సాక్షి, హైదరాబాద్: సాక్షి టీవీ అవుట్ పుట్ ఎడిటర్ దంపతులు, పోలీసుల చొరవతో ఏడాది వయస్సున్న బాలుడు తల్లి ఒడికి చేరాడు. గంట వ్యవధిలోనే సదరు బాలుడు తమ వద్దకు చేరడంతో పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ రెడ్డి దంపతులకు, పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఈ ఘటన రామంతపూర్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన మర్యం బేగం, మజీద్ దంపతులు. వీరికి ఐదుగురు సంతానం. ఏడాది వయస్సున్న బాలుడు, ఆరు నెలల పాప, భర్త, తమ్ముడితో కలిసి మర్యం రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌కు ఆటోలో వచ్చింది. కేసీఆర్ నగర్ సమీపంలో టీ కోసమని ఆటోను ఆపి.. భర్త, తమ్ముడు వెళ్లాడు. చంటిపాపకు పాలుపట్టిస్తూ ఉండగా.. ఏడాది వయస్సున్న బాలుడు ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు. టీ తాగి ఆటో దగ్గరకు వచ్చిన మర్యం పిల్లవాడి గురించి ఆరా తీయగా.. ఆటో దిగి ఉంటాడని చెప్పింది. చుట్టుపక్కల వెతకడంతో బాలుడి ఆచూకీ లభించలేదు.
దీంతో.. మర్యం ఆమె బంధువులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే.. రెండు బృందాలను ఏర్పాటు చేసిన ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. సరిగ్గా.. ఇదే టైంలో.. విధులు ముగించుకుని.. తమ కూతురిని ఇంటికి తీసుకెళ్లటానికి స్కూల్ దగ్గరకు వెళ్లిన సాక్షి టీవీ అవుట్ పుట్ ఎడిటర్ ప్రవీణ్ రెడ్డి దంపతులకు స్కూల్ దగ్గర ఏడాది వయస్సున్న బాలుడు కన్పించాడు. దీంతో, బాలుడి వివరాలు గురించి వాకబ్ చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు.
ఈ క్రమంలో ప్రవీణ్‌రెడ్డి.. బాలుడి ఫోటోను తీసి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డికి వాట్సాప్ చేశారు. బాలుడి బంధువులు ఎవరైనా వస్తారని.. తనకు తెలిసిన వారి ఇంటి దగ్గర ఉంచారు. అప్పటికే మర్యం కుటుంబ సభ్యులు బాలుడు కన్పించటం లేదని ఫిర్యాదు చేయటంతో వాళ్లకు ప్రవీణ్ రెడ్డి పంపిన ఫోటోను చూపించారు. వెంటనే ఆ బాలుడు తమ కుమారుడని గుర్తుపట్టారు. వెంటనే సీఐ.. మర్యం కుటుంబ సభ్యులను బాలుడు ఉన్న చోటుకు తీసుకువచ్చారు. ప్రవీణ్ రెడ్డి దంపతులు, స్థానికుల సమక్షంలో బాలుడిని మర్యం కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. బాలుడు తప్పిపోయిన గంట వ్యవధిలోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చటంలో సాయం చేసిన ప్రవీణ్ రెడ్డి దంపతులకు పోలీసులు, మర్యం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment