సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలను కాపాడుకోవాలనే పట్టుదలతో ప్రజాభిప్రాయం ఉద్యమరూపం తీసుకుంటే ఏదైనా సాధించవచ్చని పర్యావరణవేత్త కెప్టెన్ జె.రామారావు చెప్పారు. ఏదైనా అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, ప్రజాగ్రహం పెల్లుబుకుతుందో అప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి తమ తప్పులను సరిచేసుకుంటాయన్నారు. కోర్టులు కలగజేసుకోవడం కంటే ప్రజాందోళనతోనే జీవో 111ను, ఈ జంట రిజర్వాయర్లను కాపాడుకోవచ్చని స్పష్టంచేశారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాణ వాయువును అం దిస్తూ ఊపిరితిత్తులుగా నిలిచిన నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం నిల్వల అన్వేషణ, వెలికితీతను ప్రజల మద్దతుతో అడ్డుకోగలిగామన్నారు. అయితే, జీవో 111పై మాత్రం ప్రజా ఉద్యమాన్ని నిర్మించలేకపోయామని ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామారావు చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఇప్పటికే ఎన్నో ఉల్లంఘనలు...
జీవో 111 పేరిట కఠిన నిబంధనలున్నా ఈ జంట జలాశయాల క్యాచ్‌మెంట్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. కాలేజీలు, కాటేజీలు, ఇళ్లు ఇలా అనేకం వచ్చేశాయి. ప్రభుత్వమే ఈ జీవోను ఉల్లంఘించి పోలీస్‌స్టేషన్లు తదితరాలు నిర్మిం చింది. ఇప్పుడు ఈ జీవోను ఎత్తేయడం ద్వారా అక్రమ నిర్మాణాలను ‘లీగలైజ్’చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ జలాశయాల్లోకి మురుగు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత చేటే. వీటికి కొద్దో గొప్పో రక్షణగా ఉన్న ఈ జీవోను ఎత్తేస్తే ఇవి కూడా హుస్సేన్‌సాగర్ మాదిరి కాలుష్య కాసారమవుతాయి.
రియల్ ఎస్టేట్ కారణంగానే...
రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇక్కడి భూముల విలువలకు రెక్కలొచ్చాయి. రియల్టర్లు, వ్యాపారవేత్తల ఒత్తిళ్లకు ప్రభు త్వం తలొగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జంట జలాశయాలు నగర తాగునీటి వనరులుగా కొన సాగాలనే ఉద్దేశంతో జీవో 111ను తెచ్చారు. వీటికి 10 కి.మీ పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలు, ఇతర కట్టడాలు నిర్మించకుండా ఆంక్షలు విధించారు. మంచి ఉద్దేశంతో ఇవన్నీ పెట్టినా ఆ తర్వాత ఉల్లంఘనలు పెరిగిపోయాయి.
సర్కార్‌కు పీసీబీ జీ హుజూర్
పర్యావరణ చట్టాలు, నీటివనరులను కాపాడే విషయంలో కేంద్ర మార్గదర్శకాలు వంటివి ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడంతో ప్రభుత్వ అధీనంలోని సంస్థగానే మిగిలిపోతోంది. అందువల్ల ఎన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా చూసీచూడనట్టు వదిలేయడంతో ఈ సంస్థ ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటుందనేది స్పష్టమౌతోంది.
కేవలం తాగునీటితోనే ముడిపడలేదు
►ఈ జలాశయాల పరిరక్షణ కేవలం తాగునీటితోనే ముడిపడలేదు. పర్యావరణం, పచ్చ దనం, జీవవైవిధ్యంతోపాటు వాతావరణ మార్పుల నియంత్రణలో వీటి భాగస్వామ్యాన్ని అందరూ గ్రహించాలి. పర్యావరణం అంటే గాలి, నీరు, భూమి.. వాటితో ముడిపడిన పచ్చదనం, జీవవైవిధ్యం మొత్తంగా మనచుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం. అందువల్ల వీటిలో దేనిని కాపాడుకోకపోయినా పర్యావరణం నాశనమైనట్టే. ఏదో కేవలం తాగునీటి వనరుల కోసం ఈ జలాశయాలపై ఆధారపడడం లేదని చెప్పి జీవో 111ను ఎత్తేస్తామనడం ఎంతమాత్రం సరికాదు.
Comments
Please login to add a commentAdd a comment