సాక్షి, హైదరాబాద్: ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన చారిత్రక సికింద్రాబాద్ రైల్వే స్టేడియాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రైల్ నిలయాన్ని అనుకొని ఉన్న సుమారు 30 ఎకరాలలోని స్టేడియం స్థలాలను వ్యాపార, వాణిజ్య సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన విధి వి«ధానాలురూపొందించవలసిందిగా రైల్వేశాఖ తాజాగా రైల్వే లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ)ను ఆదేశించింది. లీజుకు ఇవ్వడం ద్వారా రైల్వేకు ఎంత మేరకు ఆదాయం లభిస్తుందనే అంశంపైనా అధ్యయనం చేయాలని రైల్వేశాఖ ఈ ఆదేశాల్లో ఆర్‌ఎల్‌డీఏను కోరింది.
వడివడిగా అడుగులు
రైళ్లు, రైల్వే కార్యకలాపాల ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తు న కార్యాచరణ చేపట్టిన రైల్వేశాఖ విలువైన స్థలాల ను ప్రైవేట్ సంస్థలకు లీజు రూపంలో దారాదత్తం చేసే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైల్వే లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్థలాలను ఎంపిక చేసింది. కొన్నింటికీ ప్రీ బిడ్ టెండర్లను కూడా ఆహ్వానించారు. మౌలాలీ ఆర్‌పీఎఫ్, చిలకలగూడ రైల్వే క్వార్టర్స్, మెట్టుగూడ రైల్ కళారంగ్, సంగీత్ చౌరస్తాలోని రైల్వే ఆఫీసర్స్ క్వార్టర్స్, తదితర స్థలాల్లో షాపింగ్‌మాల్స్, థియేటర్లు, హోటళ్లు, తదితర వ్యాపార, వాణిజ్య భవన సముదాయాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను ఎయిర్‌పోర్టు తరహాలో అభివద్ధి చేసే కార్యాచరణలో భాగంగా ఈ రైల్వేస్టేషన్‌ల చుట్టూ ఉన్న స్థలాల ప్రైవేటీకరణకు కూడా రంగం సిద్ధమైంది.
నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్‌ల వద్ద దక్షిణమధ్య రైల్వేకు ఉన్న స్థలాలను కూడా ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. ఇందుకోసం నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, లక్డీకాఫూల్ స్టేషన్లను గతంలోనే ఎంపిక చేశారు. ఎకరా అదనంగా ఉన్నా సరే లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేపట్టింది.
మొదట్లో కొన్ని స్థలాలను 33 ఏళ్లకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు సంస్థల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో లీజు గడువును 49 ఏళ్లకు పెంచారు. ఆ తరువాత కొన్ని విలువైన స్థలాలను 99 ఏళ్లకు సైతం లీజుకు ఇచ్చేందుకు ఆర్‌ఎల్‌డీఏ ప్రణాళికలను రూపొందించింది. తాజాగా దేశంలోనే ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ రైల్వేస్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కార్పొరేట్ శక్తుల జాబితాలో చేర్చడం గమనార్హం.
ఎంతో ఘన చరిత్ర
సికింద్రాబాద్ రైల్వేస్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. సుమారు ఆరున్నర దశాబ్దాలుగా ఎందరో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు సికింద్రాబాద్ స్టేడియం వేదికగా నిలిచింది. ఎంతోమంది అర్జున అవార్డు గ్రహీతలు దక్షిణమధ్య రైల్వే క్రీడాకారులు కావడం గమనార్హం. మిథాలీరాజ్, జేజే శోభ, అనురాధారెడ్డి వంటి ఎందరో ఈ వేదిక నుంచే ఎదిగారు. సికింద్రాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఫుట్‌బాల్,బాస్కెట్‌బాల్, వాలీబాల్ స్టేడియంలు, స్విమ్మింగ్‌పూల్, టెన్నిస్‌లాంజ్, ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియంలు, వాకింగ్ ట్రాక్, అంతర్జాతీయ స్థాయి సింథటిక్ హాకీ గ్రౌండ్, తదితర సదుపాయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment