![Nutritious Snacks For Children In Telangana Anganwadi Schools - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/16/anganwadi.jpg.webp?itok=j9TS6FiZ)
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీల్లోని చిన్నారులకు అత్యంత మెరుగైన పౌష్టిక విలువలున్న చిరుతిళ్లు (స్నాక్స్) అందించేందుకు తెలంగాణ ఫుడ్స్ విభాగంరంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు చిరుతిళ్లు అందిస్తున్నప్పటికీ ఇకపై సరికొత్త సాంకేతికతతో ఈ ఆహారాన్ని తయారు చేసి అందించనుంది. దీనికోసం తెలంగాణ ఫుడ్స్ విభాగం ప్రత్యేకంగా అత్యాధునిక స్నాక్‌ఫుడ్ యూనిట్ (ఎక్స్‌ట్రూడర్ యూనిట్)ను స్థాపించింది.
నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.42.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఈ కేంద్రాన్ని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రారంభించనున్నారు. అమెరికా సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో గంటకు సగటున 4 మెట్రిక్ టన్నుల స్నాక్స్ తయారవుతాయి. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు సగటున 300 మెట్రిక్ టన్నుల చిరుతిళ్లను సరఫరా చేస్తారు. దీన్ని కేవలం నాలుగైదు రోజుల్లోనే తయారు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర డిమాండ్‌ను తీర్చిన తర్వాత పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రకు సైతం చిరుతిళ్లను ఎగుమతి చేసే దిశగా తెలంగాణ ఫుడ్స్ కార్యాచరణ రూపొందిస్తోంది.
ఫోర్టిఫైడ్ రైస్ కూడా...
కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్‌ట్రూడర్ యూనిట్‌లో స్నాక్స్ మాత్రమే కాకుండా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సైతం తయారు చేయొచ్చు. సాధారణ బియ్యానికి మరిన్ని విటమిన్లు, పోషకాలను కలిపి తయారు చేసేవే ఫోరి్టఫైడ్ బియ్యం. పిల్లలకు సమృద్ధిగా పోషకాలు అందించే క్రమంలో వీటితో కూడిన ఆహారాన్ని అందించే అంశాన్ని పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చే బియ్యానికి బదులుగా
ఫోరి్టఫైడ్ బియ్యాన్ని అందిస్తే మరింత పోషక విలువలతో పిల్లలు ఎదుగుతారని భావించిన అధికారులు ఈ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మార్కెట్లో లభించే సాధారణ బియ్యం ధరకు రెట్టింపు ధరలో ఫోరి్టఫైడ్ బియ్యం లభిస్తాయి. దీంతో ఈ ఎక్స్‌ట్రూడర్ యూనిట్ ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment