
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధర వాహనదారుల చేతి చమురు వదిలిస్తోంది. అదే వరుసలో గ్యాస్ సిలిండర్ వంటింట్లో మంట మండిస్తోంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అంతకంతకూ ఎగబాగుతూనే ఉన్నాయి. వరుసగా తొమ్మిది రోజులుగా చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. పక్షం రోజుల వ్యవధిలో వంట గ్యాస్ సైతం ధర రెండుసార్లు పెరిగింది. చమురు సంస్థలు రోజు వారీ ధరల సవరణలో భాగంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సగటున 26 నుంచి 36 పైసలు పెంచుతూపోతున్నాయి. నగరంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డును అధిగమించింది.
తాజాగా.. లీటర్ పెట్రోల్ రూ.93.10 పైసలకు చేరింది. డీజిల్ రూ. 87.20కి చేరింది. ఈ నెల లో లీటర్ పెట్రోల్‌పై రూ.3.33 పైసలు, లీటర్ డీజి ల్‌పై 3.74 పైసలు పెరిగింది. గత నెలలో సైతం లీటర్ పెట్రో ల్, డీజిల్‌పై సగటున రూ.3పైనే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పైపైకి ఎగ బాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
వామ్మో.. గ్యాస్ బండ..
వంట గ్యాస్ ధర మోత మోగుతోంది. పక్షం రోజుల వ్యవధిలో సిలిండర్‌పై రూ.75 పెరిగింది. చమురు సంస్థలు మూడు రోజుల క్రితం గృహపయోగ వంట గ్యాస్ సిలిండరపై రూ.50 పెంచడంతో హైదరాబాద్‌లో సిలిండర్ రూ. 821.50కు చేరినట్లయింది. గత పక్షం రోజుల క్రితం కూడా సిలిండర్‌పై రూ.25 మేర పెరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో పక్షం రోజుల వ్యవధిలో వంద రూపాయలు పెరిగిన రీఫిల్ ధర నెల రోజుల పాటు నిలకడగా ఉంటూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలకు అనుగుణంగా మళ్లీ ధర ఎగబాగుతోంది.
రూ.34.19 కోట్ల భారం
వంట గ్యాస్‌ధరల పెంపునకు అనుగుణంగా సబ్సిడీ నగదు పెంపు లేకపోవడంతో గ్రేటర్‌వాసులపై నెలవారీగా పడుతున్న భారం అక్షరాలా రూ.34.19 కోట్లు. మూడు మాసాలుగా చమురు సంస్ధలు వంట గ్యాస్ రీఫిల్ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు కేవలం రూ.40.71 పైసలకు పరిమితం చేశాయి. దీంతో ఎల్పీజీ ధర పెరిగిన ప్రతిసారీ పేద, మధ్యతరగతి వినియోగదారులపై పిడుగు పడినట్లవుతోంది. ఈ నెలలో రెండుసార్లు ధర పెరగడంతో హైదరాబాద్‌లో గృహోపయోగ గ్యాస్ రూ.821.50కు చేరినట్లయింది.
చదవండి: తల్లిదండ్రులపై కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల తీవ్ర ఒత్తిడి
Comments
Please login to add a commentAdd a comment