
భయం భయంగా వాగుదాటుతున్న జనాలు
సాక్షి, కొల్లాపూర్ రూరల్ : ఎడతెరిపి లేని వర్షాలతో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం సమీపంలోని ఉడుములవాగులో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం అవతలివైపు వెళ్లిన దాదాపు 25 మంది రైతులు సాయంత్రం తిరిగి వచ్చేందుకు వీలు లేకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. చివరికి కొంతమంది తాళ్లు వదలడంతో వాటి సాయంతో మహిళలు, వృద్ధులు భయం భయంగా వాగు దాటారు. ఆరేళ్ల క్రితం ఈ వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభించినా పూర్తి చేయకపోవడంతో వరద వచ్చినప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు.
– కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా)
నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది.
– రెంజల్(బోధన్)
Comments
Please login to add a commentAdd a comment