( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు వచ్చే నెల మొదటి వారంలో ముగుస్తాయి. ఆ తర్వాత విద్యార్థులు ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ఎంసెట్ కూడా మే రెండో వారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కాలేజీల కోసం వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఏ కాలేజీలో ఏ కోర్సులున్నాయి? ఎంసెట్ ర్యాంకు ఎంత వస్తే ఏ కాలేజీలో సీటు వస్తుంది? ఏయే కోర్సులకు డిమాండ్ ఉంది? నచ్చిన కోర్సు ఎక్కడ బాగుంటుంది? ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రలు వాకబు చేస్తున్నారు. వీళ్ళంతా ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలపైనే దృష్టి పెడుతున్నారు. వీటితో పాటు డీమ్డ్ యూనివర్శిటీల వివరాలూ సేకరిస్తున్నారు. ఎంసెట్ ర్యాంకుపై ఆశల్లేని వాళ్ళు ముందే సీటు ఖాయం చేసుకోవాలనే ఆతృతలో ఉన్నారు. మేనేజ్‌మెంట్ కోటా సీటు గురించి వాకబు చేస్తున్నారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఆశించే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం గత కొన్నేళ్ళ కౌన్సిలింగ్ వివరాలను బట్టి అంచనాల్లో మునిగి తేలుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిడిక్టర్ కోసం ఇక్కడ చూడండి.
కాలేజీల్లోనూ హడావిడి..
సీట్ల వివరాల కోసం వస్తున్న వారికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎలాంటి సంప్రదింపులూ జరపకపోయినా, వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఎంసెట్ పరీక్ష పూర్తయిన తర్వాత కాలేజీ నుంచి ఫోన్ కాల్ వస్తుందని, మేనేజ్‌మెంట్ సీటు విషయంలో అప్పుడు సంప్రదించవచ్చని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సులను కావాలనుకునే వాళ్ళు ముందే వాకబు చేస్తున్నారని, వీరంతా మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆశిస్తున్నవారేనని నిజాంపేట ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సంజయ్ తన కూతురుకు 20 వేల లోపు ఎంసెట్ ర్యాంకు వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చాడు. అయితే డేటా సైన్స్ ఆశిస్తున్నామని, టాప్ టెన్ కాలేజీల్లో సీటు వచ్చే పరిస్థితి లేదని తెలిపాడు. అందుకే మేనేజ్‌మెంట్ కోటా సీటును ముందే మాట్లాడుకుంటే కొంతైనా తగ్గుతుందని ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఈ పరిస్థితిని గమనించిన కాలేజీలు ఎంసెట్ పూర్తవ్వగానే సంప్రదింపుల పేరుతో బేరసారాలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి.
డీమ్డ్ వర్సిటీల్లో మొదలైన ప్రవేశాల ప్రక్రియ
ప్రైవేటు డీమ్డ్ వర్సిటీలు ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియను మొదలు పెట్టాయి. వేర్వేరుగా సెట్స్ నిర్వహణ తేదీలను ప్రకటించాయి. మంచి ర్యాంకు వస్తే ఫీజు రాయితీ ఇస్తామని విద్యార్థులకు వల వేస్తున్నాయి. భారీ ఫీజులుండే ఈ వర్సిటీల్లో సీట్లు నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ప్రత్యేకంగా పీఆర్‌వోలను, ఏజెంట్లను కూడా నియమించాయి. ఇంటర్ కాలేజీలకు వెళ్ళి తమ ప్రవేశ పరీక్ష, కోర్సుల వివరాలు, వాళ్ళిచ్చే సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి. ముందస్తు ప్రవేశాలు అనుమతించబోమని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, తల్లిదండ్రుల ఆతృతను గుర్తించి, తెరచాటు బేరసారాలు చేసే విషయంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు మార్గాలను అన్వేషిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment