సాక్షి, హైదరాబాద్: శివరాత్రి తర్వాత చలి తగ్గుముఖం పడుతుందని అంటారు. ఆ విధంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు చలి ఉండాలి. కానీ ఈ ఏడాది అప్పుడే తగ్గినట్టుగా కన్పిస్తోంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుండడంతో గాలులు వీస్తున్నప్పటికీ చలి ప్రభావం పెద్దగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పగటి పూట భానుడు భగభగమంటున్నాడు. దీంతో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తు తం చాలా చోట్ల 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే నమోదవుతుండగా... కొన్నిచోట్ల మాత్రం వేసవి కాలం ప్రారంభంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల మాదిరి 34 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అయితే రాత్రి వేళ మాత్రం చలితో తక్కువ ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి.
పడుతూ లేస్తూ..
రాష్ట్రంలో సగటున 30 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత వారం రోజుల నుంచి మహబూబ్‌నగర్, మెదక్, అదిలాబాద్, భద్రాచలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీల మధ్యనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో వరసగా 32, 30, 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు మాతమే నమోదు కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల నుంచి 17 డిగ్రీల మధ్యన నమోదవుతుండగా మంగళవారం మాత్రం అదిలాబాద్‌లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నల్గొండ, దుండిగల్‌లో ఉన్న వాతావరణ శాఖ అబ్జర్వేషన్ కేంద్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలలో చలి ప్రభావం ఉంటుందని, పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు కాదని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకట్రెండు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించినప్పటికీ తర్వాత తగ్గడం, మళ్లీ పెరగడం కనిపిస్తుందని వాతావరణ శాఖాధికారి నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు.
నెలాఖరులో అంచనాలు...
వేసవి కాలంలో ఉష్ణోగ్రతల తీరుపై వాతావరణశాఖ ముందస్తు అంచనాలు రూపొందిస్తుంది. ఈ ఏడాది ఎండలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని అధికారులు చెబుతున్నప్పటికీ, అంచనాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరి నెలాఖరులోగా ఉష్ణోగ్రతల అంచనాలను వెలువరించేందుకు వాతావరణ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ అంచనాలను బట్టే పలు ప్రభుత్వ శాఖలు తమ కార్యాచరణ రూపొందించుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment