ఊరిని వదలం..ఎక్కడికీ వెళ్లబోమని టైగర్ జోన్‌లోని పొగిళ్ల గ్రామస్తుల స్పష్టీకరణ
నాడు సాగర్ ముంపు పేరుతో ఇక్కడికి పంపించారు
ఇప్పుడు పులుల సంరక్షణ పేరుతో మరో చోటికిపొమ్మంటారా అంటూ ఆవేదన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలం పొగిళ్ల గ్రామానికి చెందిన ప్రజలందరిదీ ఒకటే ఆవేదన. ఇప్పుడు పులుల సంరక్షణ పేరుతో తమను పంపించాలని చూస్తున్నారని వాపోతున్నారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, గ్రామాన్ని వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..దేవరకొండకు 60 కిలోమీటర్ల దూరంలో అడవి లోపల ఉండే పొగిళ్ల గ్రామాన్ని జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) స్వచ్ఛంద గ్రామ తరలింపు కార్యక్రమం (వీవీఆర్‌పీ) కింద మైదాన ప్రాంతానికి తలించేందుకు కసరత్తు ప్రారంభించింది. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వాటి సంరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మెరుగైన జీవన స్థితిగతులను కల్పిం చేందుకు చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇటీవల గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. దేవరకొండ సమీపంలోని ముదిగొండ వద్ద పునరావాసం కల్పిస్తామని, యూనిట్‌కు (భార్యాభర్తలు ఒక యూనిట్, 18 ఏళ్లు దాటి, వివాహం కాని వారు ఒక యూనిట్‌గా) రూ.15 లక్షలు.. లేదంటే వారికున్న మేరకు భూమి ఇస్తామని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రోడ్లు, ఇతర అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్నారు.
500 కుటుంబాలు.. 2 వేల జనాభా
పొగిళ్ల గ్రామంలో ప్రస్తుతం దాదాపు 2 వేల జనాభా ఉండగా 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడి రైతులు నాగార్జునసాగర్ వెనుక జలాల నుంచి దాదాపు 5 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసుకొని దాదాపు 2 వేల ఎకరాల్లో పంటలను సాగు చేసుకుంటున్నారు.
ఇక్కడ మిర్చి, పత్తి అధికంగా సాగవుతుండటంతో పక్క గ్రామాల నుంచి కూడా కూలీలు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాన్ని ఖాళీ చేయమంటుండడంతో అందరి పరిస్థితీ అయోమయంగా మారింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు మా గ్రామం (సూర్యాపేట) ముంపునకు గురవుతుందని అక్కడి నుంచి పంపించారు. ఇక్కడికొచ్చి 60 ఏళ్లు అవుతోంది. అప్పుడు చెట్లు, రాళ్లు రప్పలే ఉన్న ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నాం. గొడ్డుచాకిరీ చేస్తే ఊరికి ఇప్పుడో రూపం వచ్చింది. భూమిని బాగు చేసుకొని, వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాం. ఇప్పుడు మళ్లీ పొమ్మంటున్నారు. ఎక్కడికెళ్లాలి - 75 ఏళ్ల ముత్తమ్మ, పొగిళ్ల గ్రామం
అప్పట్లో ఇక్కడ మొత్తం అడవే. అందులోనే తిరిగాం. అందులోనే ఉన్నాం. మాపై ఏజంతువూ దాడి చేయలేదు. ఐదు ఎకరాల భూమిని బాగు చేసుకొని బతుకుతున్నాం. సాగర్ వెనుక జలాలకు మోటార్లు పెట్టి, కిలో మీటర్ల పొడవునా పైపులైన్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నాం. ఒక్కొక్కరికి రూ.15 లక్షల వరకు ఖర్చయింది. ఇప్పుడు పులుల పేరుతో పొమ్మంటున్నారు. ఇక్కడి నుంచి మేం వెళ్లిపోతే అవన్నీ ఇస్తారా? - మేకల పిచ్చయ్య, పొగిళ్ల గ్రామం
వారు వెళతామంటేనే పంపిస్తాం
కేంద్ర ప్రభుత్వం టైగర్ రిజర్వులోఉన్న ప్రజలకు మెరుగైన జీవనం కల్పిం చేందుకు, వన్యమృగాలను సంరక్షించేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. బలవంతంగా ఎవరినీ పంపించదు. వారు వెళతామంటేనే పంపిస్తారు. ఈ పథకం గురించి వారికి తెలియజేయాలనే సమావేశం పెట్టాం. ఇక్కడి ప్రజలు ఒప్పుకుంటేనే ప్రభుత్వానికి తెలియజేస్తాం. – పి.రాజశేఖర్, నల్లగొండ జిల్లా అటవీశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment