Perfumes
-
హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా?
ఇటీవల మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వెరైటీ బ్యూటీ ప్రొడక్ట్‌లు వస్తున్నాయి. ఎలాంటి సమస్య అయినా చిటికెలో చెక్‌పెట్టేలా కళ్లు చెదిరిపోయే ధరల్లో మనముందుకు వస్తున్నాయి సౌందర్య ఉత్పత్తులు. ముఖ్యంగా యువత వీటిని ఎక్కువ ఉపయోగిస్తుంది. వాటిల్లో ప్రముఖంగా ఉపయోగించేది హెయిర్ పెర్ఫ్యూమ్నే. ఇది మనం జస్ట్ అలా ఎంట్రీ ఇవ్వంగానే అందరి ముక్కులను ఘామాళించేలా మంచి సువాసన వచ్చేస్తుంది. అందరిలో ప్రత్యేకంగా సువాసనభరితంగా అనిపించేలా కనిపించడం కోసం కొందరూ ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్స్ని తెగ వాడేస్తుంటారు. అయితే ఇలా ఉపయోగించటం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో సవివరంగా చూద్దామా..!పరిమిళాలు వెదజల్లే ఈ హెయిర్ పెర్ఫ్యూమ్లు మంచి తాజాదనాన్ని ఆహ్లాదమైన అనుభూతిని కలిగించినప్పటికీ అవి మీకు హానిని కలుగజేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిల్లో ఇథైల్ ఆల్కహాల్, భారీ సింథటిక్ సువాసనలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని దీర్ఘకాలం ఉపయోగిస్తే..స్కాల్ప్ డ్యామేజ్ అవ్వడం లేదా పొడిబారినట్లుగా మారుతుంది. ఇవి జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా హెయిర్ పెర్ఫ్యూమ్‌లోని ఆల్కాహాల్లు జుట్టులోని సహజ నూనెలను తొలగించి.. పొడిగా, పెళుసుగా అయిపోతాయి. ఎక్కువగా జుట్టు చివర్లు చిట్లిపోవడం, నిస్తేజంగా అయిపోవడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు మెయింటెయిన్ చేయాలనుకుంటే వీటిని మితంగా లేదా దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ హెయిర్ ఫెర్ఫ్యూమ్లు ఓ ట్రెండ్‌గా మారినప్పటికీ.. అవి ఆరోగ్యానికి హానికరమే గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అంతగా అలాంటి సువాసనభరితమైన ఫీల్ కావాలనుకుంటే సహజ పదార్థాలతో కూడా ఇలాంటి అనుభూతిని పొందొచ్చని చెబుతున్నారు. సంరక్షణ పద్ధతులు..తేలికపాటి మెత్తపాటి జుట్టు ఉన్నవాళ్లు పొగమంచులాంటి లైట్ ఫెర్ఫ్యూమ్లు ఒత్తు జుట్టు ఉన్నవారు మంచి గాఢతగలవి వినియోగించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ పెర్ఫ్యూమ్లను మితంగా వాడితే జుట్టు నష్టాన్ని నివారించి ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారని చెబుతున్నారు. తేలికపాటి స్ప్రేలు సరిపోతాయని, వాటిని నేరుగా తలపై కాకుండా చివర్ల లేదా జుట్టు మధ్యలో స్ప్రే చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు. సహజ ప్రత్యామ్నాయాలు..హెయిర్ ఫెర్ఫ్యూమ్కు సహజమైన ప్రత్యామ్నాయాలు ఏంటంటే..లావెండర్, రోజ్మేరీ లేదా చమోమిలే వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ని నీటిలో కలిపి హెయిర్‌పై స్ప్రేగా ఉపయోగించొచ్చు. ఇవి శిరోజాలకు సహజమైన నూనెలను అందించడమే కాకుండా ఆహ్లాదభరితమైన సువాసనను కూడా ఇస్తాయి. ముఖ్యంగా రోజ్ వాటర్ చక్కటి రిఫ్రెష్‌ని కలిగించే సువాసనను అందిస్తుంది. అలాగే నారింజ లేదా నిమ్మ వంటి సిట్రస్ తొక్కలతో తయారు చేసిన నీటిని కూడా ఉపయోగించొచ్చు. ఇవి జుట్టు స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎలాంటి ఫెర్ఫ్యూమ్ అయినా ఎక్కువ మోతాదులో స్ప్రే చేయకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.(చదవండి: వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా లుక్ అదుర్స్..!) -
విదేశాలకు మన అత్తరు
యురోపియన్, అమెరికన్ పెర్ఫ్యూమ్స్ మన దేశీయ అత్తర్ల తయారీపైన తీవ్ర ప్రభావం చూపాయి. మనదైన కళారూపం కనుమరుగవుతోందని గమనించిన క్రతి, వరుణ్ టాండన్ లు అనే అన్నాచెల్లెళ్లు మన దేశీయ సాంస్కృతిక పరిమళ ద్రవ్యాల తయారీని సంరక్షించాలని పూనుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 సమ్మిట్‌లో వీరి బ్రాండ్ అఫీషియల్ కానుకల జాబితాలో చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్ నగరంలో చాలా కుటుంబాలు అత్తరు తయారీ కళను తరాలుగా కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ సంప్రదాయ పద్ధతుల అత్తరు వాడకాలు విదేశీ బ్రాండ్ పర్ఫ్యూమ్లతో తగ్గిపోయాయి. కనౌజ్లో ఉంటున్న క్రతి, వరుణ్ టాండన్‌లు మనసుల్లో ఈ నిజం ఎప్పుడూ భారంగా కదలాడుతుండేది. తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి, చేస్తున్న కృషిని ఈ సోదర ద్వయం ఇలా మన ముందుంచుతున్నారు. ‘‘మా చిన్ననాటి నుంచీ ఈ కళను చూస్తూ పెరిగాం. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం పట్ల మా ఆలోచనలు, చర్చలు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. కోవిడ్ మహమ్మారి మన దేశీయ పరిమళ ద్రవ్యాలపైన కోలుకోలేనంత దెబ్బ వేసింది. దీంతో మా ఆలోచనలను అమల్లో పెట్టాలని రెండేళ్ల క్రితం ‘బూంద్’ పేరుతో పరిమళ ద్రవ్యాల కంపెనీ ప్రారంభించాం. మనదైన సాంస్కృతిక కళపై చిన్న డాక్యుమెంటరీ రూపొందించి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాం. దీంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని వివరిస్తుంది క్రతి. చేస్తున్న ఉద్యోగాలు వదిలి... జర్మనీలోని కార్పొరేట్ కంపెనీలో పని చేసే క్రతి అక్కడి నుండి స్వదేశానికి చేరుకుంది. ముంబైలో చిత్రనిర్మాణ రంగంలో ఉన్న వరుణ్ కూడా స్వస్థలానికి చేరుకున్నాడు. ‘మేం మొదట ఈ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలనుకోలేదు. అత్తరు తయారీ కళాకారులకు జీవనోపాధి కల్పించాలనుకున్నాం. వీరు ఆదాయవనరుల కోసం అన్వేషిస్తే ఏదైనా పని దొరుకుతుంది. కానీ, మనదైన కళ కనుమరుగవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ తీసుకొచ్చాం. ఒకేరోజులో 100 ఆర్డర్లు వచ్చాయి. ఏడాదలో యాభై శాతం వృద్ధి వచ్చింది. ఆ తర్వాత నెలవారీ ఆర్డర్లు వెయ్యికి మించిపోయాయి. సెలబ్రిటీలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లతో సహా బాలీవుడ్ వివాహాలలో మా అత్తరు పరిమళాలు వెదజల్లింది. ముఖ్యంగా ఢిల్లీలో నిర్వహించిన జి 20 సమ్మిట్‌లో 2023కి అధికారిక కానుకల భాగస్వామ్యంలో బూంద్ బ్రాండ్ ఒకటిగా ఎంపికయ్యింది. జి20 సమ్మిట్‌లో పాల్గొనడం, మా చిన్న వ్యాపారానికి గొప్ప ముందడుగుగా పనిచేసింది’అని వివరిస్తారు వరుణ్. ఒక ఆలోచనను అమలులో పెట్టడంతో వారి కుటుంబాన్నే కాదు మరికొన్ని కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. మన దేశీయ వారసత్వ కళ ముందు తరాలకు మరింత పరిమళాలతో పరిచయం అవుతోంది. కుటుంబ సభ్యులు కూడా... కనౌజ్ పరిమళ ద్రవ్యాల కళాకారులు అత్తర్లను తయారుచేయడానికి ‘డెగ్–భాష్కా’ పద్ధతిని ఉపయోగిస్తారు. సంప్రదాయ ప్రక్రియలో సుగంధవ్య్రాల ముడిపదార్థాలను ఉపయోగించి, మట్టి పాత్రలలో తయారుచేస్తారు. మార్కెట్లోని ఇతర బ్రాండ్స్ ధరలతో పోల్చితే తక్కువ, సువాసనల ఉపయోగాలు ఎక్కువ. పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి ధరలలో మార్పు ఉంటుంది. యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలకు 20 వేల కంటే ఎక్కువ ఆర్డర్లు పంపించాం. ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడమే కాకుండా, ముంబై, జైపూర్లలో రిటైల్ స్పేస్‌లోకి కూడా ప్రవేశించాం. మా నాన్న రచనలు చేస్తుంటారు. తన అందమైన కవిత్వాన్ని ఈ అత్తరు పరిమళాలతో జోడిస్తాడు. దీంతో సువాసనలకు మరింత అకర్షణ తోడైంది. ఇప్పుడు మా బ్రాండ్‌కి 12 మంది కళాకారులతో పాటు మా కుటుంబసభ్యులు కూడా కొత్త పరిమళాలను తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు’ అని వివరిస్తున్నారు ఈ సోదర సోదరీ ద్వయం. -
27 రకాల సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీర
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్ పరిమళించే పట్టు చీరను రూపొందించారు. విజయ్‌కుమార్ ఇప్పటికే తండ్రి పరంధాములు స్ఫూర్తితో అనేక ప్రయోగాలు చేశారు. తాజాగా 27 రకాల సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణంలో పట్టు పోగులను ఉడకబెట్టి పవర్లూమ్పై పట్టు చీరను నేశాడు. సుగంధ ద్రవ్యాల ప్రభావంతో ఆ చీర పరిమళిస్తోంది. చీర ఐదున్నర మీటర్ల పొడవు, 46 ఇంచీల వెడల్పు, 400 గ్రాముల బరువుంది. నాలుగు రోజులపాటు శ్రమించి నేసిన ఈ చీర తయారీకి రూ.12 వేలు ఖర్చయినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. (క్లిక్: డబుల్ బెడ్రూం ఇల్లు వెనక్కి) -
అత్తర్ ఉందిగా అని ఎప్పుడు పడితే అప్పుడు.. ఏదీ పడితే అది వద్దు!
చార్మినార్: రంజాన్ మాసంలో అత్తర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అత్తర్ వాడందే ముస్లింలు బయటకు వెళ్లరు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అత్తర్ విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలకు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్‌కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్ మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు అత్యధికంగా డిమాండ్ ఉంటుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అత్తర్ వాడతారు. అత్తర్ తయారీ విధానం.. గులాబీ రేకులు, మల్లెపువ్వులు, మొఘలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్ కావాలో దాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన బట్టిలలోని డెకీసాలలో వేస్తారు. డేకీసా పైన మూతకు ఒక చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చే విధంగా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అసలు సిసలు ‘అత్తర్’. తయారు చేసే ప్రాంతాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నోజ్ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, కంబోడియాలలో కూడా దీని తయారీ కేంద్రాలున్నాయని చార్మినార్‌లోని షా ఫెర్ఫ్యూమ్స్ యజమాని సయ్యద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. అత్తర్‌ను ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అంత సువాసన వెదజల్లుతుందన్నారు. నకిలీదైతే కొంత కాలంలోనే వాసనలో వ్యత్యాసం తెలుస్తుందన్నారు. ఎప్పుడు.. ఏదీ..? అన్ని రకాల అత్తర్లను అన్ని సమయాల్లో వాడలేం. వాడే పద్ధతి తెలియక సమయం కాని సమయంలో ఒంటికి పూస్తే, వాసనను పీలిస్తే అనర్థాలు కలిగే అవకాశం ఉంది. వేసవికాలంలో ఖస్, ఇత్రేగిల్ చాలా మంచిది. ఇవి రెండు చల్లదనాన్ని ఇస్తాయి. ఇత్రేగిల్ మట్టి వాసనను ఇస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. చలి, వర్షాకాలాల్లో షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనల్ ఊద్ వంటివి వాడాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి. వేసవి కాలంలో దహనల్ ఊద్ వాడితే ముక్కు నుంచి రక్తం కారడం ఖాయం. అత్తర్/పర్ఫ్యూమ్.. అత్తర్లో స్వచ్ఛమైన పువ్వులు, గంధపు చెక్కలు వంటి వాటిని వాడతారు. పర్ఫ్యూమ్లలో ఆల్కాహాల్ కూడా ఉంటుంది. ఇది మత్తును తెప్పిస్తుంది. ఆల్కాహాల్‌కు ఇస్లాం(మక్రూ) వ్యతిరేకం. అత్తర్లో అయితే ఆల్కాహాల్ ఉండదు. ఇది పూర్తి స్వచ్ఛంగా ఉంటుంది. అనేక రకాలు.. జన్నతుల్ ఫిర్దోస్, మజ్మ, షాజహాన్, తమన్నా, నాయబ్, హోప్, బకూర్, మొకల్లత్, ఖస్, ఇత్రేగిల్, షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనల్ ఊద్ తదితర అనేక రకాలున్నాయి. కృత్రిమంగా తయారుచేసేవి ఎన్ని ఉన్నా.. పెట్టిన మరుక్షణమే వాసనపోయేవి ఉన్నాయి. అసలు అత్తర్ అంటే వేశాక రెండు మూడుసార్లు దుస్తులు ఉతికినా వాసన అలాగే ఉంటుంది. -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ల ధరలు
దేశంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు ఆ ప్రభావం నిత్యావసర ధరల మీద కూడా కనిపిస్తుంది. సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్), ఐటీసీ లిమిటెడ్ పేర్కొన్నాయి. దేశంలోని రెండు ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలు ఇన్ పుట్ ఖర్చుల గణనీయంగా పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచినట్లు తెలిపాయి. హెచ్‌యుఎల్ తన 1 కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను 3.4 శాతం(రూ.2) పెంచింది. అలాగే, వీల్ పౌడర్ 500 గ్రాముల ప్యాక్ ధరను 2 రూపాయలు పెంచడంతో అంతిమ ధర రూ.28 నుంచి రూ.30కి పెరిగింది. ఇంకా, రిన్ బార్ 250 గ్రాముల ప్యాక్ ధరలను 5.8 శాతం పెంచింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం(రూ.25) పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ 100 గ్రాముల ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ వారి ప్యాక్ ధరలను 9 శాతం పెంచినట్లు సమాచారం. 150 మిలీ బాటిల్ ఎంగేజ్ డియోడరెంట్ ధరను 7.6 శాతం, 120 మిలీ బాటిల్ కు ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ధరను కంపెనీ 7.1 శాతం పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. "ఇన్ పుట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో పరిశ్రమ ధరలను పెంచినట్లు" పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన వస్తువుల ధరలను మాత్రమే కంపెనీ పెంచినట్లు ఆయన తెలిపారు. మొత్తం ధరల పెంపును వినియోగదారుల మీద వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?) -
బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయాల్లోకి ‘లువీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయాల్లోకి కొత్త బ్రాండ్ ‘లువీ’ ఎంట్రీ ఇచ్చింది. యాంకర్, నటి శ్రీముఖి నేతృత్వంలో ఈ బ్రాండ్ ఏర్పాటైంది. లువీ అంటే సంస్కృతంలో అందం అని అర్థం. తొలుత పర్ఫ్యూమ్స్ను ప్రవేశపెట్టి దశలవారీగా బ్యూటీ, గ్రూమింగ్, హెయిర్ కేర్ వంటి ఉత్పత్తులను లువీ స్టోర్లలో పరిచయం చేస్తారు. 40 అంతర్జాతీయ బ్రాండ్స్‌తో కలిపి మొత్తం 80 కంపెనీల సుగంధ పరిమళాలు ఇక్కడ కొలువుదీరాయి. వీటి ధరలు రూ.299తో ప్రారంభమై రూ.7,500 వరకు ఉంది. ‘వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని కొన్నేళ్లుగా భావిస్తున్నాను. నా ఆలోచనలకు తగ్గ భాగస్వాములు దొరికారు. వారికి ఉన్న రిటైల్ అనుభవం లువీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పర్ఫ్యూమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం పల్లెల్లోనూ పెరిగింది. తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీ ద్వారా నిరుద్యోగులకు తోడ్పాటు అందించాలన్నది నా ఆలోచన’ అని లువీని ప్రమోట్ చేస్తున్న రస్గో ఇంటర్నేషనల్ డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్ శ్రీముఖి ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. తిరుపతి రావు వొజ్జా, శ్రీకాంత్ అవిర్నేని, విజయ్ అడుసుమల్లి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. తొలి ఏడాది 150 స్టోర్లు.. షాప్ ఇన్ షాప్ విధానంలో స్టోర్ల ఏర్పాటుకు లినెన్ దుస్తుల విక్రయంలో ఉన్న లినెన్ హౌజ్‌తో లువీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. లినెన్ హౌజ్‌కు చెందిన 23 దుకాణాల్లో షాప్ ఇన్ షాప్స్ ఏర్పాటు చేసింది. ఏడాదిలో 150 స్టోర్లను సొంతంగా ప్రారంభించనున్నారు. -
పర్ఫ్యూమ్స్తో జాగ్రత్త!
ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా బాగా చవగ్గా లభ్యమయ్యే సెంట్లు, ఇతర సుగంధ ద్రవ్యాలు మార్కెట్లోకి విరివిగా వస్తున్నాయి. ఈ చీప్ పర్ఫ్యూమ్స్ కారణంగా కొన్ని వ్యాధులు, సెంట్ల కారణంగా వచ్చే అలర్జీలు పెరిగాయంటున్నారు అధ్యయనవేత్తలు. పర్ఫ్యూమ్స్తో అనర్థాలివే... సెంట్స్ కారణంగా అనేక రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. అంతేకాదు... అలా సెంట్ వాసన సోకిన వెంటనే కొందరిలో మైగ్రేన్ సమస్య మొదలవుతుంది. ఇటీవల ఈ కారణంగా వచ్చే తలనొప్పులు పెరుగుతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సెంట్స్ చర్మానికి తగలడంతో పాటు, వాటి వాసన వ్యాప్తిచెందడం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వస్తున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్బరీ కెంట్ ఛాసర్ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ పేర్కొన్నారు. ఇలా ఉపయోగించామో లేదు... వెంటనే అలా అలర్జీకి కారణమయ్యే అలర్జెన్ల తాలూకు జాబితాను రూపొందించేందుకు యూరోపియన్ యూనియన్ సైంటిఫిక్ కమిటీ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఘాటైన సువాసనలు వెదజల్లే అనేక సుగంధ ద్రవ్యాలు చోటు చేసుకున్నాయి. మంచి వాసనలను వెదజల్లే వస్తువులు ఉదాహరణకు... కొన్ని ఘాటైన వాసనలు వెదజల్లే సబ్బులు, షాపూలు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు తేలింది. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు.వారి చర్మ ఆరోగ్యం గురించి డర్మటాలజిస్టు నిపుణులు చెప్పే మాటలిలా ఉన్నాయి. ‘కొందరు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ వంటివి జల్లుకుంటారు. అలా మన ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఘాటైన వాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కంటే... ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికిన ఫ్రెష్ అండర్ గార్మెంట్స్ తొడుక్కోవడమే ఆరోగ్యకరం’ అన్నది డర్మటాలజిస్టుల సలహా. -
మహిళల డియోలకు మార్కెట్లో పెరిగిన డిమాండ్
-
టచ్ రచ్చ
కవర్ చెయ్యాల్సిన బట్టలే కేక పెట్టిస్తే? అందం తెచ్చేవే.. అల్లాడిస్తే?! ఇక ఏం వేసుకుంటాం? ఏం పూసుకుంటాం? అన్నీ స్కిన్‌కి ప్రాబ్లమే. ఎలర్జీ... అమ్మో... టచ్ చేస్తే రచ్చ చేసే స్కిన్ ఎలర్జీలు ఇవి! మనం రోజూ వాడే వస్తువులే కొందరికి ఏ మాత్రం సరిపడకుండా చర్మానికి చేటు తెస్తుంటాయి. మనకు సరిపడని వస్తువు తెచ్చే అనర్థాన్ని అలర్జీలుగా పేర్కొంటాం. తినడం ద్వారా వచ్చే అలర్జీలను పక్కన పెడితే... ఇక్కడ చెప్పుకునేవన్నీ చర్మాన్ని ఏదో అంటుకోవడం వల్ల వచ్చే అలర్జీలు. ఇలా వచ్చే సమస్యను ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అంటారు. వీటిలో కొన్ని చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి. ఆందోళన కలిగిస్తాయి. అలాంటి కొన్ని అలర్జీల గురించి తెలుసుకొంటే, వాటితో బాధపడేవారు, దాన్ని పెద్ద సమస్యగా పరిగణించకుండా... అవగాహన పెంచుకొని, తగిన చికిత్స తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. రకరకాల డర్మటైటిస్లు (చర్మ అలర్జీలు) సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్స్‌తో కొందరిలో సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా అలర్జీలు వస్తుంటాయి.గాజులు, గొలుసులు, ఆభరణాలతో : తయారైన పదార్థాన్ని బట్టి కొందరు మహిళలకు గాజులు కూడా సరిపడవు. అవి అంటి ఉండే ప్రాంతం సాధారణంగా మణికట్టు. కానీ అది గాజు కావడంతో... మణికట్టు నుంచి ముంజేతి వరకూ కదులుతూ ఉండటం వల్ల ఆ మొత్తం ప్రాంతం ప్రభావితమవుతుంది. అలాగే మెడలో వేసుకొనే గొలుసులు, చైన్లు, నెక్లేస్లతోనూ ఇదే ప్రభావం ఉంటుంది. కొందరిలో ఇయర్ రింగ్స్‌కు ఉపయోగించే లోహం కారణంగానో డర్మటైటిస్ వస్తుంటుంది. వృత్తులతో : మన వృత్తుల్లో ఉపయోగించే రకరకాల పదార్థాలతో అలర్జీలతో తమ జీవనోపాధి సైతం ప్రభావితమయ్యేలా సమస్య రావచ్చు. ఉదాహరణకు సిమెంట్, పెయింట్స్ వంటి వాటిలో ఉండే రసాయనాలతో ఒంటికి అలర్జీ ఏర్పడితే ఆ వ్యక్తి ఆరోగ్య జీవితమే గాక... కుటుంబ సభ్యుల ఆర్థిక జీవనమూ ప్రభావితమవుతుంది. అలాగే కొందరికి ఫొటోగ్రాఫిక్ రసాయాలు, వారి వృత్తిలో భాగంగా ఉపయోగించే పదార్థాలతోనూ రావచ్చు. ఇక లోహాలతో నికెల్‌తో చేసిన ఉత్పాదనలు హెయిర్డ్రస్సింగ్, నర్సింగ్, కేటరింగ్, నికెల్ ప్లేటింగ్, వస్త్ర పరిశ్రమలో ఎక్కువ. కాబట్టి ఈ లోహపు ఉత్పాదనలతో వ్యవహరించే వృత్తుల్లో ఉన్నవారికి ‘నికెల్ డర్మటైటిస్’ ఎక్కువ. రైతులకు : కొందరు రైతులకు తాము ఉపయోగించే ఎరువులు, పురుగుమందులలోని రసాయనాలతో అలర్జీలు వస్తే అది కూడా వారి జీవితాన్ని దుర్భరం చేస్తుంది. సౌందర్య సాధనాలతో : ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. కొందరికి బొట్టుబిళ్లలతో అలర్జీ రావడం కనిపిస్తుంది. దీనికి కారణం బొట్టు బిళ్ల వెనక అంటించేందుకు ఉపయోగించే గమ్‌లోని రసాయనం సరిపడకపోవచ్చు. చాలామందిలో హెయిర్‌డై సరిపడదు. దానిలో ఉండే పారాఫినైల్యెనిడయామైన్ వంటి రసాయనాలు అటు వాసన పరంగానూ, ఇటు తమ స్వభావపరంగానూ చాలా ఘాటుగా ఉండటమే కారణం. కొందరిలో షేవింగ్ క్రీమ్స్, షేవింగ్ లోషన్స్లోని రసాయనాల వల్ల చెంపలు, గదమ (చుబుకం) దెబ్బతింటాయి. సౌందర్యసాధానాలలోని రెసార్సిన్, బాల్సమ్ ఆఫ్ పెరూ, పర్ఫ్యూమ్స్లో వాడే రసాయనాలు, వాటిలో స్వల్పంగా ఉండిపోయే తారు వంటి పెట్రోలియమ్ వ్యర్థాలతో అలర్జీ కలిగి కాంటాక్ట్ డర్మటైటిస్ వస్తుంటుంది. కంటి సౌందర్యసాధనాలతో : కొందరికి ఐ–షాడోస్, మస్కారా వంటి వాటితో అలర్జీలు వస్తాయి. ఇక కంటికి ఉపయోగించే మందులైన నియోమైసిన్, క్లోరాంఫెనికాల్, సల్ఫోనమైడ్స్తో పాటు అవి దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి ఉపయోగించే పారాబెన్స్ వంటి సరాయనాలు కనురెప్పకు అలర్జీ కలిగించి ‘ఐలిడ్ డర్మటైటిస్’కు దారితీయవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, వంటింటి దినుసులతో : వెల్లుల్లి రెబ్బలు ఒలుస్తుండటం, ఉల్లి తగలడం వంటివి జరిగినప్పుడు కూడా అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా వెల్లుల్లి ఒలిచే వారిలో గోరు మూలం లేదా వేలికీ, గోటికీ మధ్యనున్న చర్మం త్వరగా ప్రభావితమై మంట రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. వెల్లుల్లి లేదా ఉల్లిలోని అలిసిన్ అనే రసాయనం సరిపడకపోవడమే ఇందుకు కారణం. కొన్ని కూరగాయలు కోస్తున్నప్పుడు లేదా వాటిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు సరిపడకపోవడంతో వచ్చే అలర్జీలను అందరికీ తెలిసే సాధారణ పరిభాషలో ‘వెజిటబుల్ డర్మటైటిస్’ అంటారు. లక్షణాలు ఎగ్జిమాగా పేర్కొనే అలర్జీలు దురదతో కనిపిస్తాయి. కొన్ని అలర్జీతో ప్రభావితమైన ప్రాంతం నుంచి నీళ్లలా స్రవిస్తుండటం, ఆకృతిలో చర్మం పగుళ్లు బారడం, పొట్టు రాలుతున్నట్లుగా ఉండటం, గాయం విస్తరిస్తుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలికంగా ఉండే అలర్జీలలో అర్టికేరియా (చర్మంపై ర్యాష్‌లా) వస్తుంది. ఆ ప్రాంతంలో చర్మం రంగు కూడా మారవచ్చు. ఇవన్నీ అలర్జిక్ రియాక్షన్ తీవ్రతను బట్టి ఉంటాయి. కాంటాక్ట్ డర్మటైటిస్లోని లక్షణాలు అన్నీ ఒకేలా ఉండవు. తీవ్రతను బట్టి, అలర్జీ కలిగించే పదార్థాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. ప్రభావితమైన చర్మం ప్రాంతంలో కొందరికి ఏదో కుట్టిన ఫీలింగ్ ఉంటుంది. మరికొందరికి దురద, తరచూ నొప్పి ఉంటాయి. ఇక చర్మంపై ఏర్పడే మచ్చలు ఎర్రబారడం మొదలుకొని చిన్న పగుళ్లు, గుల్లలు, దద్దుర్లు, తీవ్రమైన గాయాల్లా కనిపించే పగుళ్ల వరకు కనిపిస్తాయి. మరికొందరిలో చర్మం కాలినట్లుగా కావచ్చు. నివారణ మనకు ఏదైనా అలర్జిక్ రియాక్షన్ కనిపించగానే దానికి నిర్దిష్టంగా ఫలానా వస్తువు వల్లనే అనే నిర్ధారణకు వచ్చేయడం సరికాదు. చాలా సునిశితంగా కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం రోగి ఇంటి దగ్గర ఉపయోగించే వస్తువుల జాబితాను డాక్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది. అలర్జీకి గురైన వ్యక్తి పనిచేసే చోట ఉన్న వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఉపయోగించే సౌందర్యసాధనాలు, రెజిన్ ఉత్పాదనల గురించి ఆరాతీయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు... మనకు ఏ పదార్థంతో అలర్జీ వస్తుందో దాని నుంచి దూరంగా ఉండటం అన్నిటికంటే ఉత్తమమైన ప్రక్రియ. ఉదాహరణకు డిటర్జెంట్స్‌తో అలర్జీ ఉన్నప్పుడు చేతులు కేవలం నీళ్లతో మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ దాని అవసరం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలతో దాన్ని వాడాలి. ఉదాహరణకు హెయిర్–డై తో చేతులకు అలర్జీ వస్తుంటే మంచి గ్లౌస్ ధరించి దాన్ని వాడుకోవాలి. ఇలా అవసరాన్ని బట్టి మనం తగిన మెళకువలను అనుసరిస్తూ ఈ సమస్యను అధిగమించాలి. సమస్య వచ్చిన చోట తక్కువ మోతాదులో లేదా ఓ మోస్తరు మోతాదులో (మైల్డ్–మాడరేట్) కార్టికోస్టెరాయిడ్ ఉన్న మోమ్యాటోసోన్ ఫ్యూరోయేట్ వంటి క్రీమ్స్ రాస్తుండాలి. అయితే దీని మోతాదును కేవలం చర్మవైద్య నిపుణుల సిఫార్సు మేరకే వాడాలి. చేతులకు డర్మటైటిస్ వచ్చినప్పుడు నాన్–పర్ఫ్యూమ్ హ్యాండ్ క్రీమ్ వాడవచ్చు. చేతులను శుభ్రపరచడానికి చర్మాన్ని పొడిబార్చని మైల్డ్ సోప్ వాడటం మేలు. తీవ్రమైన, శక్తిమంతమైన డిటర్జెంట్లు వాడటం మానేస్తే మంచిది. మనకు సరిపడని వస్తువులతో పనిచేయాల్సి వచ్చినప్పుడు డబుల్ గ్లౌజ్ వేసుకోవడం ఒక మంచి నివారణ ప్రక్రియ. షాంపూ, హెయిర్ డై వంటివి ఉపయోగించే సమయంలోనూ డబుల్ గ్లౌజ్ వాడటం మంచిదే. హెయిర్ ఆయిల్స్, స్టైలింగ్ జెల్స్ వంటివి రాసుకునేప్పుడు నేరుగా ఉత్తిచేతులతోనే రాసుకోవడం అంత సరికాదు. బత్తాయిలు, నారింజపండ్లు ఒలుస్తున్నప్పుడు, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటి పొట్టు తీసుకున్నప్పుడు అది మనకు సరిపడకపోతే చాలాసేపు ఆ పనిని చేయడం సరికాదు. చికిత్స లక్షణాలను, వాటి తీవ్రతను బట్టి దాన్ని తగ్గించే చికిత్స అందించాల్సి ఉంటుంది. స్థూలంగా అలర్జీ వస్తువుల నుంచి దూరంగా ఉండటం, స్టెరాయిడ్స్, లక్షణాలను బట్టి చికిత్స అనే మూడు అంశాల మీదే ఈ సమస్యకు చికిత్స ఉంటుంది. తక్షణం కనిపించే డర్మటైటిస్లకు క్రీములు, దీర్ఘకాలిక సమస్యలకు ఆయింట్మెంట్స్ ఉపయోగించాల్సి రావచ్చు. మందుల ఎంపిక ప్రక్రియలో అలర్జీ ఏ మేరకు వచ్చిందన్న అంశంతో పాటు, ఏ ప్రదేశంలో వచ్చింది, తీవ్రత ఎంత అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తీవ్రతను బట్టి కొన్నిసార్లు ఒకింత ఆధునిక చికిత్సలైన పూవా, గ్రెంజ్ రేస్, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్, కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్‌ను కూడా డాక్టర్లు వాడుతుంటారు. డాక్టర్ స్వప్న ప్రియ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ మెటల్ అలర్జీలు బటన్స్, నాణేలు, బకిల్స్ వంటి వాటితో : మన జేబులో ఉండే చిల్లర నాణేలతో కూడా కొందరికి అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి ప్యాంట్ బటన్ / బెల్ట్ బకిల్‌లో ఉండే నికెల్ లోహం తాకి ఉండే పొట్ట భాగంలోనూ అలర్జీ రావచ్చు. అది బటన్ / బెల్ట్బకిల్ ఒరుసుకుపోవడం వల్ల వచ్చే సమస్యగా భావిస్తారు. కానీ సాధారణంగా నాణేలు లేదా బటన్స్ లేదా బకిల్‌లో ఉండే నికెల్ లోహం వల్ల ఆ అలర్జీ వస్తుంది. ఈ లోహం ఉండే రిస్ట్‌వాచీలు, కళ్లజోళ్ల ఫ్రేమ్లతోనూ అవి తగిలే ప్రాంతంలో డర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని లోహాలతో పోలిస్తే కాంటాక్ట్ డర్మటైటిస్‌ను ప్రేరేపించే శక్తి నికెల్ లోహానికి చాలా ఎక్కువ. మహిళలు చెవి కమ్మలు, చెవి దుద్దులు, ఇతర ఇయర్ రింగ్స్ ధరిస్తారు కాబట్టి పురుషులతో పోలిస్తే ‘నికెల్ డర్మటైటిస్’ ప్రమాదం వారికే ఎక్కువ. క్రోమియం లోహంతో : మన భూమి ఉపరితలం (క్రస్ట్)లో అత్యధికంగా లభ్యమయ్యే లోహాలలో అత్యంత ముఖ్యమైనది క్రోమియం. సాధారణంగా ఏదైనా సరిపడకపోవడం వల్ల కనిపించే డర్మటైటిస్లలో ‘క్రోమియం సెన్సిటివిటీ’ కేసులు ప్రపంచవ్యాప్తంగా 6 శాతం ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం వాడే డిటర్జెంట్స్, బ్లీచింగ్ ఏజెంట్లు, షేవింగ్ క్రీములు, షేవింగ్ లోషన్లలో క్రోమియం ఎక్కువ. కొన్ని చర్మపు ఉత్పాదనల (ముఖ్యంగా షూస్) ప్రాసెసింగ్‌లో దీన్ని వాడతారు. అలాగే పసుపుపచ్చ, నారింజ రంగులో ఉండే ఇంటి పెయింట్స్‌లో, ప్రింటింగ్ పరిశ్రమలో, ఫొటోగ్రఫీలో, ఏదైనా లోహం తుప్పు పట్టకుండా వాడేందుకు ఉపయోగించే పూతల్లో (యాంటీ రస్టింగ్ ఏజెంట్స్)లో క్రోమియం ఎక్కువ. పై ఉత్పాదనలను వాడే వారు తమకు ఏదైనా సమస్య వస్తే అది క్రోమియంతో కావచ్చని భావించి జాగ్రత్తగా ఉండాలి. కోబాల్ట్ లోహంతో : దీన్ని సాధారణంగా నికెల్‌తో కలిపి తయారు చేసే చాలా ఉత్పాదనల్లో ఉపయోగిస్తారు. లోహాలన్నింటిలో నికెల్ చాలా ఎక్కువగా అలర్జీలను కలగజేస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే నికెల్‌తో పాటు కోబాల్ట్ కలిసే ఉత్పాదనలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోబాల్ట్ కారణంగా హెయిర్ డైలు ఉపయోగించేవారిలో, చాలా కఠినమైన లోహాలతో తయారయ్యే డ్రిల్లింగ్ టూల్స్ ఉపయోగించేవారిలో, సెరామిక్ పరిశ్రమలోని వారిలో, గ్లాస్, మెటల్ అల్లాయ్స్, పింగాణీ వంటి పాత్రల తయారీ రంగాలలో ఉన్నవారికి అలర్జీలు వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. అల్యూమినియంతో : ఈ లోహం చాలావరకు సురక్షితం. అయితే కొన్ని సందర్భాల్లో అల్యూమినియం ఉన్న కొన్ని పూత మందులు వాడినప్పుడు చాలా అరుదుగా డర్మటైటిస్ రావచ్చు. పాదరసంతో : ఇది జింక్, తగరం, వంటి లోహాలతో ఎక్కువగా కలుస్తుంది. ఆ ఉత్పాదనలను పంటికి వేసే సిమెంట్ తయారీలో ఉపయోగిస్తారు. అది కొందరికి అలర్జీక్ రియాక్షన్‌ను కలిగించవచ్చు. బంగారంతో : ఈ లోహం చాలా మందికి ప్రియమైనది. దాదాపు ఆభరణాల్లో చాలావరకు దీనితోనే తయారవుతాయి. దీనితో వచ్చే అలర్జిక్ రియాక్షన్ చాలా అరుదే అయినా... కొందరిలో బంగారం కూడా అలర్జీక్ రియాక్షన్‌ను కలిగించవచ్చు. ఆభరణాలతో పాటు దీన్ని పంటిపైన వాడే తొడుగులు (క్రౌన్స్), డెంటల్ ఫిల్లింగులు, దంత చికిత్సలో వాడే చాలా వస్తువుల్లో కూడా బంగారాన్ని వాడుతుంటారు. వాటి వల్ల కొందరిలో అలర్జిక్ రియాక్షన్ కనిపిస్తుండవచ్చు. ఇక్కడ పైర్కొన్న లోహాలతో పాటు ప్లాటినమ్, జింక్, రాగి వంటి వాటితోనూ కొన్ని సందర్భాల్లో అలర్జీలు కనిపిస్తాయి. రబ్బర్ డర్మటైటిస్ : మనం వాడే చాలా ఉత్పాదనల్లో రబ్బర్ ఉంటుంది. చేతి తొడుగులు (గ్లౌవ్స్), షూస్, మాస్కులు, స్లిప్పర్లు ఇంకా ఎన్నెన్నో రబ్బర్‌తో తయారవుతాయి. రబ్బర్‌తో అలర్జీ ఉన్నప్పుడు సాధారణంగా చర్మం ఎర్రబారడం మొదలుకొని చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్ మొదలుకొని తీవ్రంగా పగుళ్ల వరకు ఈ అలర్జిక్ రియాక్షన్ తీవ్రత ఉంటుంది. రబ్బర్‌తో వచ్చే రియాక్షన్లో చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం వంటి లక్షణాన్ని గమనించనప్పుడు అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్ రబ్బర్ హ్యాండ్ / ఫీట్’ అని వ్యవహరిస్తారు.