బాదేపల్లి ఆస్పత్రిలో బిడ్డతో యాదమ్మ
జడ్చర్ల టౌన్: సాధారణంగా ఇంటి దగ్గరో.. ఆస్పత్రిలోనో ప్రసవించాల్సిన ఓ నిండు గర్భిణి.. ఇటు కుటుంబసభ్యులు పట్టించుకోక.. అటు ఆస్పత్రికి వెళ్లేందుకు భయపడి చివరికి నడిరోడ్డుపైనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన యాదమ్మ నిండు గర్భిణి కావడంతో పదిరోజుల క్రితం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.
అయితే విధుల్లో ఉన్న ఓ స్టాఫ్‌నర్సు వద్ద డబ్బులు దొంగిలించిందంటూ ఆమెను మందలించి పంపించారు. దీంతో పురిటి నొప్పులు వస్తున్నా ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు భయపడి పరిసరాల్లోనే తిరగాడింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గాంధీ విగ్రహం వెనకాల ఉన్న షట్టర్ల వద్ద నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను అడ్డుగా చేసుకుని మూడేళ్ల కొడుకుతో కలిసి నిద్రించింది.
నొప్పులు రావడంతో అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఖాజామోయిన్ అనే వ్యక్తి తన మోటార్‌సైకిల్ తీసుకెళ్లేందుకు రాగా.. ప్రసవించిన మహిళ కనిపించింది. వెంటనే ఆయన 108కు సమాచారం ఇచ్చినా.. వాహనం రాలేదు. దీంతో ఆయన ఆటోలో తల్లీబిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సు ఈమె దొంగ అని.. ఎందుకు తెచ్చారని నిలదీసిందని ఖాజామోయిన్ చెప్పారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో లోపలికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు.
నాలుగో ప్రసవం..
రోడ్డుపైనే ప్రసవించిన యాదమ్మ స్వగ్రామం మిడ్జిల్ మండలం చిల్వేరు. మొదటి భర్త వెంకటయ్యకు ఇద్దరు సంతానం కాగా పిల్లలతో కలిసి అతను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అతడిని వదిలేసిన బాధితురాలు తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన జంగయ్యతో ఉంటోంది. ప్రస్తుతం జంగయ్య కూడా పట్టించుకోకపోవడంతో మూడేళ్ల కుమారుడితో కలిసి జడ్చర్లలో పేపర్లు ఏరుతూ జీవనం సాగిస్తోంది.
ఉన్నతాధికారుల ఆరా..
మహిళ రోడ్డుపైనే ప్రసవించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఆస్పత్రికి రాకుండానే బయటే ప్రసవించిందని, తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని సూపరింటెండెంట్ సోమశేఖర్ ఉన్నతాధికారు లకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 15న ఆస్పత్రికి వచ్చిన సదరు మహిళ తమ సిబ్బంది డబ్బులు దొంగిలించిందని, ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. యాదమ్మను ఆస్పత్రికి రావద్దని చెప్పలేదని, డబ్బులు దొంగతనం చేసినందుకు భయపడి ఆస్పత్రికి రాకపోయి ఉండొచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment