సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణాలతో ఇప్పట్లో తాను రాష్ట్రానికి రాలేనని కీలక నిందితుడు ప్రభాకర్ రావు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది.
అయితే, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణను హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం యూ టర్న్ తీసుకున్నారు. మరో వైపు.. ప్రభాకర్ రావుకు సీబీఐ బ్లూ కార్నర్ నోటీసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక, ఈ వ్యవహారంపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలంటే ఆయన పరారీలో ఉన్నట్టు చూపాలి. కానీ, కేసు విచారణకు ముందే ప్రభాకర్ రావు చికిత్స కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో, ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించే అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో కేసు విషయమై ప్రభాకర్ రావును రప్పించేందుకు ప్రత్యామ్నాయం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్ధు కోరుతూ రీజనల్ పాస్‌పోర్ట్ అధికారికి కూడా పోలీసులు లేఖ రాశారు. అయితే, ప్రభాకర్ రావు పరారీలో లేనని సమాచారం ఇస్తుండటంతో విదేశీ వ్యవహారాల శాఖ పాస్‌పోర్టు రద్ధు అంగీకారం అనుమానంగానే మారింది. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు శ్రావణ్ రావు సైతం విదేశాల్లోనే మకాం వేశారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ డోలాయమానంలో పడిపోయింది. విదేశాల నుంచి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇండియాకు వస్తే తప్ప కేసు విచారణ ముందుకు సాగే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment