ఆర్‌జీఐలో రికార్డు స్థాయిలో ప్రయాణికుల రద్దీ
మిగిలిన మెట్రో నగరాలన్నింటికన్నా మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి సంబంధించి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (ఆర్‌జీఐ) అగ్రగామిగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా డేటా వెల్లడించిన విశేషాలివే...
మన తర్వాతే బెంగళూరు
మునుపటి ఏడాదితో పోలిస్తే గత ఏప్రిల్–సెప్టెంబర్‌లో భారతదేశంలోని మొదటి ఐదు మెట్రోలలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యధిక వృద్ధిని సాధించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మన ఎయిర్‌పోర్ట్‌లో 11.7 శాతం పెరుగుదల నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న బెంగళూరు (10.1), కోల్‌కతా (9.4), ఢిల్లీ (7.4), ముంబై (5.4), చెన్నై 3.3 శాతం రద్దీని పెంచుకున్నాయి.
దేశ విదేశీ ప్రయాణికుల రద్దీతో...
ప్రస్తుతం 72 దేశీయ, 18 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతున్న శంషాబాద్ విమానాశ్రయం అమెరికా, యూకేలకు దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తోంది.
గత అక్టోబర్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 25 లక్షల మంది ప్రయాణికుల తాకిడి చవిచూసింది..ఆ నెలలో రద్దీ 22 శాతం పెరిగింది. దేశీయ అంతర్జాతీయ ప్రయాణాల్లోనూ ఈ వృద్ధి కనిపించింది. దేశీయ ప్రయాణికుల రద్దీ సంవత్సరానికి 22.7 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్ 16.3 శాతం వరకూ పెరిగింది.
ఒక్కరోజే...87 వేలతో రికార్డు
గత అక్టోబర్ 14న ఒక్కరోజే 87,000 మంది ప్రయాణికుల రాకతో శంషాబాద్ విమానాశ్రయం సరికొత్త రికార్డు సృష్టించింది. అదే నెలలో 17,553 విమానాల రాకపోకలు జరిగాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 19 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. గత 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ 80 లక్షలు ఉండగా 2024లో 2.5 కోట్లకు నాలుగు రెట్లు పెరిగింది అంటే.. ఈ వృద్ధి రేటు 45 శాతం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment