వందేళ్ల క్రితం మూసీకి వరద ఉధృతి వచ్చి హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైనప్పుడు... మూసీ ఒడ్డున, ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని చింతచెట్టొకటి వంద మందికి పైగా ఆశ్రయమిచ్చి వారి ప్రాణాలు కాపాడిందని ప్రతీతి! అంతటి వరదతో కలత చెందిన నిజాం రాజు నాటి మేటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించారు. మూసీ, ఈస ఉపనదులపై జలాశయాలు నిర్మించి, తద్వారా నగరానికి వరద ప్రమాదాన్ని నివారించడంతోపాటు, ఖర్చు లేకుండా తాగునీటిని అందించొచ్చని ప్రణాళిక వేశారు. అలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉనికిలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు పడుతున్న పర్యావరణ హితం కాని అడుగులు ఆ జలాశయాల ఉసురునే తీస్తాయా అనే అనుమానాలు నెలకొన్నాయి.
జీవో నూట పదకొండు (111) ఉంటుందా? ఊడుతుందా? ఇప్పుడిదొక పెద్ద చర్చ! జీవో ఉన్నా సరే... ‘ఉండదు’ అనే గట్టి ప్రకటన, ప్రచారం ఎవరైనా ఆశిస్తున్నారా? హైదరా బాద్‌కు ఆనుకొని పర్యావరణ ఊపిరి తిత్తులుగా ఉన్న ఉస్మాన్ సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంతో తెచ్చిన జీవో 111 చాన్నాళ్లుగా వివాదాంశమే. అనుకూల ప్రతి కూల వాదనలు... పాతికేళ్ల కింద (1996) జీవో వచ్చినప్పటి నుంచీ ఉన్నాయి. జలాశయాల పూర్తి సామర్థ్యపు నీటి మట్టం నుంచి ఎటూ పది కిలోమీటర్ల పరిధిని ‘జీవ పరిరక్షణ ప్రాంతం’ (బయో కన్జర్వేషన్ జోన్)గా ప్రకటించి, నిషేధిత కార్యకలాపాలు నిర్వహించొద్దనటమే ఇందులోని విశేషం!
ఈ జీవో ప్రకారం, పరిశ్రమలు ఏర్పాటు, భారీ నిర్మాణాల వంటి వ్యవసాయేతర కార్యకలాపాలకు అనుమతి లేదు. అయినా లెక్కకు మించి ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పర్యావరణ హితం కోరే వాళ్లు సదరు యత్నాల్ని, చర్యల్ని వ్యతిరేకించి హరిత న్యాయస్థానం, సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జీవో వివాదం మలుపులు తిరిగి, రాజకీయంగా ముఖ్యాంశమై కూర్చుంది.
తాగునీటి కోసమే కాదు
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు దశాబ్దాలుగా జంటనగరాల దాహార్తిని తీరుస్తున్నా... వాటి నిర్మాణ లక్ష్యం కేవలం తాగునీరే కాదు. మూసీకి 1908లో వరద ఉధృతి వచ్చి హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైంది. భారీ జన, ఆస్తినష్టం వాటిల్లింది. మూసీ ఒడ్డున, ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని చింతచెట్టొకటి ఆ రోజున వంద మందికి పైగా ఆశ్రయమిచ్చి కాపాడిందని ప్రతీతి! అంతటి వరదతో కలత చెందిన నిజాం రాజు నాటి మేటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి, సలహా కోరారు. మూసీ, ఈస ఉపనదులపై జలాశయాలు నిర్మించి, తద్వారా నగరానికి వరద ప్రమాదాన్ని నివారించడమే కాక పైపుల ద్వారా తాగునీటిని పౌరులకు ఖర్చు లేకుండా, భూమ్యాకర్షణతో అందించొచ్చని ప్రణాళిక ఇచ్చారు. ఆ మేరకు 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ వినియోగంలోకి వచ్చాయి. తాగునీటికి 80ల వరకు ఇవే పెద్దదిక్కు! మంజీరా, కృష్ణా, గోదావరి నుంచి తరలింపులు మొదలయ్యాక వీటి వాటా తగ్గింది. ఏ నదీ జలాలతో పోల్చినా... ఇవే రుచికరం, చౌక!
ఇవి అవసరమే లేదనే మాట ఇప్పుడొస్తోంది. కానీ, పర్యావరణ పరంగా నగరాల్లో 25 నుంచి 29 శాతం భూభాగం నీరు, హరితంతో కూడి ఉండాలి. మిషన్ కాకతీయతో ఒక వైపు చెరువులు, కుంటల్ని పునరుద్ధరిస్తూ... ఇంకొక వైపు ఇంత ముఖ్యమైన జలాశయాలతో పనిలేదనడం సరికాదు. జీవో 111 ఎత్తివేసి, నిషేధాల్ని తొలగిస్తే పరిశ్రమలు, భారీ నిర్మాణాలు, వ్యర్థ జలాలు, కాలుష్యాలతో రెండు జలాశయాలు క్రమంగా అంతరించే ప్రమాదముంది. అదే జరిగితే, గాలిలో తేమ శాతం తగ్గి, నగరంపైకి వేడిగాలుల ప్రభావం, వేసవిలో మరణాల సంఖ్య పెరుగుతుంది, గొప్ప సహజ వాటర్‌షెడ్స్‌గా ఉన్న జలాశయాలు అంతరిస్తే భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోతాయి.
జీవో ఉన్నా ఉల్లంఘనలు
జలాశయాల రక్షణ దిశలో 111 తొలి జీవో కాదూ, చివరిదీ కాదు. జల సంరక్షణ కోసం 1989 జనవరిలో జీవో 50 తెచ్చారు. పారిశ్రామిక కాలుష్యాల నుంచి రక్షణకు 1994లో జీవో 192 వచ్చింది. 2009 (జీవో 1113), 2011 (జీవో 293) లోనూ వచ్చిన పలు జీవోలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జలాశయాలతో పాటు పరీవాహక ప్రాంతం, అక్కడి జీవావరణ రక్షణకు ఉద్దేశించినవే! కానీ, నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నీటి సహజ ప్రవాహాల్ని అడ్డుకున్నారు, 25,000 అక్రమ నిర్మాణాల్ని గుర్తించినట్టు కలెక్టరే రెండేళ్ల కింద ప్రకటించారు.
వికారాబాద్‌లో వర్షం కురిసినా చెరువులకు నీరు రాని పరిస్థితి నేడు నెలకొంది. విద్యా సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తు భవనాలు, రిసార్టులు, ఇతరేతర కార్యక్రమాలు పెరిగాయి. భూవినియోగ స్థితిని మార్చకున్నా భూబదలాయింపులు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఠాకూర్ రాజ్‌కుమార్‌సింగ్, ప్రొ. ఎమ్వీరావ్ వంటి వారు న్యాయస్థానాల్ని సంప్రదించారు. జీవోను ఎత్తివేయడమో, సడలింపో చేయొద్దనీ, జీవోలోని విధానాలనే కాక స్ఫూర్తినీ కాపాడాలనీ సుప్రీంకోర్టు చెప్పింది. ఒక నిపుణుల కమిటీ గురించి ప్రభుత్వం చెప్పినపుడు, సరే అంటూ, యధాతథ స్థితి కొనసాగించా లని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది.
ఎవరైనా ప్రకటనే ఆశిస్తున్నారా ?
‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ అన్నట్టు, ఒకవైపు నివేదిక రావాలంటూనే... మరోవైపు ఏకపక్షంగా జీవో ఎత్తివేస్తామంటే, ఎత్తివేయడానికి అనుకూలంగా నివేదిక తెప్పించుకుంటారా? అన్న సందేహాలు సహజం. ఇంతకీ జీవో ఎత్తివేయాలని కోరుతున్నదెవరు? పొరుగువారి కన్నా అభివృద్ధిలో వెనుకబడి పోతున్నామనే ఆందోళనలో ఉన్న జీవో పరిధి స్థానికులు. ఏడు (శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, కొత్తూరు) మండలాల్లోని 84కు గానూ చాలా గ్రామాల్లో పాలకమండళ్లు జీవో ఎత్తేయమని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. రియల్ ఎస్టేట్ లాబీ, పారిశ్రామిక లాబీలు కూడా ప్రభుత్వంపై జీవో ఎత్తివేతకు ఒత్తిడి తెస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. మరోవైపు జీవో ఉనికితో నిమిత్తం లేకుండా వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. చుట్టు పక్కల ఎకరం రెండు, మూడు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయల వరకు (ఇటీవల ప్రభుత్వ వేలంలో పలికిన ధరల ప్రకారమే) వెళ్లాయి. నిషేధాజ్ఞలు ఎత్తేస్తే ఈ జోన్‌లోని భూముల ధరలు కూడా అసాధారణంగా పెరుగుతాయి. ఎన్జీటీ, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంగా జీవో ఎత్తివేత అంత తేలికయిన వ్యవహారమేం కాదు. ఈ పరిస్థితుల్లో జీవో తొలగకపోయినా... ఇదుగో ఎత్తివేస్తున్నారు అన్న వాతావరణం చాలు అనుకునే భూదందాల వాళ్లూ ఉంటారు.
అందరి ప్రయోజనాలూ ముఖ్యమే!
సర్కార్లకు చిత్తశుద్ధి ఉంటే 111 జీవోనే కానక్కర్లేదు, ఎప్పట్నుంచో ఉన్న ‘వాటర్ యాక్ట్’ని వాడి కూడా జలాశయాల్నీ, జీవావరణాన్నీ, జీవ వైవిధ్యాన్నీ కాపాడొచ్చు అనే వారూ ఉన్నారు. ఈ వివాదాలు, ఉల్లంఘనలు, జీవో ఎత్తివేత యత్నాలు... తెలుగుదేశం, కాంగ్రెస్, తెరాస వరుస ప్రభుత్వాల కాలంలోనూ ఉన్నాయి. జీవో ఉంచాల్సిందేనని న్యాయస్థానాలు చెబితే నిష్కర్షగా ఉల్లంఘనల్ని అరికట్టాలి. జీవోని ఉంచే, తగు రీతిన సవరించే పక్షంలో... నిర్దిష్ట చర్యలు తప్పనిసరి. ఎవరెవరి అజమాయిషీలో ఎన్నెన్ని భూములు న్నాయి? వాటి వినియోగపు హక్కులేంటి? ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై ఏం చర్య తీసుకుంటారు? రైతులు ఎందరు, వారి వద్ద ఎంత భూమి ఉంది? వంటి వాస్తవిక లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. కాలుష్య కారకం కాని విధంగా సహజ వ్యవసాయాన్ని, తగిన సహాయాన్ని ప్రభుత్వం కల్పించాలి. జోన్ పరిధి గ్రామాల్లో భూమి లేని నిరుపేదలెవరో గుర్తించి, వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. ఇవేవి చేయకుంటే... పర్యావరణ హితాన్ని పణంగా పెట్టి, సర్కారే భూముల విలువ పెంచేందుకు మనుషుల విలువ తగ్గించినట్టే లెక్క!
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు
Comments
Please login to add a commentAdd a comment