సాక్షి, హైదరాబాద్: వీకెండ్ అంటే ఐటీ హబ్‌లో పండగ వాతావరణం ఉంటుంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పబ్‌లు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. వచ్చే వీకెండ్‌లో జులై 2, 3న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆంక్షలు ఉండనున్నాయి. దీంతో రెస్టారెంట్లు, పబ్‌లు, మాల్స్‌లకు వచ్చే కస్టమర్లను నియంత్రించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హెచ్‌ఐసీసీ, నోవా టెల్‌తో పాటు నగరంలో 50కి పైగా స్టార్ హోటల్స్‌లో బస చేయనున్నారు. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
నోవాటెల్ చుట్టూ బలగాల గస్తీ
తొలిసారిగా గ్రేటర్‌లో రెండు రోజుల పాటు ప్రధాని ఉండనున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 2న సమావేశం జరగనున్న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ, పలువురు కేంద్ర మంత్రులు బస చేయనున్న నోవాటెల్ హోటల్ చుట్టూ పోలీసు బలగాలు గస్తీ కాయనున్నాయి. రెండు రోజుల పాటు సైబర్ టవర్స్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను, వాటి పరిస్థితులను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సమావేశం జరిగే హెచ్‌ఐసీసీలో అతిథుల వాహనాల కోసం 3 ప్రాంతాలలో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 500 నుంచి 600 కార్లు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది. రెండు రోజుల పాటు 500 మంది ట్రాఫిక్ పోలీసులు విధులలో పాల్గొంటారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
(చదవండి: సీఎం పీఠంకోసం కుమ్ములాట)
Comments
Please login to add a commentAdd a comment