ప్రమాదకర స్థాయిలో ‘రోడ్‌రేజ్’ అసహనం
గంటలకొద్దీ రోడ్లపై నిలిచిపోతున్న వాహనాలు
యథేచ్ఛగా రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘన
ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్న వైనం
సాక్షి, హైదరాబాద్: ఉన్నట్టుండి నడిరోడ్డుపై వాహనాలు స్తంభించిపోతాయి. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులకు అసలు ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి పరిస్థితికి చాలా సందర్భాల్లో కారణం ఒకటే ఉంటుంది. అదే రోడ్‌రేజ్. వేగంగా వస్తూ అదుపుతప్పి ఎదురుగా వచ్చే వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టడం.. దీంతో తగ్గేదేలె... అన్నట్టుగా ఇరువాహనాల చోదకులు ఢీ అంటే ఢీ అనే లెవల్లో ఘర్షణ పడుతుంటారు. తప్పు తమది కాదంటే తమది కాదంటూ తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు.
తీవ్రమైన ఆగ్రహావేశాలకు గురవుతుంటారు. ఆకస్మికంగా తలెత్తే ఈ కోపం తరచూ భౌతికదాడులకు దారితీస్తోంది. ఫలితంగా ఇతర వాహనదారుల సమయం గంటలకొద్దీ ట్రాఫిక్‌లోనే హరించిపోతుంది. ఈ రోడ్‌రేజ్ ఘటనలు గ్రేటర్‌లో ప్రతిరోజు వందలకొద్దీ చోటుచేసుకుంటున్నాయి. రవాణాశాఖ అంచనాల ప్రకారం... రోడ్డు ప్రమాదాలకు అధిక వేగం, ర్యాష్ డ్రైవింగ్, రోడ్‌రేజ్‌లే కారణాలు. నగరంలో రోజుకు 20 ప్రమాదాలు చోటుచేసుకొంటే వాటిలో కనీసం ఏడు ర్యాష్ డ్రైవింగ్, రోడ్‌రేజ్ కారణాలని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఈగో దెబ్బతినడమే కారణమా...
👉 వారం రోజుల క్రితం సికింద్రాబాద్– అమీర్‌పేట్ రహదారిలోని ఫ్లై ఓవర్‌పై ఓ కారు వేగాన్ని నియంత్రించే క్రమంలో ముందున్న ఆటోరిక్షాను తాకింది. ఈ ఉదంతంలో దానికి ఎలాంటి నష్టం జరగకపోయినా సదరు ఆటోవాలా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు, కారు నడిపే వ్యక్తిని అసభ్యంగా దూషించాడు. కారు యజమాని సైతం అదేస్థాయిలో ఆటోవాలాపై విరుచుకుపడ్డాడు. ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనాన్ని అదుపు చేసే క్రమంలో స్వల్పంగా తాకిందని కారు యజమాని వివరణ ఇచ్చాడు. ఖరీదైన కారు ఉన్న తాను ఆటోవాలాకు సారీ చెప్పడమేమిటని భావించాడు. కానీ, అతడు క్షమాపణ చెప్పకపోవడంతో ఆటోవాలా ఈగో దెబ్బతిన్నది. ఈ ఘర్షణ చినికి చినికి గాలివానగా మారడంతో వాహనాలు స్తంభించాయి. చివరకు ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకోవలసి వచి్చంది.
👉ఏడాది క్రితం అత్తాపూర్‌లో ఒక క్యాబ్‌వాలాపై కూడా రోడ్‌రేజ్ దాడి జరిగింది. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు క్యాబ్‌ను ఢీకొట్టబోయి త్రుటిలో నిలిచిపోయింది. ఆ క్షణంలో తీవ్రమైన భయాందోళనకు గురైన క్యాబ్‌డ్రైవర్ వారితో గొడవకు దిగాడు. కారులో ఉన్నవాళ్లు సైతం తాము వాహనాన్ని కాస్త దూరంగానే ఆపామని, ఢీకొట్టలేదని వాదనకు దిగారు. క్యాబ్‌వాలా వెనక్కి తగ్గకపోవడంతో కారులోఉన్నవారు అతనిపై దాడి చేసి పరారయ్యారు.
👉 ఈవిధంగా నగరంలో ఎక్కడో ఒక చోట రోడ్‌రేజ్ ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ పోలీసు రికార్డుల్లో పెద్దగా నమోదు కావడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. కేవలం సర్దుబాటుతో సద్దుమణిగే దానికి కూడా ఆకస్మిక కోపానికి గురికావడం ఆందోళనకరంగా మారుతోంది.
ప్రాణాలు హరిస్తున్నారు..
ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపైన నమోదయ్యే కేసుల్లో రోడ్‌రేజ్ కచి్చతంగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం అల్వాల్ శ్రీనివాస్‌నగర్ కాలనీలో ఒక ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై దీపక్ అనే వ్యక్తి వెళ్తున్నాడు. అదేమార్గంలో జి.ఆంజనేయులు అనే ఓ పెద్దాయన రోడ్డుదాటుతున్నాడు. కానీ, ఆకస్మికంగా తనముందు నుంచి బండి వేగంగా దూసుకెళ్లడంతో భయాందోళనకు గురయ్యాడు. వాహనదారుడిపైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పిదాన్ని గ్రహించి క్షమాపణ చెప్పి వెళ్లాల్సిన దీపక్ సీనియన్ సిటీజన్‌తో ఘర్షణకు దిగడమే కాకుండా కిందకు తోసివేయడంతో తలకు బలమైన గాయమైంది. రెండు వారాలపాటు చికిత్స తీసుకున్నా ఫలితం దక్కలేదు. చివరకు ఆ పెద్దాయన కన్నుమూశాడు. ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ రోడ్‌రేజ్‌లో భాగమే..
👉 వేగంగా వాహనం నడుపుతూ ఇతర వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురిచేయడం
👉 అదేపనిగా హారన్ మోగించడం
👉 ర్యాష్ డ్రైవింగ్..
👉 హిట్ అండ్ రన్
👉 రహదారిభద్రత నిబంధనల మేరకు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. కానీ,
రోడ్‌రేజ్‌పై ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment