‘ఆఫ్‌లైన్ క్లబ్’పేరుతో వినూత్న కార్యక్రమం
వారానికి మూడు గంటల పాటు గ్యాడ్జెట్లకు దూరం
నెలలో తప్పనిసరిగా నాలుగు కార్యక్రమాలు
900లకు చేరిన వివిధ రంగాల సభ్యులు
వారానికో అంశంపై చర్చలు, విశ్లేషణలు
నగర ప్రజలు యాంత్రిక జీవనానికి అలవాటుపడ్డారు. దైనందిన జీవితంలో ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. దీంతో మొబైల్ ఫోన్లలో 24 గంటలూ ఇరుక్కుపోయి తమ అభిరుచులకు దూరమవుతున్నారు. ఎంతో విలువైన బంధాలను, అనుబంధాలను దూరం చేసుకుంటూ స్నేహాలను కోల్పోతున్నారు. ఇలాంటి ప్రస్తుత తరుణంలో కొంతమంది యువతీ యువకులు ఇన్‌స్టా వేదికగా ‘ఆఫ్‌లైన్ క్లబ్’ పేరుతో ఇటీవల ఓ గ్రూపును ఏర్పాటుచేసుకున్నారు. ఈ గ్రూపు సభ్యులు రోజులో మూడు గంటల పాటు గ్యాడ్జెట్లకు దూరంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్లబ్‌లో కేవలం యువతీ యువకులే కాకుండా పెద్ద వాళ్లు కూడా చేరి తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
వారంతా యువతీ యువకులు..
వీళ్లు వారంలో ఒకరోజు మూడు గంటల పాటు మొబైల్ ఫోన్లకు స్వస్తి పలుకుతారు.. కొత్త ఆలోచనలను సహచరులతో పంచుకుంటారు.. అభిరుచులను ఒకరి నుంచి ఒకరు పంచుకుంటారు.. ఇష్టమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు.. పుస్తకాలు చదివి అందులో సారాంశాన్ని, లోటుపాట్లను, మంచి చెడులను విశ్లేషిస్తారు.. బుక్ రీడింగ్.. ఆథర్‌మీట్, జ్యువెలరీ మేకింగ్..ఇష్టమైన సినిమా.. ఇలా నెలలో నాలుగు సార్లు లైఫ్ మైండెడ్ పీపుల్స్ (ఒకే రకమైన ఆలోచనలు ఉన్నవారు) ఒక చోట చేరి ముచ్చటించుకుంటారు.. ఆపై ఆడతారు..పాడతారు.
900కు పైగా సభ్యులు..
ఈ క్లబ్‌లో సుమారు 900 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఇందులో వివిధ అభిరుచులకు, ఆలోచనలకు ఆకర్షితులై గ్రూపులుగా ఏర్పడి ప్రతినెలా ఏదో ఒక చోట నాలుగు సార్లు కలుసుకుంటుంటారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో ప్రతివారం ఇన్‌స్టా వేదికగా సమయం, సందర్భం తెలిపేలా పోస్టులు పెట్టుకుని కలుసుకుంటుంటారు. పాత సినిమాలపై విశ్లేషణ చేస్తారు..అలాగే ఎవరైనా కొత్తగా నవలలు రాస్తే.. ఆ నవలను చదివే వారికి ఇచ్చి చదవమని 20 రోజులు సమయం ఇస్తారు. ఆ తర్వాత మరో కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి రచయితతో ముఖాముఖి ఏర్పాటుచేయడమే కాకుండా, ఆ నవలలో తమ అభిప్రాయాలను విశ్లేషిస్తూ నిస్సంకోచంగా వెల్లడిస్తుంటారు.
నెలలో నాలుగు సార్లు..
ఈ గ్రూపులో మెల్లమెల్లగా సభ్యుల సంఖ్య పెరిగింది. ప్రతినెలా నాలుగు సార్లు కెఫేలలో వీరు కలుసుకోవడమే కాకుండా మూడు గంటల పాటు చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, తమలో నైపుణ్యాన్ని వెలికితీస్తారు. తమ అభిప్రాయాలను 10 మందితో పంచుకుంటారు. విశేషమేమిటంటే ఈ మూడు గంటల పాటు మొబైల్ ఫోన్లను పక్కన పట్టేస్తారు. ఆ సమయంలో ఎటువంటి ఫోన్ కాల్స్ కూడా అటెంప్ట్ చేయరు.
24 ప్రోగ్రామ్స్ చేశాం..
బుక్ ఆఫ్ మంత్, సినిమాలు, పుస్తకాల ఆవిష్కరణ, రీడింగ్ కమ్యూనిటీలలో రచయితలతో ముఖాముఖి, జ్యువెలరీ మేకింగ్ ఇలా పలు రంగాలపై ఇప్పటివరకూ 24 ప్రోగ్రామ్స్ నిర్వహించాం. వీటికి ఎంతో ఆదరణ లభించింది. ఒక్కో వారం ఒక్కో ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాం. ఎక్కడ కలుసుకోవాలో ముందుగా తెలియజేస్తాం. త్వరలోనే స్పోర్ట్స్ కూడా ప్రవేశపెట్టాలని అనుకున్నాం. ఆయా రంగాల్లో అభిరుచి ఉన్నవారు మాత్రమే ఆయా కార్యక్రమాలకు హాజరవుతుంటారు. ఇలా తమకు తెలిసిన థీమ్‌ను ఎంచుకుని నటించే అవకాశాన్ని కలి్పస్తున్నాం.
బిశ్వరూప బారిక్, ఆఫ్‌లైన్ క్లబ్ వ్యవస్థాపకురాలు..
గత జులైలో ప్రారంభం..
కరోనా తర్వాత హైదరాబాద్ రీడ్స్ పేరుతో కొంతమంది యువత ఇన్‌స్టా వేదికగా కేబీఆర్ పార్కు, బొటానికల్ గార్డెన్స్‌లో ప్రతి శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ 2 గంటల పాటు ఒకచోట చేరి తమకిష్టమైన పుస్తకాలను చదివే కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా తమకు ఇష్టమైన వ్యాపకాలను పంచుకుంటే బాగుంటుందని ఆఫ్‌లైన్ క్లబ్ వ్యవస్థాపకురాలు బిశ్వరూప బారిక్‌కు పలువురు సూచించారు. దీంతో ఆమె గత జులైలో ఇన్‌స్టా వేదికగా ఆఫ్‌లైన్ క్లబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి చాలామంది ఆకర్షితులయ్యారు. లైక్ మైండెడ్ పీపుల్స్ ఒక చోట చేరి తమ అభిప్రాయాలను, అభిరుచులను పంచుకోవడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment