సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: భారీ వర్షాలతో తెలంగాణ తడిచి ముద్దవుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాల్లో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు ఉప నదులు పోటెత్తడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టులకు వరద అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొన్నిచోట్ల వరద రోడ్లపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి.
పెద్దపల్లి–భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు బంద్
ఉమ్మడి వరంగల్‌లో మున్నేరు, చలివాగులతో పాటు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు, కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను వాయిదా వేశారు. జనగామ జిల్లాలో రామవరం చెరువు మత్తడి పోస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం– పెద్దపల్లి జిల్లా మంథని రహదారిలోని మల్హర్ మండల పరిధిలో గల బొమ్మారపు వాగు లోలెవల్ కాజ్‌వే పై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్దపల్లి–భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మల్హర్ మండలంలోని రుద్రారం చెరువు పూర్తిగా నిండి కట్టపై నుంచి నీరు ప్రహించింది. సంగారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.
వాగులో చిక్కుకున్న 500 గొర్రెలు
మల్హర్ మండలం కొయ్యూరు బొమ్మరాపు వాగులో 500 పైగా గొర్రెలు చిక్కుకుపోయాయి. 80 గొర్రెలు కొట్టుకుపోగా పోలీసులు గ్రామస్తుల సహకారంతో మిగతావాటిని ఒడ్డుకు చేర్చారు. ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని వెంగ్లాపూర్ సమీపంలో హైదారాబాద్ నుంచి మేడారం వెళ్తున్న భక్తుల వాహనం వరదలో చిక్కుకుంది. స్థానికులు వారిని రక్షించి బయటకు తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అత్యధికంగా 21.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మాక్లూర్ మండలం మెట్‌పల్లి వద్ద కాచకుంట చెరువు కట్ట తెగింది. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి కొత్తకుంట చెరువుకు గండి పడింది. కామారెడ్డి జిల్లాలో రెండిళ్లు పూర్తిగా, 74 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
విద్యుద్ఘాతంతో ఒకరి మృతి
ఇల్లు ఉరుస్తోందని ఇంటిపై ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు యత్నిస్తుండగా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో సాయిలు (45) అనే వ్యకిŠత్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు.
లక్ష్మీబ్యారేజీ వద్ద దిగువకు తరలిపోతున్న వరద నీరు
లక్ష్మీ బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కాళేశ్వరం వద్ద గోదావరి 12.7 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీలకు వరద పోటెత్తింది. లక్ష్మీ బ్యారేజీకి 10.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో వరదను దిగువకు వదులుతున్నారు. సరస్వతి బ్యారేజీ వద్ద 3,55,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 66 గేట్లకు 50 గేట్లెత్తి అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.
ఎస్సారెస్పీకి ఒక్కరోజే 28 టీఎంసీలు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఆదివారం రాత్రికి ఎగువ నుంచి 4,47,765 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,086.7 అడుగుల (72.26 టీఎంసీలు) నీరుంది. ఆదివారం ఒక్కరోజే 28 టీఎంసీల నీరు చేరడం గమనార్హం. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో ముందు జాగ్రత్తగా 9 వరద గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు వరద నీరు
నేడు నిండే అవకాశం
ఎస్సారెస్పీ ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లి, బాలేగావ్, నిర్మల్ జిల్లాలోని గెడ్డన్న, సుద్దవాగు ప్రాజెక్టులు నిండడంతో నీరు భారీగా వస్తోంది. మహారాష్ట్రలోని గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు నిండి గేట్లు ఎత్తితే ఇన్‌ఫ్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇన్‌ఫ్లో పెరిగితే సోమవారం జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశముందని భావిస్తున్నారు. కాగా కామారెడ్డి జిల్లాలోని పోచారం, కౌలాస్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. సింగితం రిజర్వాయర్, కల్యాణి ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. 531 చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి.
పొంగి పొర్లుతున్న పోచారం
సంగారెడ్డి జిల్లా సింగూరు జలాశయానికి ఐదు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కల్హేర్ మండలంలోని నల్ల వాగు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో గేట్లను పైకెత్తి నీటిని కిందికి వదిలారు. మెదక్ జిల్లా హల్దీ, ఘనపూర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా పోచారం ప్రాజెక్టు మాత్రం పొంగిపొర్లుతోంది.
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీల గేట్లు ఎత్తేయడంతో సమ్మక్క బ్యారేజీ వద్దకు ఆదివారం ఉదయానికి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ వరద నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు నీటిమట్టం 38 అడుగులు దాటింది. ఇక్కడ 43 అడుగల మేరు నీరు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
రాత్రి 10 గంటల వరకు ఆ మేరకు నీటి మట్టం పెరగవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నీటి మట్టం 19.4 అడుగులకు, పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 17.50 అడుగులకు చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి పంటలు నీట మునిగిపోయాయి. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తి 21 వేల క్యూసెక్కుల నీటిని, తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 20,792 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి భారీ వరదను దిగువకు వదిలేస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి పోలవరం ప్రాజెక్టు వద్దకు పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆలమట్టికి వరద
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, దాని ఉప నదుల్లో ప్రవాహం పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 91 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 82.84 టీఎంసీలకు చేరుకుంది. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మంగళవారం రాత్రికి తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఆలమట్టి ప్రాజెక్టుకు 75,149 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 18,526 క్యూసెక్కుల వరద ఉండగా.. ఈ రెండు ప్రాజెక్టులు నిండితే జూరాలకు నీటిని వదులుతారు. ప్రస్తుతం జూరాలకు 872 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మూసీ ప్రాజెక్టు గేట్లు ఐదు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment