బాలికల గురుకులంలోకి అన్నదమ్ములను అనుమతించని ప్రిన్సిపాల్
కిటికీల్లో నుంచే రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు
పండుగపూట పిల్లల ఆనందం ఆవిరి
తంగళ్లపల్లి/రామకృష్ణాపూర్: అన్నాచెల్లి..అక్కాతమ్ముడు అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక. కానీ ఇక్కడ బంధనాల నడుమ ఆ వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది. కిటికీల సందుల్లో నుంచి అనేక ఇబ్బందులు పడుతూ రాఖీలు కట్టించుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ఉంది. సోమవారం రాఖీ పండుగ కావడంతో అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుందామని సుదూర ప్రాంతాల నుంచి సోదరులు తల్లిదండ్రులతో కలిసి తరలివచ్చారు.
అయితే వారిని ప్రిన్సిపాల్ గురుకులంలోకి అనుమతించలేదు. ఎంత ప్రాథేయపడినా ససేమిరా అన్నాడు. చివరకు చేసేదేమి లేక కిటికీల సందుల్లో నుంచి తమ అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకొని కన్నీళ్లు దిగమింగుకుంటూ తిరిగివెళ్లారు. ఈ విషయంపై గురుకుల పాఠశాల సిబ్బందిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు.
తండ్రి భుజాలపై రాఖీ బంధం
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో దాసరి అశ్విక, సహస్ర చదువుతున్నారు. రాఖీ పండగకు సోమవారం పాఠశాలకు సెలవు ఇవ్వలేదు. రాఖీలు కట్టేందుకు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో అశ్విక, సహస్రల తమ్ముడు దాసరి జితేంద్ర అక్కలపై ఉన్న ప్రేమతో ఎలాగైనా రాఖీ కట్టించుకోవాలని సాహసం చేశాడు.
తండ్రి భుజంపైకి ఎత్తుకోగా హాస్టల్ కిటికీ వద్దకు వచ్చిన అక్కలు జితేంద్రకు రాఖీ కట్టారు. జితేంద్ర రాఖీ కట్టించుకున్న తీరును ఎవరో మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కూడా వైరల్ అయ్యింది. దీనిని అధికారులు తీవ్రంగా పరిగణించారు. గురుకుల జిల్లా కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు విచారణ చేపట్టి కలెక్టర్ కుమార్‌దీపక్‌కు నివేదిక అందజేశారు.
రాఖీ పౌర్ణమి సెలవు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గురుకులానికి వచ్చారని, విద్యార్థులందరినీ ఒకేసారి ఉదయం 11గంటలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఓ విద్యారి్థని తండ్రి ఉదయం 9గంటలకే కిటికీలోతన పిల్లలకు రాఖీ కట్టించుకుంటూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసి గురుకులానికి ఇబ్బంది కలిగేలా చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment