హైదరాబాద్‌లో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం | Papanna Jayanti celebrations under the auspices of the BC Welfare Department | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం

Published Mon, Aug 19 2024 4:48 AM | Last Updated on Mon, Aug 19 2024 4:48 AM

Papanna Jayanti celebrations under the auspices of the BC Welfare Department

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

పర్యాటక కేంద్రంగా పాపన్న స్వగ్రామం అభివృద్ధి

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాపన్న జయంతి వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌: సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సర్దార్‌ పాపన్నగౌడ్‌ మహారాజ్‌ 374వ జయంతి వేడుకలలో భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాపన్నగౌడ్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. 

సర్దార్‌ పాపన్న ఆనాడే సామాజికంగా వెనుకబడిన వారిని కలుపుకొని రాజ్యాధికారం కోసం అడుగులు ముందుకు వేశారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో సమానత్వం లభించేలా పోరాడారన్నారు.  సర్దార్‌ సర్వాయి పాపన్న స్వగ్రామం సర్వాయిపేటను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకోసం రూ.4.7 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. పాపన్న సేవలకు గుర్తుగా హైదరాబాద్‌ నడిబొడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

అలాగే అయన జీవిత చరిత్రపై బుక్‌లెట్‌ను ప్రచురించనున్నట్లు భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మహిళా కమిషన్‌ చైర్మన్‌ నేరెళ్ల శారద, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కష్ణమోహన్, హస్తకళా కార్పొరేషన్‌ చైర్మన్‌ నాయుడు సత్యనారాయణ గౌడ్, బీసీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, బీసీనేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సర్వాయి పాపన్న జీవితం నేటి తరానికి ఆదర్శం
రాజ్యాధికారం కోసం బడుగులను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను జయించిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం పాపన్న గౌడ్‌ 374వ జయంతి వేడుకలు టీపీసీసీ కల్లుగీత విభాగం ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. మంత్రి పొన్నంతో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, కల్లుగీత విభాగం అధ్యక్షుడు నాగరాజు గౌడ్‌ తదితరులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పాపన్నగౌడ్‌ జీవితం గురించి నేటి తరాలు తెలుసుకోవాలని, ఆయన బాటలో నడవాలని కోరారు. పాపన్న స్వగ్రామానికి నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిధుల విడుదలకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావులకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement