పెరుమాళ్ల సంకీసలోని శ్రీ రామచంద్రస్వామి దేవాలయం
సాక్షి, హైదరాబాద్: మనం ఉంటున్న ఇంట్లో వసతులు లేకుంటే ఏం చేస్తాం.. మరో ఇంటికి మారతాం. మరి ఓ దేవుడి గుడిలో సమస్యలు ఏర్పడితే దేవుడు కూడా మరో కోవెలకు మారతాడా! కచ్చితంగా మారేవాడు అంటోంది ఓ శాసనం. ఆలనాపాలనా కరువై ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది వస్తే, ఆ దేవాలయంలోని స్వామివారిని అనుకూ లంగా ఉన్న మరో ఆలయంలోకి మార్చేవారు. అలాంటి స్వామిని బే చిరాగ్ దేవుడిగా పేర్కొనేవారు. అంటే దీపం కరువైన దేవుడని అర్థం. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ల సంకీస గ్రామంలోని శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో ఓ రాగి శాసనం వెలుగు చూసింది. 1236 హిజరీ సంవత్సరంగా అందులో పేర్కొన్నారు. అంటే 1820వ సంవత్సరమన్నమాట. ఆలయంలో భద్రపరిచిన ఈ శాసనాన్ని చరిత్ర పరిశోధకుడు కట్టా శ్రీనివాస్ పరిశీలించి దాన్ని వెలుగులోకి తెచ్చారు. శాసనంలోని వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.
వెలుగొందుతున్న ఆలయం..
మన్నెగూడెంకు చెందిన అంకం బాలన్న తూర్పు నుంచి స్వామివారిని తీసుకొచ్చి మంగళగిరి భావనాచార్యుల సహకారంతో మన్నెగూడెంలో కొంతకాలం కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత దీపం పెట్టే దిక్కుకూడా లేకపోవడంతో విక్రమనామ సంవత్సరంలో మంగళగిరి పెదనర్సయ్య భూదానం చేసి ఆ స్వామివారిని సంకీస గ్రామానికి రప్పించారు. ఆ తర్వాతనే గ్రామం పెరుమాళ్ల సంకీసగా మారిందని చెబుతారు. కీర్తి గడించిన ఆ దేవాలయం నాటి నుంచి వెలుగొందుతూనే ఉంది. స్వామివారి ప్రతిష్ట సందర్భంగా భూదానం, అర్చకులకు చెల్లించాల్సిన మొత్తం, స్వామివారి కైంకర్య వివరాలు, ఆలయ ఆదాయం, పులిహోర, ఇతర ప్రసాదాల్లో వాడాల్సిన దినుసుల పాళ్లు తదితర వివరాలను పత్రాల్లో రాశారు.
రాగి ప్రతిపై శాసనం
ఆ తర్వాత ఆ పత్రాలు జీర్ణమయ్యే పరిస్థితి రావటంతో రాగి శాసనంపై వివరాలు చెక్కించారు. కుంచెడు, అడ్డెడు, మానెడు, తక్కెడు లాంటి నాటి కొలమాన పదాలను అందులో వాడారు. స్వామి కల్యాణానికి 300 గ్రామాల వారు హాజరయ్యారని, ఆడపెండ్లి వారికి అర్ధరూపాయి, మగపెండ్లి వారికి రూపాయి చొప్పున కట్నం చదివించేవారు. శాసనంలో పేర్కొన్న విధంగా పద్ధతులు ఆచరించాలని పేర్కొంటూ అతిక్రమించిన వారికి శాపనార్థాలు పెట్టిన తీరు కూడా అందులో ఉండటం విశేషం. దస్తూరి, సాక్షుల పేర్లు కూడా రాయించారు. శాసనం వేయించినట్టు భావిస్తున్న ముగ్గురు దేశ్‌ముఖ్‌ల పేర్లు యర్రసాని వెంకట తిమ్మయ దేశ్‌ముఖ్, యర్రసాని చిన నర్సయ్య దేశ్‌ముఖ్, యర్రసాని గోపాల రాయుడు దేశ్‌ముఖ్‌ల పేర్లు చివరలో వేయించారు.
Comments
Please login to add a commentAdd a comment