Prepaid Electricity Meter In Telangana: ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు... - Sakshi
Sakshi News home page

ఇక ప్రీపెయిడ్‌ కరెంట్‌! ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు...

Published Fri, Aug 27 2021 1:44 AM | Last Updated on Fri, Aug 27 2021 9:58 AM

Prepaid Electricity Meter Fixed Soon In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు త్వరలోనే మొదలుకానుంది. సెల్‌ఫోన్‌ రీచార్జుల తరహాలో విద్యుత్‌ కోసం ముందే డబ్బులు చెల్లించి రీచార్జి చేసుకునే విధానం అమల్లోకి రానుంది. తొలుత ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌), సిరిసిల్ల కో–ఆపరేటివ్‌ ఎలక్ట్రిక్‌ సప్లై సొసైటీ (సెస్‌) పరిధిలో దీనిని ప్రారంభించనున్నారు. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు.. కొత్తగా ఇచ్చే అన్ని విద్యుత్‌ కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.  చదవండి: సెప్టెంబర్‌ 1నే ‘గెజిట్‌’పై చర్చ

ఈఆర్సీలతో కేంద్ర మంత్రి భేటీ.. 
దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న డిస్కంలను ఆర్థికంగా పునర్వ్యవస్థీకరించేందుకు కేంద్రం ఇటీవల కొత్త పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సాంకేతిక, వాణిజ్యపర విద్యుత్‌ నష్టాలు (ఏటీఅండ్‌సీ)’ 15 శాతం కన్నా ఎక్కువ ఉన్న విద్యుత్‌ డివిజన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు అందరికీ 2023 డిసెంబర్‌ నాటికి ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించాలని కేంద్రం నిర్దేశించింది. గడువులోగా స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే.. వాటి వ్యయంలో 15 శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొంది. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ఈఆర్సీలతో కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌కే సింగ్‌ గురువారం సమావేశం నిర్వహించారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని డిస్కంలను ఆదేశిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఈఆర్సీలకు సూచించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేదని తెలిపారు. గడువులోగా మీటర్ల ఏర్పాటు పూర్తికాకుంటే ప్రోత్సాహకాన్ని చెల్లించబోమని స్పష్టం చేశారు. కాగా సమావేశం అనంతరం తెలంగాణ ఈఆర్సీ చైర్మన్‌ టి.శ్రీరంగారావు మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా 35–40 శాతం విద్యుత్‌ నష్టాలు కలిగిన టీఎస్‌ఎన్పీడీసీఎల్, సెస్‌ సంస్థల పరిధిలో ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటుకు ఆదేశిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.   చదవండి: 22వ శతాబ్దంలో నివేదిక ఇస్తారా? 

తర్వాత దక్షిణ డిస్కం పరిధిలోనూ.. 
డిస్కంలు నష్టాలను తగ్గించుకోడంలో భాగంగా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లకు ఆటోమేటిక్‌ మీటర్‌ రీడింగ్‌ (ఏఎంఆర్‌) మీటర్లు బిగించాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించింది. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 2023 డిసెంబర్‌ నాటికి వీటన్నింటి ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. ఇక 15 శాతంకన్నా తక్కువ విద్యుత్‌ నష్టాలున్న దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పరిధిలో 2025 మార్చి నాటికి స్మార్ట్‌ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు ఏఎంఆర్‌ మీటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్‌కు రూ.900కు మించకుండా, అలాగే డీటీఆర్, ఫీడర్ల మీటర్లకు సంబంధించి 15 శాతం వరకు కేంద్రం ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా మీటర్ల ఏర్పాటు కోసం కేంద్రం రూ.97,631 కోట్లను కేటాయించింది. 

ముందుగా రీచార్జి చేసుకుంటేనే.. 
ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించాక.. వినియోగదారులు సెల్‌ఫోన్‌ రీచార్జిల తరహాలో ప్రతినెలా ముందుగానే డబ్బులు చెల్లించి విద్యుత్‌ రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కరెంటు సరఫరా అవుతుంది. రీచార్జి మొత్తం అయిపోయినా.. కొంత అదనపు గడువు/విద్యుత్‌ ఇస్తారు. తర్వాత ఆటోమేటిగ్గా సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జి చేసుకున్నాకే సరఫరా మొదలవుతుంది. అయితే ఈ విధానంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement