చార్మినార్: రంజాన్ మాసంలో అత్తర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అత్తర్ వాడందే ముస్లింలు బయటకు వెళ్లరు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అత్తర్ విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలకు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్‌కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్ మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు అత్యధికంగా డిమాండ్ ఉంటుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అత్తర్ వాడతారు.
అత్తర్ తయారీ విధానం..
గులాబీ రేకులు, మల్లెపువ్వులు, మొఘలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్ కావాలో దాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన బట్టిలలోని డెకీసాలలో వేస్తారు. డేకీసా పైన మూతకు ఒక చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చే విధంగా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అసలు సిసలు ‘అత్తర్’.
తయారు చేసే ప్రాంతాలు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నోజ్ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, కంబోడియాలలో కూడా దీని తయారీ కేంద్రాలున్నాయని చార్మినార్‌లోని షా ఫెర్‌ఫ్యూమ్స్ యజమాని సయ్యద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. అత్తర్‌ను ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అంత సువాసన వెదజల్లుతుందన్నారు. నకిలీదైతే
కొంత కాలంలోనే వాసనలో వ్యత్యాసం
తెలుస్తుందన్నారు.
ఎప్పుడు.. ఏదీ..?
అన్ని రకాల అత్తర్లను అన్ని సమయాల్లో వాడలేం. వాడే పద్ధతి తెలియక సమయం కాని సమయంలో ఒంటికి పూస్తే, వాసనను పీలిస్తే అనర్థాలు కలిగే అవకాశం ఉంది. వేసవికాలంలో ఖస్, ఇత్రేగిల్ చాలా మంచిది. ఇవి రెండు చల్లదనాన్ని ఇస్తాయి. ఇత్రేగిల్ మట్టి వాసనను ఇస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. చలి, వర్షాకాలాల్లో షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనల్ ఊద్ వంటివి వాడాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి. వేసవి కాలంలో దహనల్ ఊద్ వాడితే ముక్కు నుంచి రక్తం కారడం ఖాయం.
అత్తర్/పర్‌ఫ్యూమ్..
అత్తర్‌లో స్వచ్ఛమైన పువ్వులు, గంధపు చెక్కలు వంటి వాటిని వాడతారు. పర్‌ఫ్యూమ్‌లలో ఆల్కాహాల్ కూడా ఉంటుంది. ఇది మత్తును తెప్పిస్తుంది. ఆల్కాహాల్‌కు ఇస్లాం(మక్రూ) వ్యతిరేకం. అత్తర్‌లో అయితే ఆల్కాహాల్ ఉండదు. ఇది పూర్తి స్వచ్ఛంగా ఉంటుంది.
అనేక రకాలు..
జన్నతుల్ ఫిర్‌దోస్, మజ్మ, షాజహాన్, తమన్నా, నాయబ్, హోప్, బకూర్, మొకల్లత్, ఖస్, ఇత్రేగిల్, షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనల్ ఊద్ తదితర అనేక రకాలున్నాయి. కృత్రిమంగా తయారుచేసేవి ఎన్ని ఉన్నా.. పెట్టిన మరుక్షణమే వాసనపోయేవి ఉన్నాయి. అసలు అత్తర్ అంటే వేశాక రెండు మూడుసార్లు దుస్తులు ఉతికినా వాసన అలాగే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment