రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి తావివ్వొద్దని, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పనిచేయాలని చెప్పారు.
ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
త్వరలోనే బకాయిల విడుదల
ఇటీవల బదిలీలు జరిగిన విషయం గుర్తుచేస్తూ.. సబ్ రిజిస్ట్రార్ల నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారులందరూ వీలైనంత త్వరగా కొత్త స్థానాల్లో సర్దుబాటు కావాలని పొంగులేటి చెప్పారు. బాగా పని చేసిన వారికి పదోన్నతులు కల్పిస్తామని, బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు.
వచ్చే ఐదేళ్లలోగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని, దశల వారీగా నిర్మాణాలు చేపట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న భవనాలకు అద్దెలు, విద్యుత్, వాటర్ చార్జీలు, వాహనాల అద్దె లాంటి బకాయిలను త్వరలోనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల విషయంలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. భూముల విలువల సవరణ ప్రక్రియ విషయంలో థర్డ్ పార్టీ నివేదిక వచ్చిన తర్వాత త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
కాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి శాఖ పనితీరు గురించి మంత్రికి వివరించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక నివేదికను మంత్రి పొంగులేటి విడుదల చేశారు. సమావేశంలో అదనపు ఐజీలు, డీఐజీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment