Prepaid smart meters
-
ఇక ప్రీపెయిడ్ కరెంట్! ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు త్వరలోనే మొదలుకానుంది. సెల్‌ఫోన్ రీచార్జుల తరహాలో విద్యుత్ కోసం ముందే డబ్బులు చెల్లించి రీచార్జి చేసుకునే విధానం అమల్లోకి రానుంది. తొలుత ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్), సిరిసిల్ల కో–ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ (సెస్) పరిధిలో దీనిని ప్రారంభించనున్నారు. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు.. కొత్తగా ఇచ్చే అన్ని విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. చదవండి: సెప్టెంబర్ 1నే ‘గెజిట్’పై చర్చ ఈఆర్సీలతో కేంద్ర మంత్రి భేటీ.. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న డిస్కంలను ఆర్థికంగా పునర్వ్యవస్థీకరించేందుకు కేంద్రం ఇటీవల కొత్త పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సాంకేతిక, వాణిజ్యపర విద్యుత్ నష్టాలు (ఏటీఅండ్‌సీ)’ 15 శాతం కన్నా ఎక్కువ ఉన్న విద్యుత్ డివిజన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు అందరికీ 2023 డిసెంబర్ నాటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం నిర్దేశించింది. గడువులోగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే.. వాటి వ్యయంలో 15 శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొంది. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ఈఆర్సీలతో కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ గురువారం సమావేశం నిర్వహించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని డిస్కంలను ఆదేశిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఈఆర్సీలకు సూచించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేదని తెలిపారు. గడువులోగా మీటర్ల ఏర్పాటు పూర్తికాకుంటే ప్రోత్సాహకాన్ని చెల్లించబోమని స్పష్టం చేశారు. కాగా సమావేశం అనంతరం తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా 35–40 శాతం విద్యుత్ నష్టాలు కలిగిన టీఎస్ఎన్పీడీసీఎల్, సెస్ సంస్థల పరిధిలో ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. చదవండి: 22వ శతాబ్దంలో నివేదిక ఇస్తారా? తర్వాత దక్షిణ డిస్కం పరిధిలోనూ.. డిస్కంలు నష్టాలను తగ్గించుకోడంలో భాగంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) మీటర్లు బిగించాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించింది. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 2023 డిసెంబర్ నాటికి వీటన్నింటి ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. ఇక 15 శాతంకన్నా తక్కువ విద్యుత్ నష్టాలున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో 2025 మార్చి నాటికి స్మార్ట్ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఏఎంఆర్ మీటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్‌కు రూ.900కు మించకుండా, అలాగే డీటీఆర్, ఫీడర్ల మీటర్లకు సంబంధించి 15 శాతం వరకు కేంద్రం ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా మీటర్ల ఏర్పాటు కోసం కేంద్రం రూ.97,631 కోట్లను కేటాయించింది. ముందుగా రీచార్జి చేసుకుంటేనే.. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాక.. వినియోగదారులు సెల్‌ఫోన్ రీచార్జిల తరహాలో ప్రతినెలా ముందుగానే డబ్బులు చెల్లించి విద్యుత్ రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కరెంటు సరఫరా అవుతుంది. రీచార్జి మొత్తం అయిపోయినా.. కొంత అదనపు గడువు/విద్యుత్ ఇస్తారు. తర్వాత ఆటోమేటిగ్గా సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జి చేసుకున్నాకే సరఫరా మొదలవుతుంది. అయితే ఈ విధానంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
వాడుకున్నంత!
సాక్షి, మెదక్: ఇక నుంచి విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్‌ఫోన్ రీచార్జి తరహాలోనే విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. జిల్లాలో త్వరలో ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించేందుకు ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో విద్యుత్ బకాయిలకు చెల్లుచీటి పడనుంది. అలాగే వినియోగదారులు వినియోగించే తీరులో మార్పుతో పాటు దుబారా తగ్గనుంది. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఈ మీటర్లను బిగించనున్నారు. ఇందుకు సంబంధించి ట్రాన్స్‌కో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని, చెల్లించిన వెంటనే ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించనున్నారని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. మార్చి నాటికి ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో స్టోర్స్‌కు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు చేరుకున్నాయి. దుబారా తగ్గుదలకు.. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాకు మొదట విడతగా 400 నుంచి 500 వరకు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఇది వరకే ఈ మీటర్ల బిగింపు ప్రక్రియ విజయవంతమైనట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాల్లో సైతం ఈ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయించింది. నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు గృహ విద్యుత్ వినియోగదారులు ఎడాపెడా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ దుబారా పెరుగుతుంది. దీనికితోడు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన డబ్బులను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు చెల్లించడం లేదు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్కోపై విద్యుత్ బకాయిలు భారం పెరుగుతోంది. విద్యుత్ దుబారా, బకాయిలకు చెక్ పెట్టేందుకు వీలుగా ట్రాన్స్‌కో ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు సిద్ధం అవుతుంది. రీచార్జి చేసుకుంటేనే.. ప్రస్తుతం అన్ని సర్వీసుల్లో మెకానికల్ విద్యుత్ మీటర్లు ఉన్నాయి. మెకానికల్ విద్యుత్ మీటర్ల రీడింగ్ ఆధారంగా బిల్లులు వసూలు చేస్తోంది. ప్రతినెలా ప్రభుత్వ కార్యాలయాలు, గృహ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు ఇచ్చినా వారు చెల్లించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రీపెయిడ్ మీటర్ల బిగించాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్‌ఫోన్ రీచార్జి తరహాలోనే ఇకపై విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రూ.500 నుంచి రూ.5వేల విలువతో ప్రీపెయిడ్ విద్యుత్ కార్డులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో మొదట మీ సేవ కేంద్రాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ రీచార్జి కార్డులను అందుబాటులో ఉంచనున్నారు. రూ.కోట్లలో పేరుకు పోయిన బకాయిలు జిల్లాలో విద్యుత్ బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలులతో పాటు గృహ వినియోగదారులు, పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో మొండి బకాయిలున్నాయి. గృహా విద్యుత్ బకాయిలు రూ.19 కోట్లు, పరిశ్రమలు రూ.2 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.1.13 కోట్లు, పంచాయతీ బకాయిలు రూ.122 కోట్లు చెల్లించాల్సి ఉంది. దశల వారీగా.. జిల్లాలో దశలవారిగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించనున్నారు. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించనున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు 931 కార్యాలయాలకు ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు ఇచ్చారు. మెదక్ డివిజన్ పరిధిలో 627 ప్రభుత్వ కార్యాలయాలు, తూప్రాన్ డివిజన్ పరిధిలో 304 ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు అందజేశారు. ప్రీపెయిడ్ విద్యుత్‌మీటర్ల అమర్చేందుకు వీలుగా బకాయిలు రూ.1.13 కోట్లు ట్రాన్స్‌కో వసూలు చేయనుంది. డబ్బులు వసూలు అయిన వెంటనే ఈ మీటర్లను అమర్చనున్నారు. త్వరలోనే బిగిస్తాం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో మొదటగా ఈ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చుతాం. సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో స్టోర్స్‌కు ఈ మీటర్లు ఇప్పడికే వచ్చాయి. త్వరలోనే జిల్లాకు మీటర్లు తీసుకువచ్చి బిగింపు ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రీ పెయిడ్ మీటర్లతో విద్యుత్ దుబారా తగ్గడంతోపాటు బకాయిల భారం తొలుగుతుంది. –శ్రీనాథ్, ట్రాన్స్‌కో ఎస్ఈ -
బిల్లు కట్టాకే కరెంటు!
♦ ప్రీపెయిడ్ ‘స్మార్ట్’ మీటర్లు అమర్చేందుకు సిద్ధమైన డిస్కంలు ♦ మీటర్లలో సిమ్‌కార్డు.. నేరుగా ‘విద్యుత్’ రీచార్జి ♦ భారం వినియోగదారులపైనే.. వాయిదాల్లో వసూలు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీపెయిడ్ ‘స్మార్ట్’ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇకపై ప్రతి నెలా ముందు(అడ్వాన్స్)గా బిల్లు చెల్లిస్తేనే, అదీ బిల్లు చెల్లించిన మేరకే విద్యుత్ సరఫరా చేసే విధానం రాబోతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 48 వేల పైచిలుకు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ‘స్మార్ట్’ మీటర్లను బిగించనున్నారు. భవిష్యత్తులో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు సైతం దీనిని వర్తింపజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నాలుగు కంపెనీలతో.. ఈ స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణకు సం బంధించి డిస్కంలు తాజాగా 4 ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌తో పాటు జైపూర్‌కు చెందిన జీనస్, గురుగ్రామ్‌కు చెందిన హెచ్పీఎల్, బెంగళూరుకు చెందిన ‘పవర్ వన్ డేటా’ కంపెనీల నుంచి ఆటోమేటిక్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లతో పాటు నిర్వహణ సేవల కోసం ఒప్పందా లు ఖరారయ్యాయి. సింగిల్ ఫేజ్ మీటర్‌ను సుమారు రూ.7వేలు, త్రీఫేజ్ మీటర్‌ను రూ.8 వేలకు కొనుగోలు చేస్తున్నామని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు జూన్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాల యాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. లో టెన్షన్ (ఎల్టీ) సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ కేటగిరీల్లోని కార్యాలయాలకు మాత్రమే వీటిని అమరుస్తా రు. ఆ తర్వాత హైటెన్షన్(హెచ్‌టీ) విభాగంలోని కార్యాలయాలకు విస్తరింపజేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన(ఉదయ్) పథకంలో రాష్ట్రం చేరితే.. గృహ, వాణిజ్య, పరిశ్రమలు తదితర అన్ని రంగాల వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాల్సి ఉంటుంది. మీటర్లో సిమ్‌కార్డు ఇప్పటివరకు ఎక్కడా వినియోగించని సరి కొత్త ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించనున్నామని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్‌లో ‘కీ ప్యాడ్’తో పనిచేసే ప్రీపెయిడ్ మీటర్లను వినియోగించడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. రహస్య కోడ్ ఆధారంగా ప్రీపెయిడ్ సిమ్‌కార్డును రీచార్జి చేసినట్లే... ఈ విద్యుత్ మీటర్లను రీచార్జి చేయాలి. రహస్య కోడ్లు దుర్వినియోగమైతే నష్టాలు వస్తాయని భావించిన డిస్కంలు... కీప్యాడ్ మీటర్ల పట్ల విముఖత చూపాయి. ఆ మీటర్లను తక్కువ ధరకే సరఫరా చేస్తామని పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు దాఖలు చేసిన టెండర్ బిడ్లను తిరస్కరించి... బిల్లు చెల్లించిన వెంటనే ఆటోమెటిగ్గా రీచార్జయ్యే మీటర్లను మాత్రమే ఎంపిక చేశాయి. ఈ మీటర్లలో ఒక సిమ్‌కార్డు/డాటా కార్డు ఉంటుంది. భవనానికి ఒకే మీటర్ ఉంటే సిమ్‌కార్డుతో, ఒకటికి మించిన సంఖ్యలో ఉంటే ఇంటర్నెట్ డాటా కార్డుతో వాటిని అనుసంధానం చేసి ఆపరేట్ చేస్తారు. బిల్లు చెల్లించిన వెంటనే ఆ మేరకు విద్యుత్ వినియోగించుకునేందుకు అనుమతిస్తూ సిమ్‌కార్డుకు సమాచారం చేరుతుంది. సిమ్‌కార్డు నెల అద్దె రూ.19. అయితే నిర్వహణ వ్యయం కింద ఈ మొత్తాన్ని మీటర్ల కంపెనీలు భరించనున్నాయి. మరెన్నో ప్రయోజనాలు కూడా.. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఏ ఇంట్లో/ఆఫీసులో కరెంటు ఉంది, ఎక్కడెక్కడ విద్యుత్ సరఫరా లేదన్న సమాచారం డిస్కంలకు వెంటనే తెలిసిపోతుంది. సాంకేతిక సమస్యలతో సరఫరా నిలిచిపోతే... వినియోగదారులు ఫిర్యాదు చేయకపోయినా డిస్కంలు స్పందించి సరఫరాను పునరుద్ధరించే వెసులుబాటు కలుగుతుంది. ఏ వినియోగదారుడు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాడో తెలుస్తుం ది. తద్వారా విద్యుత్ డిమాండ్‌ను కచ్చితంగా అంచనా వేయవచ్చు. బిల్లు కట్టకపోతే అంతే.. ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల మొండి బకాయిలు రూ.2,020 కోట్లదాకా పేరుకుపోయాయి. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను అమర్చాలని సీఎం కేసీఆర్ నాలుగు నెలల కింద డిస్కంలను ఆదేశించారు. ఈ మీటర్లను బిగించిన తర్వాత అడ్వాన్స్‌గా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే అత్యవసర సమయాల్లో ప్రీపెయిడ్ మీటర్‌పై ఉండే ఒక ప్రత్యేక బటన్‌ను నొక్కితే మరో 24 గంటల పాటు పూర్తి విద్యుత్ సరఫరా ఉంటుంది. అప్పటికీ బిల్లు చెల్లించకపోయినా మరో 72 గంటల పాటు 20శాతం విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంది. అంటే ఏసీల వంటి ఉపకరణాలను వినియోగించుకోలేరు. ఆ తర్వాత విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ప్రీపెయిడ్ మీటర్ల వ్యయాన్ని సంబంధిత వినియోగదారుల నుంచే వసూలు చేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. వాయిదాలుగా వసూలు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.