ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
ఉద్యోగ అవకాశాలపై రౌండ్ టేబుల్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన వివరించారు. విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’’అనే అంశంపై గురువారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం విద్య, ఐటీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా నైపుణ్య లేమితో ఉపాధి అవకాశాలు కోల్పోరాదని, ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్థులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment