
ముత్తారం(మంథని): ఒకప్పుడు ఆయన పదెకరాల భూమి ఉన్న మోతుబరి రైతు. పది మందికి అన్నం పెట్టాడు. ఐదుగురు సంతానాన్ని ఒంటి చేత్తో పోషించి ఓ ఇంటి వారిని చేశాడు. ఉన్న ఆస్తిని కొడుకులకు పంచి ఇచ్చాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో అందరికీ కాని వాడయ్యాడు. దీంతో న్యాయం చేయండంటూ ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెందిన అల్లాడి ముకుందరావు(85)కు ఐదుగురు సంతానం. ఐదెకరాల వ్యవసాయ భూమి విక్రయించి ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు. ఈ ఇద్దరిలో ఓ కూతురు ఇదివరకే అనారోగ్యంతో చనిపోయింది.
ఇక పెద్ద కుమారుడు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌గా, రెండో కుమారుడు గోదావరిఖనిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, మూడో కుమారుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేయగా మిగిలిన ఐదెకరాల భూమిని కొడుకులకు పంచి ఇచ్చాడు. కాగా కొద్ది రోజుల క్రితం ముకుందరావు భార్య మృతిచెందగా.. పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నాడు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో పెద్ద కుమారుడు తన కుటుంబాన్ని పోషించుకోవడమే భారంగా ఉందని.. మిగతా వారి వద్దకు వెళ్లాలని తండ్రిని వదిలేశాడు. అయితే ఆయనను మిగతా వారూ పట్టించుకోలేదు. నాలుగు రోజులుగా ఆకలితో అలమటించి గురువారం ముకుందరావు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కాడు.
మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు..
అందరూ ఉన్నా.. అన్నం పెట్టే వారు కరువయ్యారని ముకుందరావు పోలీసులను ఆశ్రయించడంతో వృద్ధుడి ఆకలిని గ్రహించి కానిస్టేబుల్ రాజేందర్, హోంగార్డు వెంకటేశ్వర్లు భోజనం తెప్పించి దగ్గరుండి అతనికి తినిపించారు. అన్నం పెట్టిన పోలీసులకు ఆ వృద్ధుడు రెండు చేతులు జోడించి దండం పెట్టడం అక్కడున్నవారిని కదిలించింది. ఆయన కొడుకులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment