రాష్ట్రంలో 70 ఏళ్లు పైబడిన వారు 5 లక్షల మంది
వారందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డుల అందజేత
పేద, ధనిక సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: డెబ్భై ఏళ్లు ఆపైబడిన వారందరికీ పేద, ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు తెలంగాణలో రంగం సిద్ధమైంది. ఆ వయస్సు వారు తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత వైద్యం అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు అందజేస్తారు.
ఆధార్ కార్డును ఆధారం చేసుకుని వయస్సును లెక్కించి కార్డులు ఇస్తారు. అలా కార్డులు పొందినవారు ఏదైనా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌కు పథకాల పేర్లలో తేడాలు ఉన్నా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశమని అంటున్నారు. ఆరోగ్యశ్రీలో 77.19 లక్షల కుటుంబాలకు వైద్యం అందుతోంది.
ఇందుకు ఏటా సగటున రూ.700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే, దీనికింద కవర్ అయ్యే 26.11 లక్షల కుటుంబాల కోసం సుమారు రూ.200 కోట్ల వరకూ కేంద్రమే భరిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా 5 లక్షల మంది 70 ఏళ్లు పైబడిన వారికి కూడా వైద్యం అందితే అందుకు అవసరమైన నిధులను కేంద్రమే భరిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు.
కలిపి అమలు చేయాలి
ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 972 రకాల వ్యాధులకు చికిత్స అందుతుండగా, ఆయుష్మాన్ భారత్‌లో 1,350 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్‌లోలేని 540 వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 వ్యాధులు ఆయుష్మాన్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటినీ కలిపి అమలు చేయాలని వైద్య వర్గాలు అంటున్నాయి. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు. కానీ ఆయుష్మాన్ భారత్ పథకం వాటికి వర్తిస్తుంది.
కిడ్నీ, లివర్ మారి్పడులు ఆరోగ్యశ్రీలో ఉండగా... ఆయుష్మాన్‌లో లేవు. ఈ రెండు స్కీంలు కలిపితే అన్ని చికిత్సలు ఒకే గొడుగు కిందకి వస్తాయి. ఈ రెండు పథకాల ద్వారా రాష్ట్రంలో అర్హులైన వారికి 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం లభిస్తుంది. ఆయుష్మాన్‌లో చికిత్సల ప్యాకేజీల ధరలు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment