భువనగిరిలో ‘రియల్‌ దందా’.. 700 కోట్ల​ అక్రమాలు! | Real Estate Fraud In Yadadri Bhuvanagiri District | Sakshi
Sakshi News home page

భువనగిరిలో ‘రియల్‌ దందా’.. 700 కోట్ల​ అక్రమాలు!

Published Thu, Apr 1 2021 2:33 AM | Last Updated on Thu, Apr 1 2021 6:09 AM

Real Estate Fraud In Yadadri Bhuvanagiri District - Sakshi

హైదరాబాద్‌: యాదాద్రికి సమీపంలో భారీ రియల్‌ దందా బయటపడింది. యాదాద్రి, భువనగిరి చుట్టుపక్కల భూముల కొనుగోళ్లలో రెండు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల మధ్య గత ఆరేళ్లలో రూ.700 కోట్ల విలువైన లెక్కల్లో చూపని అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాల్లో అధికారులు గుర్తించారు. యాదగిరిగుట్టతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సంస్థలు వెంచర్లతో పాటు అపార్ట్‌మెంట్లను నిర్మిస్తుంటాయి. యాదగిరిగుట్ట, హైదరాబాద్‌ నగర శివారులో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో అనేక డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి కీలక సమాచారం సేకరించారు. భూముల కొనుగోళ్లలో అనేక అక్రమాలు జరిగాయని గుర్తించారు.

ఈ సోదాల సందర్భంగా లెక్కలు చూపని రూ.11.88 కోట్ల నగదు, రూ.1.93 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన ఆరేళ్లలో లెక్కలు చూపకుండా (నల్లదనం) సాగించిన లావాదేవీలకు సంబంధించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసిన విలువ కంటే ఎక్కువ నగదు స్వీకరించి, ఆ నగదును భూముల కొనుగోలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. 

కలకలం రేపిన సోదాలు.. 
మార్చి 23, 24వ తేదీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట పరిసరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న పలు సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ సోదాలు జరిపిన కంపెనీల్లో హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న స్పెక్ట్రా, సన్‌సిటీ సంస్థలు ఉన్నాయి. స్పెక్ట్రా సంస్థ చైర్మన్‌ జగన్, సన్‌సిటీ సంస్థ చైర్మన్‌ నారాయణగౌడ్‌ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రాలో కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న కాంగ్రెస్‌ ఆలేరు ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ఇంటిపై మార్చి 23, 24 తేదీల్లో అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ 2 సంస్థల మధ్య జరిగిన దాదాపు రూ.700 కోట్ల మేర లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. 

ఎవరీ బీర్ల ఐలయ్య.. 
యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన బీర్ల అయిలయ్య రాజకీయంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆలేరు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కొంతకాలంగా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో భూములు కొంటూ.. అమ్ముతూ వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు. గతంలో సైదాపురం సర్పంచ్‌గా, పాల సంఘం చైర్మన్‌గా, యాదగిరిగుట్ట పట్టణంలో ఎంపీటీసీగా కొనసాగారు. ఈ క్రమంలోనే కొందరు భాగస్వామ్యంతో యాదగిరిగుట్ట మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లో భూములు కొనుగోలు చేయడం, అమ్మడం చేసేవారు. హైదరాబాద్‌కు చెందిన స్ప్రెక్టా రియల్‌ ఎస్టెట్‌ కంపెనీతో పరిచయం పెంచుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. బీర్ల అయిలయ్య రాజకీయంగా చురుగ్గా ఉండటమే కాకుండా, పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement