సింగరేణిలో బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ  | Regularization of Transfer Workers in Singareni | Sakshi
Sakshi News home page

సింగరేణిలో బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ 

Published Sun, Oct 1 2023 3:33 AM | Last Updated on Sun, Oct 1 2023 3:33 AM

Regularization of Transfer Workers in Singareni - Sakshi

గోదావరిఖని/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:   సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న 2,266 మంది కార్మికులను జనరల్‌ మజ్దూర్లుగా క్రమబద్ధికరిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఏడాదిలో భూగర్భగనుల్లో 190 మస్టర్లు, ఉపరితలంలో 240 మస్టర్లు పనిచేసిన బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్లుగా రెగ్యులరైజ్‌ చేశారు. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు డైరెక్టర్‌ ఎన్‌.బలరాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

2023 సెపె్టంబర్‌ 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. తొలిసారి 2017 అక్టోబర్‌లో ఒకేసారి 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినట్లు ఆయన తెలిపారు. 2022 డిసెంబర్‌ 31వ తేదీకి ముందు సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరినవారిలో కనీసం 190/240 మస్టర్ల అర్హత కలిగిన వారిని ఇప్పుడు జనరల్‌ మజ్దూర్లుగా రెగ్యులరైజ్‌ చేసినట్లు వెల్లడించారు. 2017 నుంచి ఇప్పటివరకు 13,981 మందిని రెగ్యులరైజ్‌ చేసినట్లు వివరించారు.  

ఏరియాల వారీగా ఇలా..  
జనరల్‌ మజ్దూర్లుగా క్రమబద్ధికరణ అయినవారిలో ఏరియాల వారీగా పరిశీలిస్తే.. శ్రీరాంపూర్‌లో 677 మంది, ఆర్జీ–1లో 522, ఆర్జీ–2లో 51, ఆర్జీ–3, అడ్రియాలలో 323, భూపాలపల్లిలో 274, మందమర్రిలో 261, మణుగూరులో 79, బెల్లంపల్లిలో 32, ఇల్లెందు, కార్పొరేట్‌లో 38, కొత్త్తగూడెంలో 9 మందిని రెగ్యులరైజ్‌ చేశారు. 

సీఎం కేసీఆర్‌ హామీ మేరకు గతంలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు జనరల్‌ మజ్దూర్లుగా గుర్తింపు రావడానికి కనీస మస్టర్లు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల మేరకు 2017 నుంచి ఎప్పటికప్పుడు బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు.  

పనిచేసే వారికి గుర్తింపు 
సింగరేణిలో బాగా పనిచేసే వారికి ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుంది. గతంలో జనరల్‌ మజ్దూర్లుగా ఎంపికైన అనేక మంది మరింత శ్రద్ధగా పనిచేస్తూ కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్‌ పరీక్షల్లో పాల్గొని పదోన్నతులు సాధించారు. ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ ఉన్నతితో పాటు మంచి లాభాలు, ఇన్సెంటివ్‌లు అందుకోవాలి.      – ఎన్‌ బలరామ్, డైరెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement