ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది
వెంటనే నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలి
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యే పార్టీ మార్పు అంశంపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని.. ఆ గడువు దాటి వారమైనా ఇంకా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ల (బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్) తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు కనీసం ఇప్పటివరకు నోటీసులు కూడా జారీ చేయలేదన్నారు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘వీరు 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఒక పార్టీ అభ్యరి్థత్వంపై గెలిచి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరిన వీరిని అనర్హులుగా ప్రకటించాలి. స్పీకర్‌ను కలవాలని ప్రయత్నించినా సమయం ఇవ్వడం లేదు. ఈ మెయిల్ ద్వారా పంపిన పిటిషన్‌పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ఆదేశించాలి’అని కోరారు.
ఇదే విధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు.
రెండు తీర్పులను పరిశీలిస్తే..
సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయనను ప్రజలు ఓడించారు. మార్చి 18న పిటిషన్ ఇచ్చినా స్పీకర్ కార్యాలయం ఇంత వరకు ఏం చర్యలు చేపట్టిందో కూడా చెప్పలేదు.
ఈ రోజు విచారణ ఉండగా, ఒక రోజు ముందు కౌంటర్ దాఖలు చేశారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7 ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి’అని విజ్ఞప్తి చేశారు.
వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదుల వాదన కోసం తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, అనధికారిక ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment