రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో విస్తారంగా వర్షాలు
పరవళ్లు తొక్కుతున్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, కడెం ఉప నదులు
గోదావరిలో గంటగంటకూ పెరుగుతున్న ప్రవాహం
ఎల్లంపల్లికి పెరిగిన వరద.. మేడిగడ్డ బరాజ్‌కు 5.52లక్షల క్యూసెక్కులకుపైగా రాక
భద్రాచలం వద్ద 43 అడుగులు దాటిన నీటిమట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: గోదావరి పోటెత్తుతోంది. క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలతోపాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో.. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని, శబరి, కడెం ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ నీరంతా చేరుతూ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవాహాలు పెరుగుతున్నాయి.
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. గత ఏడాది వరదలతో ప్రాజెక్టు దెబ్బతిన్న నేపథ్యంలో.. ఈసారి ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు పూర్తిగా నిండకముందే గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కడెం నుంచి వస్తున్న ఈ ప్రవాహాలు, ఇతర వాగులు గోదావరికి తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 42వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది.
మేడిగడ్డ దిగువ నుంచి ఉప్పొంగుతూ..
గోదావరి నదికి ప్రాణహిత తోడవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్ నుంచి భారీ వరద కొనసాగుతోంది. గేట్లన్నీ ఎత్తి ఉండటంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు దిగువకు వెళ్లిపోతున్నాయి. ఈ ప్రవాహానికి ఇంద్రావతి వరద కలసి.. తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్‌లోకి 8,23,450 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటికి దిగువకు వదిలేస్తున్నారు.
మధ్యలో వాగులు, వంకల ప్రవాహం తోడై.. దుమ్మగూడెం (సీతమ్మ సాగర్) బరాజ్‌లోకి 9,01,989 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఆ తర్వాత తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రవాహాలు కలుస్తూ.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది.
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస శిబిరాలను సిద్ధం చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. రాత్రి 11 గంటలకల్లా నీటిమట్టం 44.8 అడుగులకు చేరింది. ఇది 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
ఏపీలో శబరి దూకుడు..
ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో భారీ వర్షాలతో ఏపీలోని శబరి ఉప నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద నీటిమట్టం 36.74 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి 8,57,707 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే ఎగువన నీటిమట్టం 32 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి.. వచ్చిన నీటిని అంతా దిగువకు వదిలేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బరాజ్‌లోకి 7,74,171 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను వదులుతూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు.
ఇప్పటికే 149 టీఎంసీలు సముద్రం పాలు..
ప్రస్తుత నీటి సంవత్సరంలో.. అంటే ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ధవళేశ్వరం బరాజ్ నుంచి 149.03 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి ధవళేశ్వరం బరాజ్ నుంచి 77.79 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరీవాహక ప్రాంతాల్లో ఆదివారం కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు.
మేడిగడ్డ అలా... అన్నారం ఇలా..
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వానలతో ప్రాణహిత పోటెత్తి మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. అక్కడ గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరిలో దానికి ఎగువన ఉన్న అన్నారం (సరస్వతి) బరాజ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఎగువ నుంచి ప్రధాన నదిలో ఇన్‌ఫ్లో ఏమీ లేకపోగా.. మానేరు, ఇతర వాగుల నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. ఈ నీరంతా కిందికి వదిలేస్తున్నా.. గోదావరి చిన్న పాయలా ప్రవహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment