శత వసంతాలు పూర్తి చేసుకున్న గండిపేట జలాశయం
ఢాం..ఢాం.. గుండ్లు పేలుతున్నాయి.. చుట్టూ ఉన్న గుట్టల మాటున ఆ శబ్దం ప్రతిధ్వనిస్తోంది.హైదరాబాద్‌కు అతిథులుగా ఉన్నత ప్రముఖులు వచ్చినప్పుడు గన్ శాల్యూట్‌గా 21మార్లు తుపాకులను గాల్లోకి పేల్చడం ఆనవాయితీ.. ఇక్కడా ఓ అతిథిని ఆహ్వానిస్తూ డైనమైట్ పేలుళ్లు.. తొలుత 21.. ఆపై మొత్తంగా 101సార్లు. ఓ బృహత్తర పనికి శ్రీకారం చుట్టుకున్న సందర్భమది.గన్ శాల్యూట్ తీసుకున్న అతిథులతో భాగ్యనగరానికి ఒరిగిందేమిటో కానీ.. ఈ ప్రత్యేక శాల్యూట్ తీసుకున్న ‘అతిథి’మాత్రం నగరాన్నే రక్షిస్తోంది. ఆ అతిథి పేరు– ‘గండిపేట జలాశయం’.. ఉరఫ్ ఉస్మాన్‌సాగర్.
సాక్షి, హైదరాబాద్: 1908 సెప్టెంబర్: జల ప్రళయాన్ని తలపించేలా మూసీ ఉప్పొంగింది. బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో రెండ్రోజుల ఏకధాటి వానలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. దాని తీరంలో అభివృద్ధి చెందిన ప్రధాన నగరం ధ్వంసమైంది. 15 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అంతకు పదిరెట్ల మంది నిరాశ్రయులయ్యారు. నగర పునర్నిర్మాణ బాధ్యతను నాటి ప్రఖ్యాత ఇంజినీర్, మైసూర్ స్టేట్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. ఆయన పూర్తిస్థాయి అధ్యయనం చేసి మూసీనది (ఈసీతో కలుపుకొని)పై రెండు జలాశయాలు నిర్మించాలని తేల్చారు. అందులో పెద్దది, ముఖ్యమైంది గండిపేట జలాశయం.
(వినియోగంలో ఉన్న వందేళ్ల నాటి కార్యాలయం)
101 డైనమైట్లు పేల్చి.. గుట్టలు ఛిద్రంచేసి..
మార్చి 23, 1913: ప్రస్తుతం గండిపేట జలాశయం ఉన్నచోట అన్నీ గుట్టలే. మధ్యలో కొన్ని ఊళ్లు. వాటిని ఖాళీచేయించి గుట్ట భాగాలను డైనమైట్లు పెట్టి పేల్చేశారు. నాటి బ్రిటిష్ ఇండియా రెసిడెంట్ ఫినే, ఏడో నిజాం మీర్‌ఉస్మాన్ అలీ సమక్షంలో విశ్వవిఖ్యాత ఇంజినీర్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య స్వీయ పర్యవేక్షణలో 101 డైనమైట్లు పేల్చగా, గుట్టభాగాలు ఛిద్రమై మైదానంలాంటి ప్రాంతం ఏర్పాటైంది. అక్కడే ఓ భారీ మానవ నిర్మిత జలాశయం ఉద్భవించింది. 1913 మార్చిలో ప్రారంభమైన పనులు 1920 శీతాకాలం నాటికి పూర్తయ్యాయి. గండిపేట జలాశయం ప్రారంభ తేదీ, నెలలకు సంబంధించి కచ్చితమైన అధికారిక సమాచారమేదీ లేదని, అప్పటికే జోరుగా పడిన వర్షాలతో 1920 శీతాకాలం నాటికి గండిపేట నిండుకుండలా మారిందని, ఆ సమయంలోనే దాన్ని ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఈ చెరువు సేవలు ప్రారంభమై ఈ చలికాలంతో సరిగ్గా వందేళ్లవుతోంది. అంటే అదిప్పుడు ‘శత వసంతాల గండిపేట’అన్నమాట. 46 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయం నిర్మాణానికి అప్పట్లో రూ.56 లక్షలు ఖర్చయ్యాయి. కాగా, ఇది అందుబాటులోకి వచ్చిన ఏడాదే, అంటే 1920లో పనులు ప్రారంభమై 1927లో హిమాయత్‌సాగర్ జలాశయం సిద్ధమైంది.
(నేటికీ వినియోగంలో ఉన్న రాన్‌సన్స్ అండ్ రేపియర్ లి కంపెనీ రూపొందించిన యంత్రాలు)
రిటైర్మెంట్ కాదు.. టర్నింగ్ పాయింట్
ప్రస్తుతం కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా వస్తూ నగర దాహార్తిని తీరుస్తున్నాయి. దీంతో కొంతకాలంగా ‘గండిపేటకు ఇక రిటైర్మెంటే’అనే మాటలు వినిపిస్తున్నాయి. జంట జలాశయాల పరిరక్షణకు పొందుపరిచిన ఆంక్షలకు రేపోమాపో సడలింపులుంటాయని ముమ్మర ప్రచారం జరుగుతున్న వేళ, సరిగ్గా వందేళ్లలోకి గండిపేట అడుగుపెట్టిన సమయంలో పెద్ద ‘టర్నింగ్ పాయింట్’ఘటనే ఎదురైంది. 1908 నాటి వరదలకు నగరం ధ్వంసమైన నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి జలప్రళయం రాకుండా ఏర్పడ్డ గండిపేట.. తన అవసరాన్ని వందేళ్ల తర్వాత కూడా చాలా గట్టిగా గుర్తుచేసింది. తనను నిర్లక్ష్యం చేస్తే సిటీకి మళ్లీ ప్రళయం ముంచుకొచ్చినట్టేనని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలోని వందల కాలనీలు, బస్తీలు నీటమునిగిన విషయం తెలిసిందే. నెలైనా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. జంట జలాశయాలు లేకుంటే ‘1908 బీభత్సం’కంటే పెద్ద ఉత్పాతాన్నే నగరం కళ్లచూడాల్సి వచ్చేది. ఉస్మాన్‌సాగర్–హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు, వాటి చుట్టూ ఉన్న చిన్న చెరువులు పదిలంగా ఉంటేనే భవిష్యత్తులో మూసీ వరదల నుంచి సిటీ సురక్షితంగా ఉండగలదన్న విషయం స్పష్టమైంది. నగరాన్ని కాపాడేందుకు వందేళ్ల కింద పుట్టిన తాను (గండిపేట).. వందేళ్ల వయసులో తానింకా సిటీకి అవసరమేనన్న విషయాన్ని తేల్చిచెప్పింది. వెరసి తనను కాపాడుకుంటేనే మీరు సురక్షితంగా ఉంటారని నగరవాసిని గట్టిగానే హెచ్చరించింది. గండిపేట జలాశయాన్ని పరిరక్షించుకోవాలని, వర్షపు నీరు అందులోకి చేరకుండా అడ్డుపడే నిర్మాణాలను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.
(యంత్రాలు రూపొందించిన సంస్థ పేరు)
అవి లేకుంటే మనం ఉండం
గండిపేట జలాశయం నిర్మాణ సమయంలో సామగ్రి, కూలీలను రైలులో తరలించేవారు. ఇందుకోసం నగరం నుంచి మూసీ తీరం వెంబడి గండిపేట వరకు న్యారోగేజ్ రైల్వేలైన్ వేశారు. నా చిన్నతనంలో ఆ పట్టాలను చూశాను. తర్వాత తొలగించారు. గండిపేట వందేళ్లయినా ఇంత కూడా చెక్కుచెదరలేదు. ఇంకో వందేళ్లు ఉంటుంది. జంటజలాశయాలు బాగుంటేనే నగరం పదిలమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వాటికి రక్షణగా ఉన్న ఆంక్షలు సడలిస్తే వాటికి ఉరి వేసినట్టే. అప్పుడు వరదల నుంచి నగరాన్ని కాపాడేదెవరు?.
– అనురాధారెడ్డి, ‘ఇంటాక్’– హైదరాబాద్ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment