పూర్తిస్థాయి జలకళతో కనిపించడం ఇదే కావడం విశేషం. కాగా శనివారం ఉదయం నుంచి మొదలైన ఈసీ, మూసీ నదుల ప్రవాహం మరింత పెరగడంతో ఆదివారం సాయంత్రానికి హిమాయత్‌సాగర్ గరిష్ట నీటిమట్టం 1763.500 అడుగులకు గాను 1752 అడుగులకు చేరింది.
ఉస్మాన్‌సాగర్ (గండిపేట్)కు శనివారం వరద ప్రవాహం ఓ మోస్తరుగా ఉండటంతో జలాశయం నీటి మట్టం అడుగున్నర మేర పెరిగింది. ఈ జలాశయం గరిష్ట నీటిమట్టం 1790 అడుగులుండగా, ఆదివారం సాయంత్రానికి 1771 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా, జంట జలాశయాల వరదనీటి పరిస్థితిని రాజేంద్రనగర్ సర్కిల్ జలమండలి జనరల్ మేనేజర్ సాయినాథ్ ఆదివారం ఉదయం పరిశీలించారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు వరద ఉధృతి ఎక్కువైందని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం..
హిమాయత్ సాగర్ జలాశయం గేట్లు తెరవనున్న నేపథ్యంలో జలాశయం దిగువన ఉన్న లంగర్‌హౌస్, బాపూఘాట్, డిఫెన్స్ కాలనీ, మొఘల్‌కా నాలా, కార్వాన్ పరిధిలోని పలు బస్తీల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని రెవెన్యూ, జలమండలి యంత్రాంగం హెచ్చరికలు చేసింది.
ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు..
లంగర్‌హౌస్: హిమయత్‌సాగర్ గేట్లు ఎత్తనుండటంతో ముందస్తుగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారం రాత్రి లంగర్‌హౌస్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇంటింటికీ వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాలని సూచించారు. గ్రామాలను దాటాక లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద ఈ వరద నీరు నగరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి వాగు కుచించుకు పోవడంతో పోలీసులు ప్రజలను ముందస్తుగా తరలించే పనిలో నిమగ్నమయ్యారు.