‘సచ్చినా సరే.. టీకా మాత్రం వేసుకోను’  | People Are Afraid To Get The Corona Vaccine In Telangana | Sakshi
Sakshi News home page

‘సచ్చినా సరే.. టీకా మాత్రం వేసుకోను’ 

Published Fri, Dec 10 2021 3:51 AM | Last Updated on Fri, Dec 10 2021 11:50 AM

People Are Afraid To Get The Corona Vaccine In Telangana - Sakshi

రాజవ్వను ఒప్పించి టీకా వేస్తున్న వైద్య సిబ్బంది   

మెట్‌పల్లి (కోరుట్ల): కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి మనకున్న ఆయుధం వ్యాక్సిన్‌. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. అయితే కొంతమందిలో కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న భయం మాత్రం ఇంకా పోవడంలేదు. అలాంటి సంఘటనే కోరుట్ల మండలం జగ్గాసాగర్‌లో చోటుచేసుకుంది. ఈ చిత్రంలో టీకా తీసుకుంటున్న మహిళ పేరు బైర రాజవ్వ. కొన్ని రోజులుగా టీకా తీసుకునేందుకు నిరాకరిస్తూ వస్తోంది.

దీంతో గురువారం మరోసారి వ్యాక్సిన్‌ వేయడానికి సిబ్బంది వెళ్లారు. ‘వేసుకోనని చెప్పినా ఎందుకు వస్తున్నారు. నేను చావనన్నా చస్తా. కానీ.. టీకా మాత్రం తీసుకోను’అని మొండికేసింది. టీకాతో తనకేమన్నా జరిగితే పిల్లల సంగతేంటని ప్రశ్నించింది. అందరూ టీకా తీసుకుంటున్నారని, ఎవరికీ నష్టం జరగలేదని సిబ్బంది బదులిచ్చారు. ఊరి వాళ్లతో తనకు సంబంధం లేదని, బలవంతం చేస్తే మీ పేరు రాసి ఉరివేసుకొని చస్తానని బెదిరించింది.

‘నువ్వు ఎన్ని చెప్పినా టీకా తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదలబోం’అని సిబ్బంది తేల్చిచెప్పారు. ఈ క్రమంలో అరగంట పాటు రెండువైపులా వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ లావణ్య భర్త రాజేశ్‌.. రాజవ్వకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినకుండా బోరున విలపించింది. చివరకు అయిష్టంగానే వ్యాక్సిన్‌ వేసుకుంది. గ్రామానికి చెందిన మరో వృద్ధురాలు బైరవ్వ కూడా ఇలాగే మొండికేయగా, సిబ్బంది నచ్చజెప్పి టీకా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement