సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో జరిగిన అక్రమాలపై కేంద్రం విచారణకు ఆదేశించింది. నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడమేగాకుండా.. రూ.కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడాన్ని తీవ్రంగా పరిగణించింది. సెర్ప్‌లో పశు గణన–జీవనోపాధి (లైవ్ స్టాక్–లైవ్లీ హుడ్స్) పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేసిన ఫిర్యాదును పరిశీలించిన కేంద్రం.. దీనిపై విచారణ జరిపి ఆగస్టు6లోగా నివేదిక పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివద్ధిశాఖ జాయింట్ సెక్రెటరీ లీనా జోహ్రీ సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు లేఖ రాశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం (నేషనల్ రూరల్ లైవ్‌లీ హుడ్ మిషన్) పథకం కింద 2018 నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కాగా, ఇదే అంశంపై సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కూడా ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఆరోపణలు ఇవే..!.
మహిళా సంఘాల సభ్యుల దగ్గర ఉన్న గొర్రెలు, మేకల పశు ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పత్తి చేసిన పశు ఉత్పత్తుల విలువ పెంపుదల కోసం ఈ ఏడాది మార్చినాటికి 2,875 లైవ్ స్టాక్ ఫార్మర్ ప్రొడ్యూ సింగ్ గ్రూపులను ఏర్పాటు చేశారు. గ్రూపులలో లేని 75% మంది మహిళలకు జీవాలు లేకున్నా ఉన్నట్లు నమోదు చేసి.. భారీగా నకిలీ గ్రూప్‌లను సృష్టించారు. ఆ తర్వాత కమీషన్లకు ఆశపడి.. పశుఉత్పత్తి సామర్థ్యం, చేసిన పశు ఉత్పత్తుల విలువ పెంపుదల కోసం ఉపయోగపడని పరికరాలను కొనుగోలు చేశారు. ఏటా రూ.1.50 కోట్ల పరికరాల కొనుగోళ్లు జరుగుతున్నా.. గత రెండేళ్లలో ఎలాంటి ఇ–టెండర్లను పిలవకుండా బహిరంగ మార్కెట్ల లోని ధరల కంటే 2–3 రెట్లు ఎక్కువకు కొనుగోలు ధరలను నిర్ణయించి లైవ్ స్టాక్ లైవ్లీ హుడ్స్ యూనిట్లలో అవినీతికి పాల్పడ్డట్లు తెలిసింది. డిజిటల్ వేయింగ్ మిషన్, డ్రెంచింగ్ గన్, డిటిక్కింగ్ మిషన్ – వాక్సిన్ కారియర్ కొనుగోళ్లలో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. పశుమిత్రల శిక్షణ కోసం చేసిన ముద్రణ పనుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.
పశుమిత్రలకు ఆన్‌లైన్ క్లాస్‌లు..!
ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద పశు మిత్ర శిక్షణ ఇస్తారు. దీన్ని పశుసంవర్థకశాఖ లేదా వెటర్నరీ వర్సిటీ ద్వారా ఇప్పించకుండా..సెర్పే ఇచ్చింది. దీంతో ఈ శిక్షణకు సెక్షన్ 30(b) ఇండియన్ వెటర్నరీ కౌన్సిల్ యాక్ట్ 1984 ప్రకారం అవసరమైన గుర్తింపు నేటి వరకు రాలేదు. సెర్ప్ వద్ద నమోదైన పశుమిత్రల పని వివరాలు కూడా తప్పుల తడకేనని తెలుస్తోంది. శిక్షణ పొందిన 2,300 పశుమిత్రలలో కనీసం 200 మంది కూడా గ్రామాలలో పని చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,850 మంది పశుమిత్రలకు శిక్షణ ఇవ్వడానికి ఓ ఏజెన్సీకి చెల్లించేందుకు రూ.10.57కోట్లను ఖరారు చేశారు. పశువైద్య శాస్త్ర ప్రకారం ‘ప్రాక్టికల్ ఓరియెంటెడ్’గా శిక్షణ ఇవ్వాల్సిఉంటుంది. కోవిడ్–19 ఆంక్షలున్నా కమిషన్ల కక్కుర్తికి ఆశపడి ‘ఆన్ లైన్’పద్ధతిలో శిక్షణ ఇవ్వడం విడ్డూరం.
Comments
Please login to add a commentAdd a comment